బిజినెస్

ఆసియా వౌలికాభివృద్ధి బ్యాంక్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 16: ఆసియా వౌలికాభివృద్ధి బ్యాంక్ (ఎఐఐబి)ను శనివారం ఇక్కడ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఘనంగా ప్రారంభించారు. భారత్, మరో 56 దేశాలు వ్యవస్థాపక సభ్యులుగా వ్యవహరిస్తున్న ఈ బ్యాంక్‌ను గత నెల 25న బీజింగ్‌లో చైనా స్థాపించినది తెలిసిందే.
100 బిలియన్ డాలర్ల మూలధనంతో, మరో 50 బిలియన్ డాలర్ల అదనపు నిధులతో ఏర్పాటైన ఈ బ్యాంక్ తొలి చైర్మన్‌గా చైనా ఆర్థిక శాఖ మంత్రి లౌ జివి ఎన్నికవ్వగా, తొలి అధ్యక్షుడిగా చైనా మాజీ ఆర్థిక శాఖ మంత్రి జిన్ లిక్విన్ ఉంటారు.
ఇకపోతే ఎఐఐబి ప్రారంభోత్సవానికి మొత్తం 57 సభ్య దేశాల ప్రతినిధులూ హాజరవగా, భారత్ తరఫున కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు క్యార్యదర్శి దినేశ్ శర్మ నేతృత్వంలో బృందం పాల్గొంది. ఎఐఐబి చైనాకు అత్యధికంగా 30.34 శాతం వాటా ఉండగా, భారత్‌కు 8.52 శాతం, రష్యాకు 6.66 శాతం వాటాలున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ ఉపాధ్యక్షుడి హోదా దక్కుతుందని భారత్ భావిస్తోంది. ఇదిలావుంటే ఇంధనం, రవాణా, పట్టణీకరణ, విద్యా, ఆరోగ్యంతోపాటు లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధికి ఎఐఐబి కృషి చేయనుంది.
బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) ఏర్పాటు చేసిన బ్రిక్స్ బ్యాంక్‌తో కలిసి వౌలిక రంగాభివృద్ధికి ఆర్థిక చేయూతనందిస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మాట్లాడుతూ వ్యక్తం చేశారు. శనివారం రాత్రి జరిగే ఎఐఐబి మండలి వ్యవస్థాపక సదస్సునుద్దేశించి చైనా ప్రధాన మంత్రి లి కెక్వియాంగ్ మాట్లాడుతారని అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా, ఈ బ్యాంక్ వ్యవస్థాపక సభ్యత్వానికి అమెరికా, జపాన్ దేశాలు దూరంగా ఉండగా, ఈ దేశాల పెత్తనం అధికంగా ఉన్న ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి)లకు ఎఐఐబి పోటీనిస్తుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే ఎఐఐబికి ఎడిబి అధ్యక్షుడు తకెహికో నకావు ఓ సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు.

చిత్రం.. ఎఐఐబి ప్రారంభోత్సవంలో పాల్గొన్న సభ్య దేశాల ప్రతినిధులు

స్వల్పంగా తగ్గిన
పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ, జనవరి 16: పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధరను 32 పైసలు, డీజిల్ ధరను 85 పైసల చొప్పున తగ్గిస్తూ ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. నిజానికి శుక్రవారం లీటర్ పెట్రోల్‌పై 0.75 పైసలు, డీజిల్‌పై 2 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర పనె్నండేళ్ల కనిష్టానికి క్షీణించి 30 డాలర్ల దిగువకు పడిపోవడంతో చమురు సంస్థలు ధరలను తగ్గించాయి. కాగా, గడచిన రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ప్రభుత్వం ఎక్సైజ్ పన్ను పెంచడం ఇది రెండోసారి. ఎక్సైజ్ సుంకం పెంపుతో ప్రభుత్వ ఖజానాకు అదనంగా 3,700 కోట్ల రూపాయలకుపైగా ఆదాయం సమకూరనుంది. మరోవైపు గడచిన ఆరు వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు తగ్గించడం ఇది నాలుగోసారి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 59.03 రూపాయలుగా, లీటర్ డీజిల్ ధర 44.18 రూపాయలుగా ఉంది.

పెరిగిన మారుతి కార్ల ధరలు
న్యూఢిల్లీ, జనవరి 16: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి.. శనివారం కార్ల ధరలను పెంచింది. అన్ని మోడళ్ల ధరలను 12,000 రూపాయల వరకు పెంచింది. దీంతో ఆల్టో 800, ఎస్-క్రాస్ ధరలు వెయ్యి నుంచి 4 వేల వరకు పెరగగా, బాలెనో ధర 5 వేల నుంచి 12 వేల వరకు పెరిగింది. ఇప్పటికే ఈ నెలలో హోండా, టొయోటా, టాటా మోటార్స్, స్కోడా కార్ల ధరలు పెరిగినది తెలిసిందే.

భారత్‌లో మరిన్ని పెట్టుబడులు: సాఫ్ట్‌బ్యాంక్
న్యూఢిల్లీ, జనవరి 16: రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టాలనుకుంటున్న జపాన్ దేశానికి చెందిన సాఫ్ట్ బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే గడచిన ఏడాది కాలంలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్‌లోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది. శనివారం ఇక్కడ జరిగిన స్టార్టప్ ఇండియా సదస్సులో ఈ మేరకు సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మసయోషి సన్ తెలిపారు. కాగా, స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా భారత్‌లో వ్యాపారాన్ని ప్రారంభించడం, దాని నుంచి బయటకి రావడం సులభతరం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇక్కడ తెలిపారు.

ప్రస్తుత కస్టమర్లకూ వర్తింపు
మొబైల్ చార్జీల్లో 80 శాతం తగ్గింపుపై బిఎస్‌ఎన్‌ఎల్
న్యూఢిల్లీ, జనవరి 16: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. ప్రస్తుత వినియోగదారులకు కూడా మొబైల్ ధరల్లో 80 శాతం తగ్గింపునివ్వాలని నిర్ణయించింది. ఇంతకుముందు ఈ తగ్గింపు కొత్త ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే అమల్లో ఉండగా, ఈ పథకాన్ని ఇప్పటికే బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లుగా ఉన్నవారికీ పొడిగిస్తునట్లు తెలిపింది. శనివారం నుంచి పొడిగింపు వర్తిస్తుందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులందరూ మొబైల్ ధరల్లో 80 శాతం తగ్గింపు పొందనున్నారు.
తెలంగాణ, ఎపి చమురు పరిశ్రమల
కో-ఆర్డినేటర్‌కు ఉత్తమ ప్రతిభ అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చమురు పరిశ్రమ కో-ఆర్డినేటర్‌కు ఉత్తమ ప్రతిభ అవార్డు లభించింది. డొమెస్టిక్, ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకుగాను ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం అందజేసింది. చమురు, సహజ వాయువు పరిరక్షణ పక్షోత్సవాలు (్ఫర్ట్‌నైట్)-2015 సందర్భంగా ఈ అవార్డును పెట్రోలియం పరిరక్షణ పరిశోధన అసోసియేషన్ అందజేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ, ఎపి రాష్ట్రాల స్థాయి కో-ఆర్డినేటర్ సిహెచ్ శ్రీనివాస్ ఈ అవార్డును అందుకున్నారు. కాగా, ఈ అవార్డు లభించడం ఇది మూడో సారి అని కో-ఆర్డినేటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 2013, 2014లో వరుసగా అప్పట్లోని ఎపి ప్రభుత్వం తరఫున ఈ అవార్డును పౌర సరఫరాల శాఖ కమిషనర్ అందుకున్నారు.

మార్కెట్లకు ముడి చమురు సెగ
వారాంతపు సమీక్ష

అంతర్జాతీయంగా ధరల పతనంతో నష్టాల్లో సూచీలు
పెట్టుబడుల ఉపసంహరణలో విదేశీ మదుపరులు
సెనె్సక్స్ 479, నిఫ్టీ 163 పాయింట్లు క్షీణత

ముంబయి, జనవరి 16: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పతనమైన నేపథ్యంలో విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయంగా ఆయా దేశాల స్టాక్ మార్కెట్ల నష్టాలూ ఇందుకు కారణమయ్యాయి. ఫలితంగా వరుసగా రెండో వారం నష్టాలను నమోదు చేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 479.29 పాయింట్లు క్షీణించి 24,455.04 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 163.55 పాయింట్లు దిగజారి 7,437.80 వద్ద స్థిరపడింది. దీంతో గడచిన రెండు వారాల్లో సెనె్సక్స్ 1,705.86 పాయింట్లు, నిఫ్టీ 525.40 పాయింట్లు కోల్పోయినట్లైంది.
కాగా, 30 డాలర్ల దిగువకు బ్యారెల్ ముడి చమురు ధరలు పడిపోవడం విదేశీ మదుపరులలో భయాందోళనలు రేకెత్తాయని నిపుణులు విశే్లషిస్తున్నారు. అలాగే వరుసగా ఐదో నెల వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుతూ డిసెంబర్‌లో 5.61 శాతానికి చేరడంతో రాబోయే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)కున్న అవకాశాలు సన్నగిల్లాయన్న భావన కూడా మార్కెట్లను నష్టాల్లోకి నెట్టిందని నిపుణులు అంటున్నారు. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం వరుసగా 14వ నెల మైనస్‌లోనే కొనసాగినప్పటికీ, ఆహార ద్రవ్యోల్బణం ఎగిసిపడటం పెట్టుబడులకు ప్రతికూలంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అంచనాలకు మించి లాభాలను అందుకున్నప్పటికీ, టిసిఎస్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం కూడా మార్కెట్లను ప్రభావితం చేసిందంటున్నారు. ఇకపోతే రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, మెటల్, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, చమురు, గ్యాస్, ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్ రంగాల షేర్ల విలువ 7.76 శాతం నుంచి 0.75 శాతం పతనమైంది. టెక్నాలజీ రంగ షేర్ల విలువ మాత్రం స్వల్పంగా 0.17 శాతం పెరిగింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 5.90 శాతం, స్మాల్-క్యాప్ 7.46 శాతం చొప్పున పడిపోయాయి. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 16,139.55 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 91,174.44 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 18,182.70 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 89,534.28 కోట్ల రూపాయలుగా ఉంది.

షారూఖ్ ఖాన్‌ను మించిన
నరేంద్ర మోదీ ట్విట్టర్ ఫాలోయర్లు

న్యూఢిల్లీ, జనవరి 16: ట్విట్టర్ ఫాలోయర్స్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ను అధిగమించి భారత్‌లో రెండో స్థానంలో నిలిచారు. సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్‌లో మోదీకి శనివారం నాటికి 1,73,71,600 మంది ఫాలోయర్లున్నారు. ఆ తర్వాత షారూఖ్ ఖాన్ 1,73,51,100 మందితో మూడో స్థానంలో ఉన్నారు. కాగా, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు అత్యధికంగా ట్విట్టర్‌లో కోటీ 89 లక్షల మంది ఫాలోయర్లున్నారు. అమితాబ్‌కు దరిదాపుల్లో ఇప్పుడు మోదీనే ఉండగా, క్రమక్రమంగా మోదీకి ఫాలోయర్లు పెరుగుతూపోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 22న మోదీ ట్విట్టర్ ఫాలోయర్లు కోటీ 50 లక్షల మార్కును దాటగా, నవంబర్ 20న కోటీ 60 లక్షల మార్కును దాటిపోయారు. ప్రస్తుతమిది కోటీ 70 లక్షలకు చేరింది. అంటే దాదాపు రెండు నెలల్లోనే మోదీకి ట్విట్టర్ ఫాలోయర్లు 10 లక్షలకుపైగా పెరిగిపోవడం గమనార్హం. 2009 నుంచి ట్విట్టర్‌లో మోదీ ఉండగా, భారతీయ రాజకీయవేత్తల్లో అత్యధిక ఫాలోయర్లున్న నేత మోదీనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా రెండో వ్యక్తి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానంలో ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్, మన్‌కీబాత్, ప్రభుత్వ ప్రగతి, దేశాభివృద్ధి అంశాలతో ట్విట్టర్‌లో తన ఫాలోయర్లకు మోదీ అనుసంధానమవుతున్నారు.

ఈసారి జిడిపి 7 శాతం మించదు

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం

న్యూఢిల్లీ, జనవరి 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు 7 శాతం దిగువన నమోదయ్యే అవకాశాలున్నాయని కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈసారి జిడిపి వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంటుందని అంచనా వేసిన నేపథ్యంలో చిదంబరం 7 శాతం దాటే అవకాశాలు కనిపించడం లేదన్నారు. శనివారం ఇక్క డ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం దేశ జిడిపి వృద్ధిరేటు 8.1 శాతంగా ఉంటుందని ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది. దాన్నిప్పుడు 7.1 శాతానికి తీసుకొచ్చింది. కానీ 7 శాతాన్ని కూడా దాటలేదని నాకనిపిస్తోంది.’ అని అన్నారు. కీలకమైన ఎగుమతులు గత 13 నెలలుగా పతనమవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా చిదంబరం గుర్తుచేశారు. నవంబర్‌లో పారిశ్రామిక రంగంలోని 24 రంగాల్లో 17 రంగాల్లో వృద్ధిరేటు లేదని, క్యాపిటల్ గూడ్స్ రంగమైతే 24 శాతం క్షీణించిందని పేర్కొన్నారు. అంతర్జాతీ యంగా ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో రాబోయే 10, 20, 30 సంవత్సరాల్లో భారత జిడిపి వృద్ధిరే టు 8 శాతానికి తగ్గకుండా చూసు కోవాల్సిన అవసరముందన్నారు.

అమెరికాకు ప్రభుత్వ బృందం

స్మార్ట్‌సిటీపై అధ్యయనం ౄ వచ్చే నెలలో పర్యటించే అవకాశం

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 16: స్మార్ట్‌సిటీపై అధ్యయనం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలువురు అధికారులతో కూడిన బృందం వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనుంది. ‘స్మార్ట్ సొల్యూషన్స్ ఫర్ స్మార్ట్‌సిటీస్ రివర్స్ ట్రేడ్ మిషన్’ పేరిట ప్రభుత్వ ప్రతినిధుల బృందం అమెరికా పర్యటనలో పాల్గొంటుంది. అమెరికా ప్రకటించిన మూడు స్మార్ట్‌సిటీల్లో విశాఖ ఒకటన్నది తెలిసిందే. కాగా, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఇద్దరు, మహా విశాఖ నగర పాలక సంస్థ (జివిఎంసి) నుంచి ముగ్గురు, విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నుంచి ఇద్దరు అధికారులు అమెరికాలో పర్యటించనున్నారు.
ఈ బృందం అమెరికాలోని వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, తదితర పట్టణాల్లో అభివృద్ధి, ఇతర అంశాలను పరిశీలిస్తుంది. ఇప్పటికే యునైటెడ్‌స్టేట్స్ ట్రేడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యుఎస్‌టిడిఎ) ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం విశాఖ నగరంలో స్మార్ట్‌సిటీ అధ్యయనం చేస్తోంది. వచ్చే ఆరు నెలల కాల వ్యవధిలో విశాఖను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దే క్రమంలో సమగ్ర పథక నివేదిక (డిపిఆర్) ఇవ్వాల్సి ఉంది. నగరంలో వౌలిక సదుపాయాల కల్పన, ప్రజా రవాణా వ్యవస్థ, నిరంతర మంచినీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి పారుదల వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి యుఎస్‌టిడిఎ ఆధ్వర్యంలో డిపిఆర్‌లు రూపుదిద్దుకోనున్నాయి. డిపిఆర్ తయారీకయ్యే మొత్తం వ్యయాన్ని యుఎస్‌టిడిఎ భరించనుంది. నిజానికి అమెరికాలో పర్యటించే ప్రభుత్వ బృందం ఈనెల 19న బయలుదేరాల్సి ఉన్నప్పటికీ నగరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) నిర్వహించనున్న నేపథ్యంలో పర్యటన వాయిదా వేశారు. వచ్చే నెల 4 నుంచి ఐదు రోజుల పాటు ఐఎఫ్‌ఆర్ నిర్వహించనున్నారు. ఈ భారీ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రభుత్వ ప్రతినిధుల బృందం అమెరికా పర్యటనకు బయలుదేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రతినిధుల బృందం అమెరికా పర్యటనను యుఎస్‌టిడిఎ ఇండియా ప్రతినిధి మెహనాజ్ అన్నారీ ధ్రువీకరించారు. ఇటీవల యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాతో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ కేంద్రం ప్రారంభానికి ఎంఓయు కుదుర్చుకున్న సందర్భంగా ఆమె విలేఖరుల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు.

ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని కోరుతున్న ఎయిరిండియా

రూ. 4,300 కోట్లకు ప్రయత్నాలు

న్యూఢిల్లీ, జనవరి 16: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 4,300 కోట్ల రూపాయల నిధులను కోరుతోంది. ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ మధ్య మళ్లీ ఎలాగైనా పుంజుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది ఎయిరిండియా. నిజానికి 2012లో అప్పటి యుపిఎ ప్రభుత్వాన్ని 30,231 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఎయిరిండియా కోరింది. 2021 వరకు ఈ సాయం విడతలవారీగా అందనుండగా, ఇప్పటిదాకా 22,280 కోట్ల రూపాయలను అందుకుంది. మరో 4,300 కోట్ల రూపాయల సాయాన్ని కోరుతోంది.

వచ్చే వారం రెండో విడత

గోల్డ్ బాండ్ పథకం

ప్రకటించిన ఆంధ్రా బ్యాంక్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 16: రెండో విడత గోల్డ్ బాండ్ పథకాన్ని ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభు త్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రాబ్యాంక్ తెలిపింది. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు 22వ తేదీ వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని, దేశవ్యాప్తంగా ఉన్న 2,755 ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్ కార్యాలయాల ద్వారా రెండో విడత సావరిన్ గోల్డ్ బాండ్ పథకంను పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం అమలు చేస్తున్నట్లు బ్యాంక్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం కింద రెండు గ్రాముల నుంచి మొదలుకుని 500 గ్రాముల వరకు గోల్డ్ బాండ్స్ కోసం ఎవరైనా వ్యక్తిగతంగా గానీ, లేదా భాగస్వామ్యంగా గానీ, అసోసియేషన్లు, ట్రస్టుల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రా బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ బాండ్ కాలపరిమితి 8 సంవత్సరాలు ఉంటుందని, ఒకవేళ ఎవరైనా రద్దు చేసుకోవాలని అనుకుంటే ఐదేళ్ల తర్వాత రద్దు చేసుకోవచ్చని తెలిపింది. రిజర్వు బ్యాంక్ ప్రకటించిన మేరకు ఈ బాండ్లపై వడ్డీరేటు ఏడాదికి 2.75 శాతం ఉంటుందని, గ్రాము బంగారం ధర రూ. 2,600 చొప్పున లెక్క గట్టడం జరుగుతుందని బ్యాంక్ వెల్లడించింది. బంగారాన్ని నేరుగా కొనుగోలు చేయకుండా బంగారం విలువకు తగిన బాండ్లను కొనుగోలు చేసేందుకు తమ పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని ఆంధ్రాబ్యాంక్ వెల్లడించింది. అవసరమైతే పెట్టుబడిపై వచ్చే వడ్డీని ఏడాది చివరలో చెల్లిస్తారని స్పష్టం చేసింది. బంగారం ధర హెచ్చు తగ్గుల ప్రభావం నుంచి పూర్తిగా రక్షణ ఉండే విధంగా ఈ పథకం రూపొందించబడిందని, పెట్టుబడి పెట్టాలనుకునే వారు తమకు సమీపంలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.