బిజినెస్

యూరప్‌లో విషపూరిత గుడ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్/బెర్లిన్, ఆగస్టు 12: రోజుకో గుడ్డు తింటే.. ఆరోగ్యానికి ఢోకా లేదన్నది ఒకప్పటి మాటే. నేడు గుడ్డు లాగిస్తే.. అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లే అవుతోందిమరి. యూరప్‌లో పరిస్థితి ఇలాగే ఉందిప్పుడు. యూరోపియన్ యూనియన్ (ఈయు) దేశాల్లో విషపూరిత గుడ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ల్యాబ్ పరీక్షల్లో లక్షలాది గుడ్లలో కీటక సంహారిణి ఫిప్రోనిల్ అవశేషాలు బయటపడుతున్నాయి. ఈ గుడ్లను తీసుకుంటే ఆరోగ్యం సంగతి ఇక అంతేనని వైద్యులు పేర్కొంటున్నారు.
ఫ్రాన్స్, జర్మనీతోపాటు స్వీడన్, బ్రిటన్, ఆస్ట్రియా, ఐర్లాండ్, ఇటలీ, లగ్జెంబర్గ్, పోలండ్, రొమేనియా, స్లోవేనియా, స్లోవేకియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశాలను ఈ విషపూరిత గుడ్లు ప్రభావితం చేశాయి. ఆసియా దేశమైన హాంకాంగ్‌పైనా వీటి ప్రభావం ఉంది. చిక్‌ఫ్రెండ్ అనే ఓ డచ్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పౌల్ట్రీ ఫారాల్లో ఉత్పత్తి అవుతున్న గుడ్లలో కీటక సంహారిణి ఫిప్రోనిల్ అవశేషాలు వెలుగుచూస్తున్నాయి. నెదర్లాండ్స్‌తోపాటు బెల్జియం, జర్మనీ దేశాల్లో ఈ పౌల్ట్రీ ఫారాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. తాము ఉత్పత్తి చేసిన గుడ్లను చిక్‌ఫ్రెండ్ సంస్థ కొనుగోలు చేస్తుందని, ఆ సంస్థ సూచనలతోనే ఉత్పత్తి జరుగుతుందని, ఇక్కడి పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కాగా, ఫిప్రోనిల్ అనేది విరివిగా వాడుతున్న ఓ కీటక సంహారిణి. కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువుల బొచ్చు (వెంట్రుకలు)పై జీవించే గోమార్లు తదితర క్రీములను నాశనం చేయడానికి ఈ ఫిప్రోనిల్‌ను తరచూ వాడుతారు. కోడి ఈకల్లో ఉండే రెడ్ లీస్ అనే పురుగుల నాశనానికీ పౌల్ట్రీ యజమానులు దీన్ని వాడుతున్నారు. అయితే మనుషులు ఆహారంగా తీసుకునే కోళ్లు, మేకలు, గొర్రెలు ఇతరత్రా జీవుల విషయంలో ఈ ఫిప్రోనిల్‌ను వాడరాదంటూ దానిపై యూరోపియన్ యూనియన్ నిషేధం విధించింది. కానీ రెడ్ లీస్ పురుగుల నిరోధానికి చిక్‌ఫ్రెండ్.. ఫిప్రోనిల్‌ను భారీగా వాడుతోంది. అయితే తన నోటితో ఈకల్లోని పురుగులను తినే అలవాటు కోళ్లకు ఉండటంతో సహజంగానే ఫిప్రోనిల్ కోళ్ల శరీరంలోకి వెళ్లిపోయి, అవి పెట్టే గుడ్లలోకీ చేరిపోతోంది. ఈ గుడ్లను తిన్న మనుషులు అనారోగ్యం బారినపడుతున్నారు. ఈ గుడ్లను తీసుకోవడం వల్ల కీడ్నీలు, లివర్, థైరాయిడ్ గ్రంథి దెబ్బతింటాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈయు నిబంధనల ప్రకారం ఫిప్రోనిల్ స్థాయి కిలో మాంసంలోగానీ, అంతే పరిమాణంలో ఉన్న గుడ్లలోగానీ 0.005 మిల్లీగ్రాములను మించితే ఆ మాంసాన్ని, గుడ్లను అమ్మకూడదు. నిజానికి ఈ స్థాయి ఫిప్రోనిల్ ఆరోగ్యానికి ఏమంత హానికరం కాదు. అయితే 0.72 మిల్లీగ్రాముల ఫిప్రోనిల్ ఆరోగ్యానికి హానికరమే.
ఈ క్రమంలోనే గత నెలలో నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియం దేశాలకు ఈయు హెచ్చరికలు కూడా చేసింది. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో యూరోపియన్ యూనియన్‌లోని దాదాపు అన్ని దేశాల్లోగల పౌల్ట్రీ ఫారాలను ఈయు ఫుడ్ సేఫ్టీ అలర్ట్ సిస్టమ్ స్తంభింపజేసింది. అంతేగాదు అత్యవసర సమావేశానికీ యూరోపియన్ యూనియన్ పిలుపునిచ్చింది. మరోవైపు మాంసం ఉత్పత్తిపైనా ఈ ప్రభావం పడుతోంది. పౌల్ట్రీ మాంసాన్ని ప్రపంచంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఈయు దేశాల్లో జరిగే ఉత్పత్తి స్థానికంగానే ఎక్కువగా వినియోగమవుతోంది. ఇతర దేశాలకు ఇక్కడి నుంచి జరిగే ఎగుమతులు చాలాచాలా తక్కువ. దీంతో ఇప్పుడు ఫిప్రోనిల్ వ్యవహారంతో ఈయు పౌల్ట్రీ రంగం కుదేలవుతోంది. గుడ్లతోపాటు మాంసం కూడా విషతుల్యం కావడమే దీనికి కారణం. ఫలితంగా మాంసం అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది.
2014 గణాంకాల ప్రకారం యూరోపియన్ యూనియన్ దేశాల మాంసం ఉత్పత్తిలో పోలండ్ (13.7 శాతం), ఫ్రాన్స్ (12.7 శాతం), బ్రిటన్ (12.4 శాతం), జర్మనీ (11.4 శాతం), స్పెయిన్ (11.1 శాతం) దేశాలదే అధిక భాగం. ఈ ఐదు దేశాల ఉత్పత్తి ఈయు మొత్తం ఉత్పత్తిలో 61.3 శాతంగా ఉంది. ఇకపోతే బ్రెజిల్, థాయిలాండ్ దేశాల నుంచి ఈయుకు పెద్ద మొత్తంలో మాంసం ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి.

చిత్రాలు.. అమ్మకానికి సిద్ధంగా ఉన్న గుడ్లు
*యూరప్ దేశాల్లోని లాబొరేటరీల్లో గుడ్లను పరీక్షిస్తున్న వైద్య నిపుణుడు