బిజినెస్

బ్లూచిప్ సంస్థలపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయంగా చోటుచేసుకునే పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విప్రో, ఐటిసి, హెచ్‌సిఎల్ టెక్నాలజీ, కొటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐడియా సెల్యులార్, కెయిర్న్ ఇండియా తదితర బ్లూచిప్ సంస్థలు ఈ వారం తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. దీంతో మదుపరులు ఈ సంస్థల లాభనష్టాల ఆధారంగా తమ పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటారని నిపుణులు విశే్లషిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులను శాసిస్తాయని విశే్లషకులు పేర్కొంటున్నారు. ‘గ్లోబల్ మార్కెట్ల కదలికలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ, ముడి చమురు ధరలు, ప్రముఖ సంస్థల ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.’ అని క్యాపిటల్ వయా గ్లోబల్ రిసెర్చ్ లిమిటెడ్ ప్రతినిధి వివేక్ గుప్తా అన్నారు. ‘గత వారం నెలకొన్న ప్రతికూల పరిస్థితులే ఈ వారం కూడా ప్రభావం చూపుతాయని భావిస్తున్నాం.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. ఇకపోతే మంగళవారం చైనా.. గత ఏడాది 2015కు సంబంధించి జిడిపి గణాంకాలను ప్రకటించనుంది. దీని ప్రభావం కూడా మార్కెట్లపై ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 479.29 పాయింట్లు క్షీణించి 24,455.04 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 163.55 పాయింట్లు దిగజారి 7,437.80 వద్ద స్థిరపడింది. గడచిన రెండు వారాల్లోనైతే సెనె్సక్స్ 1,705.86 పాయింట్లు పడిపోతే, నిఫ్టీ 525.40 పాయిం ట్లు కోల్పోయంది.

నేడు ఎఫ్‌టిఎపై భారత్-ఈయూ చర్చలు?
న్యూఢిల్లీ, జనవరి 17: భారత్, ఐరోపా సమాజం (ఈయూ) మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కోసం ఇరువైపుల అధికారులు సోమవారం చర్చలు జరిపే అవకాశాలున్నాయి. ఎఫ్‌టిఎపై గతంలోనూ భారత్, ఈయూ మధ్య సంప్రదింపులు సాగగా, గత 30 నెలలుగా ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఎఫ్‌టిఎపై చర్చలు జరిపేందుకు ఇరు వర్గాల సీనియర్ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2013 మేలో జివికె బయోసైనె్సస్ పరీక్షించిన దాదాపు 700 ఔషధ ఉత్పత్తులపై ఈయూ నిషేధం విధించిన దగ్గర్నుంచి ఎఫ్‌టిఎ చర్చలు వాయిదాపడ్డాయి. 2007 జూన్‌లో ఎఫ్‌టిఎ చర్చలు ప్రారంభమయ్యాయి.

మార్చికల్లా వెయ్యి తపాలా ఎటిఎమ్‌లు
న్యూఢిల్లీ, జనవరి 17: తపాలా శాఖ ఈ ఏడాది మార్చి నాటికి వెయ్యి ఎటిఎమ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అంతేగాక దేశవ్యాప్తంగా ఉన్న 25,000 తపాలా శాఖ కార్యాలయాలను కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తేవాలని కూడా యోచిస్తోంది. ఇప్పటికే 300 ఎటిఎమ్‌లతోపాటు 12,441 తపాలా కార్యాలయాల్లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను అమలు చేసినట్లు తపాలా శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా, తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 1,30,000 గ్రామీణ తపాలా కార్యాలయాలు కూడా ఉన్నాయి.

ఎఫ్‌పిఐలను ఆకర్షించని స్టాక్ మార్కెట్లు

15 రోజుల్లో రూ. 3,500 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి
రుణ మార్కెట్లలోకి రూ. 3,200 కోట్ల రాక

న్యూఢిల్లీ, జనవరి 17: విదేశీ మదుపరులు తమ పెట్టుబడులకు దేశీయ స్టాక్ మార్కెట్ల కంటే రుణ మార్కెట్లు పదిలమని భావిస్తున్నారు. ఈ నెల (1-15)లో ఇప్పటిదాకా రుణ మార్కెట్లలోకి 3,239 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్‌పిఐ)లు.. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ల నుంచి 3,483 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. గడచిన పదిహేను రోజులను గమనిస్తే.. చైనా ఆర్థిక వ్యవస్థ పురోగతిపై అనుమానాలు, సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య నెలకొన్న ఆందోళనలు, ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు ప్రయోగం వంటివి విదేశీ స్టాక్ మార్కెట్లను, దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయ. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 479.29 పాయింట్లు క్షీణించి 24,455.04 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 163.55 పాయింట్లు దిగజారి 7,437.80 వద్ద స్థిరపడింది. గడచిన రెండు వారాల్లోనైతే సెనె్సక్స్ 1,705.86 పాయింట్లు, నిఫ్టీ 525.40 పాయింట్లు కోల్పోయాయ. కాగా, భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులు గత ఏడాది (2015) భారీగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 17,806 కోట్ల రూపాయలు (3.2 బిలియన్ డాలర్లు)గా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 45,856 కోట్ల రూపాయలు (7.4 బిలియన్ డాలర్లు)గా ఉంది. మొత్తం స్టాక్, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 63,662 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది 2014లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. 2012, 2013 సంవత్సరాల్లోనూ లక్ష కోట్ల రూపాయల చొప్పున విదేశీ పెట్టుబడులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చాయి. ఇక రుణ మార్కెట్లలోకి 2014లో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.6 లక్షల కోట్ల రూపాయలు (26 బిలియన్ డాలర్లు)గా ఉంది. 2014లో మొత్తం రెండున్నర లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి తరలివచ్చాయ.
అయతే 2013లో రుణ మార్కెట్ల నుంచి 51,000 కోట్ల రూపాయల (8 బిలియన్ డాల ర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ 2012లో 35,000 కోట్ల రూపాయలు, 2011లో 42,000 కోట్ల రూపాయలు, 2010లో 46, 408 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు.

మరో నాలుగు రాష్ట్రాల్లో
4జి సేవలు ప్రారంభించిన ఐడియా

న్యూఢిల్లీ, జనవరి 17: ప్రైవేటు రంగంలోని అతిపెద్ద టెలికామ్ సంస్థల్లో ఒకటిగా ఉన్న ఐడియా సెల్యులార్ మరో నాలుగు (మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా) రాష్ట్రాల్లో నాలుగో తరం (4జి) మొబైల్ సేవలను ప్రారంభించింది. అంతేగాకుండా మహారాష్ట్ర, గోవా, ఈశాన్య భారతం, ఒడిశా టెలికామ్ సర్కిళ్లలో ఈ ఏడాది మార్చి నాటికి 4జి మొబైల్ సేవలను ప్రారంభించాలని ఈ సంస్థ యోచిస్తోంది. దక్షిణ భారత దేశంలోని నాలుగు టెలికామ్ సర్కిళ్ల పరిధిలోగల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఐడియా సెల్యులార్ గత నెల 23వ తేదీన 4జి సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడు సర్కిళ్ల పరిధిలోని మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 4జి ఎల్‌టిఇ సేవలను ప్రారంభించామని, దీంతో మొత్తం ఏడు టెలికామ్ సర్కిళ్లకు తమ హైస్పీడ్ మొబైల్ సేవలను విస్తరించినట్లయిందని, ఈ ఏడు సర్కిళ్లలోని 183 పట్టణాల్లో ఈ నెలాఖరు నుంచి తమ 4జి సేవలు అందుబాటులోకి వస్తాయని ఐడియా సెల్యులార్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈశాన్య భారత దేశంతోపాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశాల్లోని మరో 3 ప్రధాన సర్కిళ్లలోనూ మార్చి నాటికి 4జి సేవలను ప్రారంభిస్తామని, దీంతో జూన్ నాటికి మొత్తం పది సర్కిళ్లలోని 750 నగరాల్లో తమ హైస్పీడ్ మొబైల్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఐడియా సెల్యులార్ డిప్యుటీ ఎండి అంబరీష్ జైన్ వివరించారు.

రిటైల్ మార్కెట్ పరిమాణం
2020 నాటికి రెట్టింపు
1,200 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం
తాజా నివేదికలో సిఐఐ-బిసిజి అంచనా

న్యూఢిల్లీ, జనవరి 17: దేశంలో ప్రజల ఆదాయం, పట్టణీకరణ రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రస్తుతం 630 బిలియన్ డాలర్లుగా ఉన్న రిటైల్ మార్కెట్ పరిమాణం 2020 సంవత్సరం నాటికి రెట్టింపు స్థాయికి వృద్ధిచెందే అవకాశాలు ఉన్నాయని తాజాగా విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. ‘2015లో 630 డాలర్లుగా ఉన్న భారత రిటైల్ మార్కెట్ పరిమాణం 2020 నాటికి 1,100 నుంచి 1,200 బిలియన్ డాలర్లకు వృద్ధిచెందే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని కార్మిక శక్తికి పెద్ద సంఖ్యలో యువత తోడవుతుండటం, ఆదాయ స్థాయిలు 70 శాతం మేరకు పెరగడం, శరవేగంగా పట్టణీకరణ జరుగుతుండటం ఇందుకు ఎంతగానో దోహదపడతాయి’ అని భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బిసిజి) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. 2020 నాటికి దేశ ఆర్గనైజ్డ్ రిటైల్ రంగం 140 నుంచి 160 బిలియన్ డాలర్లకు, అలాగే ఇ-కామర్స్ రంగం 45 నుంచి 50 బిలియన్ డాలర్ల మేరకు శరవేగంగా వృద్ధి చెందుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. మార్కెట్ పరిమాణం వృద్ధి చెందేందుకు అవకాశాలు చాలా మెండుగా ఉన్నప్పటికీ దేశంలోని రిటైల్ వర్తకులు వీటిని అందిపుచ్చుకుని విజయం సాధించాల్సిన అవసరం ఉందని బిసిజి ఇండియా డైరెక్టర్, సీనియర్ పార్ట్‌నర్ అభీక్ సింఘీ స్పష్టం చేశారు.

కాకినాడకు నిధుల వరద!

స్మార్ట్‌సిటీ కోసం రూ. 336 కోట్లు మంజూరు

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 17: స్మార్ట్‌సిటీగా ఎంపికైన తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, విశాఖపట్నంసహా కాకినాడను ఆకర్షణీయ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ నగరంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 336 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. మంజూరు చేయనున్న నిధుల్లో అధిక శాతం నిధులను గృహ నిర్మాణానికి వినియోగించనున్నారు. నగరంలో 221.18 కోట్ల అంచనాతో 4,608 గృహాలను ఈ పథకంలో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి స్థల సేకరణ ఇప్పటికే పూర్తయ్యింది. గృహ నిర్మాణంతోపాటు మరో 32.26 కోట్ల రూపాయలను వౌలిక సౌకర్యాలకు వెచ్చించనున్నారు. మొత్తం 253.44 కోట్ల రూపాయలను గృహ నిర్మాణాలకు కేటాయించారు. గృహ నిర్మాణం ద్వారా నగరంలో 18,432 మంది జనాభా లబ్ధి పొందనున్నారు. అమృత్ పథకం క్రింద 35.95 కోట్ల వ్యయంతో 60వేల మందికి లబ్ధి చేకూర్చే తాగునీటి పథకాన్ని నగరంలో కొత్తగా చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా 5 కోట్ల 44 లక్షల వ్యయంతో 6-ఎ కాంపోనెంట్ క్రింద 6,200 (హౌస్ సర్వీస్ కనెక్షన్లు) గృహాలకు నీటి సౌకర్యం కల్పించనున్నారు. 28 కోట్ల 75 లక్షల వ్యయంతో 12వేల పైపులైన్లతోసహా గృహాలకు మంచినీటి సౌకర్యం కల్పించనున్నారు. నగరం, నగర జనాభా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఈ నీటి సరఫరా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక క్రింద కూడా నిధులు మంజూరయ్యాయి. 21 ఎస్సీ కాలనీల్లో 12.58 కోట్ల వ్యయంతో 9,903 మంది లబ్ధి పొందే విధంగా వౌలిక సౌకర్యాలను విస్తరించనున్నారు. ఇందులో 4 కోట్ల 65 లక్షల అంచనాలతో రహదారులు, 2 కోట్ల 55 లక్షల అంచనాలతో డ్రెయిన్లు, కోటి 50 లక్షల అంచనాలతో సామాజిక భవనాలు, 2 కోట్ల 33 లక్షలతో పార్క్‌లను అభివృద్ధి చేయనున్నారు. సమగ్ర రహదారుల అభివృద్ధి పథకం క్రింద 41 కోట్ల 13 లక్షలతో నగరంలో మూడు రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. 10 కోట్ల 95 లక్షలతో నగరంలో 7 కిలోమీటర్ల నిడివి మేర 11 వాటర్ డ్రెయిన్లను అభివృద్ధి చేయనున్నారు. పార్క్‌ల ఆధునీకరణ, గ్రీనరీ విస్తరణ ప్రణాళిక క్రింద 12 కోట్ల 12 లక్షల నిధులను వెచ్చించనున్నారు. ఈ పనులు చేపట్టడం వలన కాకినాడ నగరంలో సుమారు 2 లక్షల 70వేల జనాభాకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు పేర్కొన్నారు.