బిజినెస్

ఈ రెండేళ్లు 7.5 శాతం మించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16) గాను భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) యథాతథంగానే ఉంచింది. ఇంతకుముందు వేసినట్లుగానే 7.3 శాతంగా ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) జిడిపి వృద్ధిని సైతం 7.5 శాతంగానే ఉంచింది. అయితే చైనా వృద్ధిరేటును మాత్రం ఈ ఏడాది 6.3 శాతంగా, వచ్చే ఏడాది 6 శాతంగా అంచనా వేసింది. ఈ మేరకు మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ (డబ్ల్యుఇఒ)లో పేర్కొంది. రాబోయే రెండేళ్లలో చైనా ఆర్థిక వృద్ధిరేటు మందగించే వీలుందని, ఇదే సమయంలో భారత్ జిడిపి పరుగులు పెట్టగలదని చెప్పింది. ఇకపోతే వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ అంచనాను ఈ ఏడాదికి 3.4 శాతానికి తగ్గించిన ఐఎమ్‌ఎఫ్.. వచ్చే ఏడాదికి 3.6 శాతంగా ఉంటుందని వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం, చైనా ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు తదితర వస్తు, ఉత్పత్తుల ధరల పతనం, అమెరికా ద్య్రవ పరిస్థితుల్లో అసాధారణ మార్పుల వంటి సవాళ్లను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటేనే వృద్ధి అని ఐఎమ్‌ఎఫ్ స్పష్టం చేసింది.
చమురు ధరల పతనం ప్రమాదమే
అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో పడిపోతున్న ముడి చమురు ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడవేస్తున్నాయని ఐఎమ్‌ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. గడచిన 18 నెలల్లో ముడి చమురు ధరలు 70 శాతం పడిపోయాయని గుర్తుచేసింది. దీనివల్ల చమురు దిగుమతి దేశాలు లాభపడుతున్నా ఎగుమతి దేశాలు తీవ్రస్థాయిలో నష్టపోతున్నాయని, ముఖ్యంగా ధరల క్షీణత.. చమురు, గ్యాస్ సంస్థల భవిష్యత్ పెట్టుబడులకు కత్తెర వేస్తోందని తెలిపింది. కాగా, గత ఏడాది ముడి చమురు ధరలు 50 శాతం పడిపోయాయన్న ఐఎమ్‌ఎఫ్.. ఈ ఏడాది మరో 17.6 శాతం పడిపోవచ్చని అంచనా వేసింది. వచ్చే ఏడాది మాత్రం కొంతమేర కోలుకునే వీలుందని చెప్పింది.

లాభాల్లో
స్టాక్ మార్కెట్లు

20 నెలల కనిష్టం నుంచి కోలుకున్న సూచీలు
సెనె్సక్స్ 291, నిఫ్టీ 84 పాయింట్లు వృద్ధి
ముంబయి, జనవరి 19: వరుస నష్టాల నుంచి తేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభా ల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 291.47 పా యింట్లు పుంజుకుని 24,479.84 వద్ద స్థిరపడగా, ఈ ఏడాది ఆరంభం నుంచి ఒక రోజులో సెనె్సక్స్ ఈ స్థాయి లాభాలను అందుకోవడం ఇదే తొలిసారి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 84.10 పాయింట్లు కోలుకుని 7,400 మార్కును అధిగమించి 7,435.10 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ముడి చమురు ధరల్లో పెరుగుదల స్టాక్ మార్కెట్లను నిలబెట్టింది. ముఖ్యంగా చైనా జిడిపి వృద్ధిరేటు గత ఏడాది 25 ఏళ్లలో కనిష్ట స్థాయికి దిగజారడంతో అక్కడి ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఉద్దీపనలు ప్రకటించనుందన్న సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా మదుపరులను ఉత్సాహపరిచింది. దీంతో భారతీయ మార్కెట్లతోపాటు ఆసియా మార్కెట్లలో మంగళవారం చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 3.22 శాతం నుంచి 0.56 శాతం పెరిగాయి. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 1.53 శాతం నుంచి 2 శాతం పెరిగాయి. ఇక దేశీయ మార్కెట్లలో ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్, టెలికామ్, బ్యాంకింగ్, రియల్టీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఎనర్జీ రంగాల షేర్ల విలువ 3.01 శాతం నుంచి 1.36 శాతం పెరిగింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ 1.75 శాతం వరకు పెరిగాయి.

హెచ్‌జెడ్‌ఎల్ వాటా విక్రయానికి సుప్రీం నో
న్యూఢిల్లీ, జనవరి 19: హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) నుంచి తన మైనారిటీ వాటాను ఉపసంహరించుకోకుండా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కళ్ళెం వేసింది. ప్రస్తుతం ఈ సంస్థలో మెజారిటీ వాటా వేదాంత సంస్థకుంది. ఈ నేపథ్యంలో హెచ్‌జెడ్‌ఎల్ నుంచి ఆ 29 శాతం మైనారిటీ వాటానూ ఉపసంహరించుకోవడానికి ఎందుకు తొందరపడుతున్నారంటూ కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రస్తుతమున్న వాటానే యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది.

క్షీణించిన చైనా వృద్ధిరేటు 2015లో 6.9 శాతంగా నమోదు
గత 25 ఏళ్లలో ఇదే కనిష్టం
బీజింగ్, జనవరి 19: గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా చైనా జిడిపి వృద్ధిరేటు గత ఏడాది పడిపోయింది. మంగళవారం చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బిఎస్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2015లో 6.9 శాతంగా నమోదైంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో ఉన్న డ్రాగన్ ఆర్థిక పరిపుష్ఠిపై అనుమానాలు రేకెత్తిస్తుండగా, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 6.8 శాతంగా నమోదైంది. జూలై-సెప్టెంబర్‌లో 6.9 శాతంగా ఉండగా, 2009 ఆరంభం నుంచి ఇంత పేలవంగా త్రైమాసిక జిడిపి వృద్ధి నమోదవడం ఇదే. కాగా, గత ఏడాది జిడిపి వృద్ధిరేటు 7 శాతంగా నమోదవుతుందని చైనా ప్రభుత్వం వేసిన అంచనాకు కేవలం 0.1 శాతం తక్కువగా వాస్తవ గణాంకాలుండగా, దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటిస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఆర్‌ఐఎల్ రికార్డు లాభం
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో
రూ. 7,290 కోట్లు రాక
న్యూఢిల్లీ, జనవరి 19: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో రికార్డు స్థాయిలో నమోదైంది. మునుపెన్నడూ లేనివిధంగా గత నెల డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల్లో 7,290 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే ఇది 38 శాతం అధికం. క్రిందటిసారి 5,256 కోట్ల రూపాయల నికర లాభాన్ని రిలయన్స్ అందుకుంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో రిలయన్స్ తెలిపింది. ఇక ఆదాయం విషయానికొస్తే ఈసారి అమ్మకాలు 73,341 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అయితే అంతకుముందుతో చూస్తే ఇది 24 శాతం తక్కువ. అంతర్జాతీయ మార్కెట్‌లో పడిపోయిన ముడి చమురు ధరలే దీనికి కారణం.
స్వల్పంగా పెరిగిన హెచ్‌సిఎల్ టెక్ లాభం
న్యూఢిల్లీ, జనవరి 19: ఐటి రంగ సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం గత ఏడాది అక్టోబర్-డిసెంబర్‌లో స్వల్పంగా 0.2 శాతం పెరిగి 1,920 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది 1,915 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 10,341 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 9,283 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు మంగళవారం సంస్థ ప్రకటించింది. జూలై-జూన్ కాలాన్ని సంస్థ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తోంది.

స్పెషల్ లీవ్‌గా
సకల జనుల సమ్మెకాలం
సింగరేణి చైర్మన్ అభ్యర్థనపై
తెలంగాణ సిఎం కెసిఆర్ సానుకూల స్పందన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 19: సింగరేణి కార్మికులపై మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు ఉధృతంగా పాల్గొన్నది తెలిసిందే. ఈ క్రమంలో సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణించడానికి సిఎం సూత్రప్రాయంగా అంగీకరించారు. సోమవారం డివిడెండ్ చెక్కును అందజేయడానికి సిఎం చంద్రశేఖరరావును సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ కలిసినది తెలిసిందే. ఈ సందర్భంగానే సకల జనుల సమ్మె కాలంపై కార్మికులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు. దీనిపై సిఎం స్పందిస్తూ తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని, వారందరి పోరాటంతో ఉద్యమం బలోపేతమైందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్‌గా ప్రకటించడానికి అంగీకరించారు. దీనిపై సింగరేణి యాజమాన్యం వెంటనే చర్చించి విధివిధానాలు ఖరాలు చేయాలని కోరారు.

త్వరలో విద్యుత్ మిగులు
రాష్ట్రంగా తెలంగాణ
ఐఇఇఎమ్‌ఎ డైరక్టర్ జనరల్ సునీల్ మిశ్రా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ త్వరలో విద్యుత్ రంగంలో మిగులు రాష్ట్రంగా అవతరిస్తుందని, ఈ రంగంలో సవాళ్లను ఎదుర్కొనే సత్తా తెలంగాణకు ఉందని ఇండియన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ (ఐఇఇఎమ్‌ఎ) డైరక్టెర్ జనరల్ సునీల్ మిశ్రా అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన ప్రపంచ విద్యుత్ ఫోరం ఎలక్రామా 2016ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి ప్రచారంలో భాగంగా తాము మొదటి రోడ్ షోను తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రారంభించామన్నారు. ఎలక్రామా 2016 అనే ఫోరం ద్వారా తెలంగాణ విద్యుత్ రంగంలో సాంకేతికత, అంతర్జాతీయ దృష్టి, అత్యుత్తమ విధానాలు, సామాజిక, ఆర్థిక, సాంకేతిక కోణంలో నూతన పద్ధతులు, భవిష్యత్తు విద్యుత్ అవసరాల ధోరణులను అధ్యయనం చేశామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ విద్యుత్ సంస్కరణలు అమలవుతున్నాయని, అయతే తెలంగాణ అవతరించిన తర్వాత నూతన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆకర్షణీయమైన పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కానీ కమర్షియల్, సాంకేతిక నష్టాలు తగ్గించడంపై దృష్టిని సారించాలన్నారు. అయతే విద్యుత్ సామర్థ్యం పెంచుకోవడంపై అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో ఎదుర్కొనే సవాళ్ల పరిష్కారానికి తోడ్పడుతామని ఐఇఇఎమ్‌ఎ డైరక్టర్ జనరల్ సునీల్ మిశ్రా స్పష్టం చేశారు. ఇకపోతే దేశ వ్యాప్తంగా 20 రోడ్‌షోలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరులో ఫిబ్రవరి 13 నుంచి 17వ తేదీ వరకు రోడ్‌షోలు నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులను ఆహ్వానించినట్లు చెప్పారు.

శ్రీసిటీని సందర్శించిన
బంగ్లాదేశ్ అధికారుల బృందం

తడ, జనవరి 19: నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న శ్రీసిటీ సెజ్‌ను మంగళవారం బంగ్లాదేశ్ ఎకనామిక్ జోన్స్ అథారిటీకి చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం సందర్శించింది. శ్రీసిటీ సెజ్ రూపకల్పన వౌలిక వసతులపై అధ్యయనం చేసేందుకు ఈ బృందం శ్రీసిటీకి వచ్చింది. గత జూన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు ఆ దేశంలో భారత ఆర్థిక సాయంతో మనదేశ వ్యాపార సంస్థల సహకారంతో రెండు సెజ్‌లకు అంగీకారం కుదిరింది. ఈ సెజ్‌ల ఏర్పాటులో భాగంగా ఎస్‌ఎం షౌకత్ అలీ నేతృత్వంలో ఈ బృందం శ్రీసిటీలో అధ్యయనం కోసం రావడం ప్రాధాన్యత సంతరించుకొంది. శ్రీసిటీ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ సతీష్ కామత్ వీరికి సాదర స్వాగతం పలికి శ్రీసిటీ అభివృద్ధి వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి వివరించారు. శ్రీసిటీలోని పలు పరిశ్రమలను వీరు పరిశీలించారు. పరిశ్రమలకు అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి వసతుల గురించి ఆరా తీశారు. బంగ్లా ప్రతినిధుల రాకపట్ల శ్రీసిటీ ఎండి రవీ సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

భారత్‌లో 2.36 లక్షల అపర కుబేరులు

ఆసియా-పసిఫిక్ దేశాల్లో నాలుగో స్థానం ౄ తాజా నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 19: ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక మిలియనీర్లున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. భారత్‌లో గత ఏడాది 2015 ముగిసేనాటికి 2.36 లక్షల మంది అపర కుబేరులు (హెచ్‌ఎన్‌డబ్ల్యుఐ)న్నట్లు తాజాగా విడుదలైన ఆసియా-పసిఫిక్ 2016 సంపద నివేదిక స్పష్టం చేసింది. జాబితాలో 12.60 లక్షల మంది మిలియనీర్లతో జపాన్ తొలి స్థానం దక్కించుకోగా, చైనా 6.54 లక్షల మందితో రెండో స్థానంలో నిలిచింది. 2.90 లక్షల మందితో ఆస్ట్రేలియా మూడో స్థానం పొందింది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ప్రకారం ఆరున్నర కోట్లు (1 మిలియన్ డాలర్లు), అంతకంటే ఎక్కువ సంపదను కలిగిన వారితో ఈ జాబితా రూపొందింది.
టాప్-10లో చోటు దక్కిన ఇతర దేశాల్లో సింగపూర్ ఐదో స్థానం (2.24 లక్షల మంది మిలియనీర్లు), హాంకాంగ్ ఆరో స్థానం (2.15 లక్షల మంది), దక్షిణ కొరియా ఏడో స్థానం (1.25 లక్షల మంది), తైవాన్ ఎనిమిదో స్థానం (98 వేల మంది), న్యూజిలాండ్ తొమ్మిదో స్థానం (89 వేల మంది), ఇండోనేషియా పదో స్థానం (48,500 మంది)లో ఉన్నాయి. ఇక భారత్‌లోని మిలియనీర్ల సంపద విలువ 4,365 బిలియన్ డాలర్లుగా ఉంటే, చైనాలోని మిలియనీర్ల సంపద విలువ 17,254 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఆసక్తికరంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా మిలియనీర్లున్న దేశాల్లో టాప్-5లో భారత్ ఉన్నప్పటికీ, తలసరి ఆదాయంలో మాత్రం చాలా వెనుకబడిపోయింది. తలసరి ఆదాయం ఆధారంగా భారత్‌లో ఒక్కో వ్యక్తి వద్ద సగటున 3,500 డాలర్లుంటే, ఆస్ట్రేలియా 2 లక్షల 4,400 డాలర్లతో ఆసియా-పసిఫిక్ ప్రాంతాలోని అన్ని దేశాల్లో కంటే ముందుంది. ఈ విషయంలో 1,600 డాలర్లతో పాకిస్తాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది.
ఇకపోతే ఆసియా-పసిఫిక్ దేశాల్లో మొత్తం 35 లక్షల మంది మిలియనీర్లున్నట్లు తాజా నివేదిక తెలిపింది. వీరి వద్ద 17.7 ట్రిలియన్ డాలర్ల సంపద ఉన్నట్లు వెల్లడించింది. అంతేగాక గడచిన పదిహేనేళ్లలో అపర కుబేరులు 115 శాతం పెరిగారని కూడా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లైతే ఈ వృద్ధి 82 శాతంగా నమోదైంది. రాబోయే పదేళ్లలో ఆసియా-పసిఫిక్ దేశాల్లోని మిలియనీర్లు 50 శాతం పెరుగుతారనీ అంచనా వేసింది. 2025 నాటికి 52 లక్షల మందికి చేరుకుంటారని పేర్కొంది. ఈ క్రమంలో భారత్‌లోని మిలియనీర్లలో 105 శాతం వృద్ధి కనిపిస్తుందని, ప్రస్తుతం 2 లక్షల 36 వేలుగా ఉన్న హెచ్‌ఎన్‌డబ్ల్యుఐలు 4 లక్షల 83,800 మందికి చేరుకుంటారంది.

రూ. 50 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం

రాంకీ ఇండియా సిఇఒ లాల్‌కృష్ణ

గాజువాక (విశాఖ), జనవరి 19: విశాఖ సమీపంలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ (జెఎన్‌పిసి) 50 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే విధంగా రాంకీ ఇండియా లిమిటెడ్ కృషి చేస్తోందని ఆ సంస్థ సిఇఒ డాక్టర్ పి లాల్‌కృష్ణ తెలిపారు. మంగళవారం ఫార్మా సిటీలోని రాంకీ కమర్షియల్ హబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఇప్పటివరకు 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, మరో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు. ఫార్మాసిటీలో పూర్తిస్థాయి పెట్టుబడులు వస్తే సుమారు 50 వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుందన్నారు. ఇప్పటికే ఫార్మాసిటీలో 20 వేల మంది ఉపాధి పొందుతున్నారని గుర్తుచేశారు. మరో 15 వేల మంది భవిష్యత్‌లో ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఫార్మాసిటీలోని 65 ఔషధ కంపెనీల్లో ఉత్పత్తి జరుగుతోందని, మరో 15 సంస్థలు నిర్మాణంలో ఉన్నాయని, మరికొన్ని పరిశ్రమలు త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమల నిర్మాణానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారన్నారు. ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామికవేత్తలకు పన్నుల భారం తగ్గుతుందన్న ఆలోచన ఉందని, పరిశ్రమల నిర్మాణానికి కొన్ని రాష్ట్రాలు భారీ రాయతీలను అందిస్తున్నాయని, దీని కారణంగా కొన్ని పెట్టుబడులు అటు వైపు మళ్లినట్లు ఆయన తెలిపారు. అయతే రాంకీ ఫార్మాసిటీలో సకల సౌకర్యాలు ఉన్నాయని, దీంతో పారిశ్రామిక వేత్తలు ఆలస్యంగానైనా పరిశ్రమలను నిర్మించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. కాగా, ఫార్మాసిటీలో ప్రస్తుతం ఉన్న వ్యర్థ రసాయనాల శుద్ధి కర్మాగారాన్ని 20 కోట్ల రూపాయలతో విస్తరించామన్నారు. ఫార్మాసిటీని మరింత విస్తరించేందుకు అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. పారిశ్రామిక వేత్తలకు మెరుగైన సేవలను రాంకీ యాజమాన్యం అందిస్తోందని, అదనంగా ల్యాండ్ ఫిల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీంట్లో భాగంగా స్థలాన్ని కేటాయించాలని ఎపిఐఐసి అధికారులకు ధరఖాస్తు చేసుకున్నట్లు ఆయన చెప్పారు.