బిజినెస్

బ్యాంకులకు బలాన్నిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 12: నిరర్ధక ఆస్తుల విషయమై ‘సందిగ్ధ పరిస్థితి’ని ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశ ఆర్థికాభివృద్ధికి వెన్ను దన్నుగా నిలిచేలా బ్యాంకింగ్ రంగానికి మళ్లీ జవసత్వాన్ని కల్పించే ప్రణాళికను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ప్రపంచ బ్యాంకుతో పాటు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం వారం రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తున్న జైట్లీ గురువారం బోస్టన్‌లో హార్వర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం దేశ బ్యాంకింగ్ వ్యవస్థను సంస్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఆయన చెప్పారు. ‘అంతర్జాతీయంగా అభివృద్ధి దిశ మారుతోంది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థను చక్కదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను అమలులోకి తీసుకొచ్చేందుకు మేము విస్తృత కసరత్తు చేస్తున్నాం. ఇప్పుడు మా అజెండాలో ఉన్న తొలి అంశం ఇదే’ అని జైట్లీ తెలిపారు. గత పాలకులు తమకు మొండి బకాయిలతో సతమతమవుతూ రుణ సేవలను అందించలేని బ్యాంకింగ్ వ్యవస్థను వారసత్వంగా అందించారని, దీంతో దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచేలా బ్యాంకుల సామర్ధ్యాన్ని ఏవిధంగా పెంచాలన్న దానిపై సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, ఈ సమస్యలన్నీ కలసి ప్రైవేటు రంగంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన అన్నారు.
సంవత్సరం క్రితం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.5.02 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నెల చివరి నాటికి గణనీయంగా పెరిగి రూ.6.41 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే పెద్ద పెద్ద సంస్థలు తమ పెట్టుబడుల అవసరాల కోసం బాండ్ల మార్కెట్లనో లేక విదేశీ పెట్టుబడులనో ఆశ్రయిచి తక్కువ వడ్డీ రేటుకే రుణాలను సమకూర్చుకోగలుగుతున్నాయని, దీంతో అటువంటి సంస్థలకు ఇబ్బందేమీ ఉండటం లేదని, అయితే చిన్న చిన్న సంస్థలతో పాటు మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకింగ్ రంగం తోడ్పాటును ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉందని జైట్లీ పేర్కొంటూ, దేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, భారత్‌లో ప్రైవేటు రంగం విస్తరించడం లేదనడాన్ని తోసిపుచ్చారు. ప్రైవేటు రంగానికి సంబంధించి కొన్ని సమస్యలున్న మాట వాస్తవమేనని, అయినా ప్రైవేటు రంగం విస్తరిస్తూనే ఉందని, ఇది అపరిమితమైనదని, గత త్రైమాసికంలో ప్రైవేటు రంగం పనితీరు ప్రోత్సాహకరంగా లేకపోయినప్పటికీ పెట్టుబడుల గ్రాఫ్ మాత్రం సానుకూలంగాన ఉందని జైట్లీ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా పురోగమిస్తూ 8 నుంచి 9 శాతం వృద్ధిని సాధించే దిశగా ముందుకు సాగుతున్నప్పుడు ప్రైవేటు రంగం అపరిమితంగా విస్తరించిందని, అయితే ఆ వెంటనే అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిరేటు మందగించడంతో అందులోని చాలా అంశాలు భారత ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావాన్ని చూపాయని ఆయన వివరించారు.

చిత్రం..హార్వర్డ్ యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ