బిజినెస్

బడ్జెట్ పరమైన తోడ్పాటుతో మరింత బలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్, నవంబర్ 12: ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు వీలుగా వాటికి మరింత మూలధనాన్ని సమకూర్చి దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వాలని కేంద్రం నిర్ణయించిందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఆదివారం ఇక్కడ జరిగిన ‘పిఎస్‌బి మంథన్’లో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల అధిపతులను ఉద్ధేశించి ప్రసంగిస్తూ జైట్లీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం మొండి బకాయిలతో తీవ్రంగా సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో 2.11 లక్షల కోట్లతో ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను ప్రకటించిన విషయం విదితమే. బాండ్ల రీక్యాపిటలైజేషన్, బడ్జెట్ పరమైన తోడ్పాటు తదితర అంశాలతో కూడిన ఈ ప్రణాళికను ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేయనుంది. అయితే బడ్జెట్ నుంచి మరిన్ని పెట్టుబడులను అందజేయడంతో పాటు బాండ్ల జారీ, బ్యాంకుల ఈక్విటీ విస్తరణ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనాన్ని సమకూర్చాలని, తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వం సంకల్పించిందని జైట్లీ వివరించారు. ‘బ్యాంకుల వాణిజ్య లావాదేవీల్లో మేము జోక్యం చేసుకుంటున్నామని మీరు అనుకోవద్దు. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయాలంటే కేవలం ఆర్థికపరమైన తోడ్పాటును అందజేయడమే కాకుండా ఈ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా బ్యాంకులను తీర్చిదిద్దాలని మేము ఆకాంక్షిస్తున్నాం’ అని జైట్లీ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కువగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) రంగానికి అటు అంతర్జాతీయ పెట్టుబడులు గానీ, ఇటు బాండ్ల మార్కెట్ గానీ అందుబాటులో లేనందున వాటికి తోడ్పాటును అందజేయడంపై బ్యాంకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోంది. అలాగే విదేశీ పెట్టుబడులు కూడా బాగానే వస్తున్నాయి. వీటికి తోడుగా ప్రైవేటు, ఎంఎస్‌ఎంఇ రంగాలకు ఊతమిచ్చి దేశ ఆర్థిక వృద్ధిరేటు వేగాన్ని పెంచేందుకు మూడో వ్యవస్థ (బ్యాంకింగ్ వ్యవస్థ) కూడా చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2015 మార్చి నెలాఖరు నాటికి రూ.2.78 లక్షల కోట్లుగా నిరర్థక ఆస్తులు ఈ ఏడాది జూన్ నాటికి గణనీయంగా పెరిగి రూ.7.33 లక్షల కోట్లకు చేరుకున్న విషయం విదితమే. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకునేందుకు కేంద్రం గత మూడున్నరేళ్లలో రూ.51 వేల కోట్లకు పైగా పెట్టుబడులను సమకూర్చింది.

చిత్రం..‘పీఎస్‌బీ మంథన్’లో ప్రసంగిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ