బిజినెస్

ధరలు తగ్గుతున్నాయ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: జీఎస్‌టీ పన్నులతో బెంబేలెత్తిన వినియోగదారులకు ఊరట లభించబోతోంది. జన బాహుళ్యం అత్యవసరంగా వినియోగించే అన్ని వస్తువుల రేట్లను తగ్గించాలని ఎఫ్‌ఎంసీజీ సంస్థలు నిర్ణయించాయి. తక్షణ ప్రాతిపదికన ఈ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నామని ముక్తకంఠంతో ప్రకటించాయి. కొత్త ఉత్పత్తుల ధరలను తగిన మార్పులతోనే నిర్ణయిస్తామని అనేక కంపెనీలు స్పష్టం చేయడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించే ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా ఐటిసి, డాబర్, మారికో తదితర ఎఫ్‌ఎంసీజీ సంస్థలు తమ వస్తువుల ధరలను తగ్గించి ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని నిర్ణయించాయి. ఇతర కేటగిరీలకు కూడా ఈ ధరల తగ్గింపును జీఎస్‌టీ మార్పుల ప్రకారం వర్తింపజేస్తామని ఈ కంపెనీలు ప్రకటించాయి. అన్నింటిపైనా పన్నులను గణనీయంగా తగ్గిస్తూ జీఎస్‌టీ మండలి ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కనిష్ఠ జీఎస్‌టీ రేట్లకే సంబంధిత ఉత్పత్తుల విక్రయాలు జరపాలని ఆ తగ్గుదల ప్రయోజనాన్ని అంతిమ వినియోగదారులకు అందేలా చూడాలంటూ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ సంస్థలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. డిటర్జెంట్లు, షాంపూలు, సౌందర్య వస్తువులు సహా మొత్తం 178 వస్తువులపై 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఐటిసి తన ఉత్పత్తుల ధరలను జీఎస్‌టీ నోటిఫికేషన్ ప్రకారం తగ్గించిందని ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు. బ్రూ గోల్డ్ కాఫీ ధరను రూ.145 నుంచి రూ.111లకు తగ్గించినట్లు హెచ్‌యుఎల్ ప్రతినిధి తెలిపారు. ధరలకు సంబంధించి ఏమాత్రం మార్పులు వచ్చినా తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని జీఎస్‌టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందించే విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని తెలిపారు. అలాగే మారికో సంస్థ కూడా అన్ని కేటగిరీల్లోనూ తమ ఎంఆర్‌పి రేట్లను తగ్గించినట్లు వెల్లడించింది. హెయిర్‌జెల్, హెయిర్‌క్రీమ్, బాడీకేర్ లోషన్లు, డియోడరెంట్లు సహా అన్ని ఉత్పత్తుల ధరలను జీఎస్‌టీ నిర్ణయం ప్రకారం సడలించినట్లు వెల్లడించింది. కొత్త ఉత్పత్తులన్నింటినీ కొత్త ఎంఆర్‌పి ప్రకారమే విక్రయిస్తామని, ప్రస్తుతం ఉన్న ఉత్పత్తులను కూడా తగ్గించిన ధరలతోనే విక్రయిస్తామని తెలిపింది. షాంపూలు, స్కిన్‌కేర్, హోమ్‌కేర్ వస్తువుల ధరలను తొమ్మిది శాతం చొప్పున తగ్గించినట్లు డాబర్ ఇండియా కూడా ప్రకటించింది. తక్షణ ప్రాతిపదికన కొత్త ఉత్పత్తుల ఎంఆర్‌పి ధరలనూ మార్చినట్లు వెల్లడించింది. జీఎస్‌టీ మార్పుల ప్రకారమే తగ్గింపు ధరలతో తమ ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తామని పతంజలి సంస్థ ప్రతినిధి కూడా ప్రకటించారు.