బిజినెస్

తొందరపాటే అవుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, డిసెంబర్ 2: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 6.3 శాతానికి పెరగడాన్ని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వాగతించారు. అయితే క్రితం అయిదు త్రైమాసికాలలో దిగజారిన జీడీపీ తిరిగి పురోగమన పథం పట్టిందని చెప్పడం తొందరపాటే అవుతుందని ఆయన పేర్కొన్నారు. జీడీపీ ప్రస్తుత వృద్ధి రేటుతో గత యుపిఏ ప్రభుత్వ పదేళ్ల పాలనలో నమోదయిన సగటు వృద్ధి రేటుకు సమానమైన వృద్ధి రేటును సాధించడం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ‘జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.3 శాతం నమోదయింది. ఇది స్వాగతించాల్సిన అంశమే. అయితే దీని ఆధారంగా, అంతకు ముందు అయిదు త్రైమాసికాలలో తిరోగమించిన వృద్ధి రేటు తిరిగి పురోగమన పథం పట్టిందని చెప్పడం తొందరపాటే అవుతుంది’ అని ఆర్థికవేత్త కూడా అయిన మన్మోహన్ సింగ్ శనివారం ఇక్కడ వ్యాపారవేత్తల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థలో ఇన్‌ఫార్మల్ సెక్టర్ వాటా సుమారు 30 శాతం ఉందని, అయితే నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు ఈ రంగంపై చూపిన ప్రభావాన్ని సెంట్రల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం (సీఎస్‌ఓ) సరిగా గణించలేదని కొంతమంది ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ‘జీడీపీ వృద్ధిపై ఇప్పటికీ గణనీయమైన అనిశ్చితి నెలకొని ఉంది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) 2017-18లో వృద్ధి రేటు 6.7 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఒకవేళ 2017-18లో వృద్ధి రేటు 6.7 శాతానికి చేరుకున్నా, మోదీజీ నాలుగేళ్ల సగటు వృద్ధి రేటు 7.1 శాతమే ఉంటుంది’ అని ఆర్థికవేత్తలు ఎం.గోవిందరావు, ఎన్‌ఎస్‌సీ మాజీ చైర్మన్ ప్రణబ్ సేన్‌లను ఉటంకిస్తూ మన్మోహన్ సింగ్ అన్నారు. యుపిఏ ప్రభుత్వ హయాంలో సాధించిన వృద్ధి రేటుకు సమానమయిన వృద్ధి రేటును మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించలేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. ‘యుపిఏ పదేళ్ల పాలనలో సాధించిన సగటు వృద్ధి రేటును సాధించాలంటే, అయిదో సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 10.6 శాతం వృద్ధి చెందాల్సి ఉంటుంది. ఇది జరిగితే నేను సంతోషిస్తాను. వాస్తవం చెప్పాలంటే, ఇది జరుగుతుందని నేను అనుకోవడం లేదు’ అని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగం విస్తరించడంతో జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.3 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు వల్ల 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతానికి పడిపోయినప్పటికీ, ఇన్‌ఫార్మల్ సెక్టర్‌పై దాని ప్రభావాన్ని సరిగా లెక్కించలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన మన్మోహన్ సింగ్ అన్నారు. ‘ఏటా జీడీపీ ఒక శాతం నష్టపోతే జాతి చెల్లించాల్సిన మూల్యం రూ. 1.5 లక్షల కోట్లు. ఈ వృద్ధి రేటు ప్రభావం ప్రజలపై ఎంతగా ఉంటుందో ఆలోచించండి. ఉద్యోగాలు పోతాయి. యువత అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది. వ్యాపారాలు మూత పడతాయి. పారిశ్రామికవేత్తలు నిరుత్సాహానికి గురవుతారు’ అని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.

చిత్రం..సూరత్‌లో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్