బిజినెస్

పోర్టుల అభివృద్ధికి శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 6: ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, పోర్టులు అభివృద్ధి చెందితే పరిశ్రమలు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా సోమవారం పరిశ్రమలు, సేవారంగం, రెగ్యులేటరీ సెక్టార్‌లో ప్రగతి, గత రెండేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధానికి పక్కా ప్రణాళిక తయారు చేశామని, రైతుల త్యాగం తన జీవితంలో మర్చిపోలేనన్నారు. పోర్టుల నిర్మాణం జరిగితే పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలు వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. తద్వా రా పిల్లల భవిష్యత్ బాగుపడుతుందన్నారు. తెలుగువారి గౌరవం పెరిగేలా రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ప్రధానంగా రెండు ప్రాజెక్టులు తన ధ్యేయమని, మొదటిది ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మాణం, రెండోది పోలవరం ప్రాజెక్టు నిర్మాణమని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని, రాష్ట్రంలో నదుల అనుసంధానం జరగాలన్నారు. పర్యాటక రంగానికి నాంది పలకటంతో రాష్ట్రంలో సుందరమైన నగరాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, దీనివల్ల ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై మాదిరిగా మనకూ ఒక నగరం కావాల్సి ఉందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉందని, విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, రైలు వ్యవస్థనూ మెరుగు పరుస్తామన్నారు. ‘మీ ఇంటికి మీ భూమి’ ద్వారా భూమి ఎవరి పేరు మీద ఉందో తెలుసుకునే అవకాశం వచ్చిందని చెప్పారు. సంపద పెరగటానికి వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం ఎంతో అవసరమన్న చంద్రబాబు.. చిన్న పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహాన్ని అందిస్తామని, ఆన్‌లైన్ పద్ధతిలో అనుమతులు 14 రోజుల్లో ఇస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధికి మూలాలు గ్రామాలేనని, గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. తాను ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

చిత్రం నవ నిర్మాణ దీక్ష ఐదోరోజు సదస్సులో ప్రసంగిస్తున్న చంద్రబాబు నాయుడు