బిజినెస్

సిరులు కురిపిస్తున్న గ్రీన్ యాపిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలపురం, ఫిబ్రవరి 19: వినూత్న పంటల సాగుకు పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఇప్పుడు మరో సరికొత్త పంట సాగుకు తెరతీశారు. ‘పోయిన చోటే వెతుక్కోవాలి’ అనే నానుడిని నరనరాన వంటపట్టించుకున్న పశ్చిమ రైతాంగం పొగాకు సాగు విస్తీర్ణం తగ్గించాలని ప్రభుత్వం చేస్తున్న సూచనలతో మెల్లమెల్లగా ఇతర పంటలవైపు దృష్టిమళ్లిస్తున్నారు. కొందరు మామిడి, జీడిమామిడి, సుబాబుల్, పామాయిల్ వంటి సంప్రదాయ పంటలవైపు మళ్లుతుండగా, మరికొందరు ఈ ప్రాంతానికి పూర్తి కొత్త అయిన ‘గ్రీన్ ఆపిల్’ సాగుపై దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే సాగు ప్రారంభించిన పలువురు రైతులు లాభాల బాటలో పయనిస్తుండటంతో మరికొందరు అదే మార్గంలో వెళ్లడానికి ఉద్యుక్తులవుతున్నారు. పశ్చిమ మెట్ట ప్రాంతం వాణిజ్య పంటలకు ప్రసిద్ధి. అందులోనూ వర్జీనియా పొగాకు సాగు ఈ ప్రాంతంలో విరివిగా సాగుతుంది. అంతర్జాతీయ ఒప్పందాల నేపథ్యంలో పొగాకు వినియోగంపై పెరుగుతున్న ఆంక్షల నేపథ్యంలో అనివార్యంగా దేశంలోనూ పొగాకు ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీనితో మెల్లమెల్లగా రైతులను పొగాకు సాగు నుండి ఇతర పంటల వైపు మళ్లించే ప్రయత్నాలు గత కొంతకాలంగా సాగుతున్నాయి.
ఇలా ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లుతున్న రైతుల్లో కొందరి దృష్టిని ‘గ్రీన్ ఆపిల్’ ఆకర్షించింది. నీటి శాతం ఎక్కువగా ఉండే ‘గ్రీన్ ఆపిల్’ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. దీనితో వీటి వినియోగం స్థానికంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గోపాలపురం మండలంలో కొందరు రైతులు సాగుకు ముందుకొచ్చారు. మండలంలోని వాదాలకుంటతో పాటు తాడేపల్లిగూడెం మండలంలోని కొమ్ముగూడెంలో గ్రీన్ ఆపిల్ సాగు జరుగుతోంది. గ్రీన్ ఆపిల్ మొక్కలను బంగ్లాదేశ్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడ నుండి రైతుకు చేరడానికి మొక్క ఒక్కింటికి రూ.36 ఖర్చవుతుంది. ఎకరాకు 100 మొక్కలు నాటాల్సివుంటుంది. డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) పద్ధతిలో నీరందించి, ఎరువులు వేయాలి. ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఒకసారి వేసిన తోట సుమారు 25 ఏళ్లవరకు కాపునిస్తుంది. నాటిన ఆరో నెల నుండే దిగుబడి మొదలవుతుంది. ఎకరాకు ఏడాదికి 8 నుండి 10 టన్నుల దిగుబడి లభిస్తుంది. ప్రస్తుతం కాయలను తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలాచెరువు పండ్ల మార్కెట్‌కు తరలిస్తున్నారు. అక్కడ టన్నుకు రూ.10 వేల నుండి రూ.12వేలు వరకు లభిస్తోంది. అంటే ఎకరాకు సుమారు రూ.లక్ష వరకు ఆదాయం లభిస్తోంది. డిసెంబర్, జనవరి మాసాల్లో పంట చేతికి వస్తుంది. టన్ను కాయలు కోయడానికి, మార్కెట్‌కు తరలించడానికి రూ.3500 ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. సాగుతో పాటు కోత, రవాణా ఖర్చులను తీసివేసినా ఎకరాకు గరిష్ఠంగా రూ.75 వేలు ఆదాయం లభిస్తోంది. లాభసాటిగా ఉండటంతో ఇప్పుడిప్పుడే మరికొందరు రైతులు గ్రీన్ యాపిల్ సాగువైపు మొగ్గుచూపుతున్నారు.
గ్రీన్ ఆపిల్ సాగుకు ప్రభుత్వం చేయూత నివ్వాలి
లాభసాటిగా ఉండే గ్రీన్ యాపిల్ సాగుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని జిల్లాకు చెందిన వాదాలకుంట రైతు ఆచంట వెంకటరాజు కోరారు. వ్యాపారులు సరైన ధర ఇవ్వడం లేదు... రైతుల నుండి కిలో రూ.10-12కు కొనుగోలుచేసి, వినియోగదారులకు కిలో రూ.80 వంతున విక్రయిస్తున్నారనీ దీనివల్ల రైతులతోపాటు వినియోగదారులకూ లబ్ధి చేకూరడంలేదని వాపోయారు. దళారులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయిస్తే రైతులకు, వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు. సుగర్ వ్యాధిగ్రస్థులకు ఉపశమనం కలిగించడంలో పేరొందిన ఈ గ్రీన్ ఆపిల్ సాగు గురించి అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సాగుకు అవసరమైన మొక్కలు, ఎరువులు తదితరాలు రైతులకు సబ్సిడీపై అందించాలని కోరారు.

చిత్రం..మార్కెట్‌కు తరలించడానికి సిద్ధంగా ఉన్న గ్రీన్ యాపిల్స్