బిజినెస్

బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 8: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, నదుల అనుసంధానం, పోలవరం, రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వటంతో పాటు విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాలకు భారీ కేటాయింపులు జరుపుతూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంచనా బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి రూపకల్పన చేసిన బడ్జెట్‌లో ప్రతి శాఖకూ ప్రత్యేక ప్రాధాన్యత కల్పించేందుకే కృషి చేసినట్టు కనిపిస్తోంది. శాఖలవారీ కేటాయంపుల వివరాలు పరిశీలిస్తే.. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాల యువతులకు చంద్రన్న పెళ్లికానుక కింద 100కోట్లు కేటాయించారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల ప్రీ, పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీ ఇంబర్స్‌మెంట్, ఎన్టీఆర్ విద్యోన్నతి, ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ, బీసీ స్టడీ సర్కిల్‌కు గతేడాది కంటే 25 శాతం అధికంగా రూ 2వేల 165 కోట్లు కేటాయింపులు జరిపారు. కాపు విద్యార్థులకు రూ 400 కోట్లు, ఆర్ధికంగా వెనుకబడిన కులాల విద్యార్థుల ట్యూషన్ ఫీజుల కింద 700 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. కాపు కార్పొరేషన్‌కు రూ 1000 కోట్లు, వైశ్యుల సంక్షేమానికి రూ 30 కోట్లు కేటాయించారు. చేనేత కార్మికులకు నూలు కొనుగోలుపై రూ 42 కోట్ల రాయితీని కల్పించారు. మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా సబ్సిడీపై మరపడవలు, వలలు, డీజిల్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రజకుల అభివృద్ధికి రూ 70 కోట్లు, దూదేకుల సంక్షేమానికి రూ 40 కోట్లు నారుూ బ్రాహ్మణులకు రూ 30 కోట్లు, అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి సంస్థకు ఆర్థిక సహాయాన్ని రూ 60 కోట్ల నుంచి వంద కోట్లకు పెంచారు. కల్లుగీత కార్మికులకు రూ 70 కోట్లు, వాల్మీకి, బోయలకు రూ 50 కోట్లు, వడ్డెరలకు రూ 50 కోట్లు, విశ్వబ్రాహ్మణులకు రూ 50 కోట్లు, సాలివాహనులకు రూ 50 కోట్లు , సగర, ఉప్పర్లకు రూ 40 కోట్లు, మేదరలకు రూ 30 కోట్లు, కృష్ణబలిజ, పూసలకు రూ 25 కోట్ల మేర కేటాయింపులు జరిపారు. వీటితో పాటు బీసీ సబ్‌ప్లాన్‌ను రూ 12వేల 200 కోట్లతో అమలు చేయనున్నారు.
రూ 11వేల 228 కోట్లతో సాంఘిక సంక్షేమం
సాంఘిక సంక్షేమంలో భాగంగా ఎస్సీ కాంపోనెంట్ కేటాయింపును గత ఏడాది కంటే 14 శాతం పెంచుతూ రూ 11వేల 228 కోట్లు కాగా ఇందులో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలకు రూ 1050 కోట్లు , ఆర్ధిక మద్దతు పథకాలకు రూ 901 కోట్లు, చర్మకారుల సంక్షేమానికి రూ 60 కోట్లు, చిన్నతరహా తోలు పరిశ్రమల ఏర్పాటుకై లిడ్‌క్యాప్ సంస్థకు రూ 40 కోట్లు, డప్పు కళాకారుల పెన్షన్లకు రూ 12 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఎస్సీ కాలనీలలో ఆవాసాలను కలుపుతూ 446 రహదార్లను రూ 452 కోట్లతో నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఎస్టీ కాంపొనెంట్‌ను రూ 4176కోట్లతో ప్రతిపాదించారు. గిరిజన ప్రాంతాల్లో వౌలిక వసతుల కల్పన, రక్షిత మంచినీరు, రహదార్లు, పౌష్టికాహారం, సామాజిక అభివృద్ధికి ఈ నిధులు కేటాయిస్తారు. కాగా రూ 1102 కోట్లతో అల్ప సంఖ్యాక వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. .
మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత
మానవ వనరుల అభివృద్ధిలో భాగంగా రూ 21వేల 612 కోట్లు సెకండరీ విద్యకు, కేటాయించడంతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పోషకాహార భోజన పథకాన్ని అమలు చేయనున్నారు. నాలెడ్జి మిషన్‌లో భాగంగా 8వ తరగతి విద్యార్థినులకు కూడా సైకిళ్లు మంజూరు చేస్తూ ఇందుకోసం బడ్జెట్‌లో 160 కోట్లు కేటాయించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ 100 కోట్లు, మోడల్ పాఠశాలలకు రూ 377 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు.
రూ 4100 కోట్లతో నాలుగో విడత రుణమాఫీ
కాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ 4100 కోట్ల మేర రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ (్ధరల స్థిరీకరణ నిధి) ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది. సూక్ష్మ సేద్య ప్రాజెక్టులకు రూ 1102 కోట్లు, సూక్ష్మ, సేద్య ప్రాజెక్టులకు 42 కోట్లతో సహా వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఉద్యానవన, పట్టు పెంపకం విభాగాలకు రూ 10వేల 97 కోట్ల కేటాయింపులతో అంచనాలు రూపొందించారు. దీంతో పాటు పాడిపరిశ్రమ, పశుగణాభివృద్ధికి రూ 1743 కోట్లు అంచనా వేశారు.
నీటిపారుదల రంగానికి భారీ కేటాయింపులు
రాష్ట్ర అంచనా బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి భారీగా కేటాయింపులు జరిపారు. పోలవరం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి రూ 9వేల కోట్లు మహేంద్రతనయ, వంశధార, తోటపల్లి, ఉత్తరాంధ్ర, సుజల స్రవంతి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, గోదావరి డెల్టా ఆదునీకరణ, చింతలపూడి ఎత్తిపోతల, కృష్ణా డెల్టా ఆధునీకరణ, పట్టిసీమను అత్యధిక స్థాయిలో వినియోగించుకునే సామర్ధ్యం పెంపు, నాగార్జునసాగర్ ఆధునీకరణ, వెలుగొండ ప్రాజెక్టు, సంగం, నెల్లూరు ఆనకట్టలు, సోమశిల ప్రాజెక్టు, సోమశిల, స్వర్ణముఖి లింక్ కాల్వ, తెలుగు గంగ ప్రాజెక్టు, గాలేరు- నగరి, హంద్రీ-నీవా పనులు పూర్తిచేయాలని నిర్ణయించింది.
ఆహార భద్రతకు రూ 3వేల 495 కోట్లు
జాతీయ ఆహార భద్రత చట్టం, జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 2లక్షల 36వేల తెలుపురంగు కార్డులను కొత్తగా మంజూరు చేశారు. చంద్రన్న కానుకల పంపిణీ, విలేజిమాల్స్ ఏర్పాటుతో పాటు గిరిజన ప్రాంతాల్లో పేద మహిళలకు రూ 2480 విలువ కలిగిన 5 కిలోల ఎల్పీజీ సిలెండర్ కనెక్షన్ స్టవ్, రెగ్యులేటర్ ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఆహార భద్రతకు రూ 3495 కోట్లు కేటాయించింది.
గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రూ 23వేల 439 కోట్లతో అంచనాలు రూపొందించారు. గ్రామాల్లో చంద్రన్న బాట పేరిట సిమెంటు రోడ్లు, 103 క్లస్టర్లలో 8వేల నివాసాలకు కమ్యూనిటీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయటంతో పాటు రూ 22వేల కోట్లతో తాగునీటి ప్రాజెక్టుకు ప్రతిపాదనలు బ్యాంకు రుణాల ద్వారా అమలు చేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి రూ 150 కోట్లు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో లభ్యమయ్యే భూగర్భజలాల వినియోగంతో వ్యవసాయ వృద్ధిని సాధించేందుకు ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ జలశ్రీ పథకానికి రూ 200కోట్లు ప్రతిపాదించారు.
విశాఖపట్నం- చెన్నై, చెన్నై- బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లతోపాటు కృష్ణపట్నం పోర్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందింది. వీటితో పాటు సింగిల్ డస్క్ పోర్టల్ ద్వారా అనుమతిచ్చిన పరిశ్రమల స్థాపనకు రూ 3075 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఇనఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఊతమిచ్చే స్టార్టప్ వ్యాపార సంస్థలకు ప్రోత్సాహకాలను అందించేందుకు రూ 100 కోట్లతో పాటు తిరుపతిలో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ కార్యకలాపాలు వెరసి రూ 1007 కోట్లతో ఐటీ రంగాని అభివృద్ధి చేయనున్నారు. ఇంధన వనరులు, వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించే భావనపాడు తీరప్రాంతం, కాకినాడ సెజ్, మచిలీపట్నం తీర ప్రాంతాల అభివృద్ధికి రూ 5140 కోట్ల మేర కేటాయింపులు జరిపారు. రాష్ట్రంలో పల్లెలు, గిరిజన ప్రాంతాల్లోని గ్రామాలకు మరిన్ని బస్సులు నడిపేందుకు రూ. 200 కోట్లు ఆర్టీసికి అందించడంతో పాటు ఆర్టీసీ రాయితీలు పూర్తిచేసేందుకు రూ 290 కోట్లతో సహా రహదార్ల నిర్మాణం, విస్తరణను రూ 4703 కోట్లతో చేపట్టనున్నారు. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, అమరావతి, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, నెల్లూరులలో స్మార్ట్ సిటీస్ మిషన్ అమలు చేస్తోంది. ఇందుకోసం రూ 800 కోట్లతో పాటు పట్టణ, స్థానిక సంస్థలకు అనుబంధంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు రూ 600 కోట్లు, వెలగపూడి, తుళ్లూరు, సచివాలయం, యర్రబాలెంలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ 200 కోట్లు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాథమిక వౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ 75 కోట్లు కేటాయించారు.