బిజినెస్

రూ. 628 కోట్ల పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,మార్చి 21: నష్టాల ఊబిలో పడి మూతపడ్డ కాగజ్‌నగర్ సిర్పూర్ పేపర్‌మిల్లు గేట్లు ఇక తెరుచుకోనున్నాయి. మిల్లు పునరుద్ధరణకు ముందుకు వచ్చిన ఒడిసాకు చెందిన జెకె మిల్స్ యాజమాన్యం ముడిసరుకుతో పాటు ఆర్థిక లావాదేవీల్లో తమకు చేయూతనందించాలని ప్రభుత్వాన్ని కోరగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు సానుకూలంగా స్పందించి రాయితీ ఉత్తర్వులు, పలు మినహాయింపులతో బుధవారం జీవో నెం.18 ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ సుమారు నాలుగువేల మంది కుటుంబాల్లో కొత్త ఆశలకు జీవం పోషినట్లయింది. ఐడిబిఐ బ్యాంక్ ఆధీనంలో ఉన్న సిర్పూర్ పేపర్‌మిల్లు భవితవ్యంపై నాలుగేళ్ళుగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కార్మిక సంఘాలు సాగిస్తున్న పోరాటం కొలిక్కిరావడంతో సాంకేతిక అవరోధాలు అధిగమించి మిల్లు పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగనున్నాయి. పలు దఫాలుగా ప్రభుత్వంతో కీలక చర్చల అనంతరం ఈనెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల సమక్షంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో నష్టాల నుండి మిల్లును గట్టెక్కించేందుకు భారీ ఎత్తున రాయితీ వరాలు కురిపిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. అయితే కొత్తగా జెకె కంపెనీ సిర్పూర్ పేపర్‌మిల్లును తెర్చేందుకు 628 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది. కార్మికులకు చెల్లించాల్సిన వేతన బకాయిలు తదితర ఆర్థికపరమైన అంశాలపై జెకె కాగితం యాజమాన్యం ఈనెల 23న ముంబైలో ఐడిబిఐ, ఇతర బ్యాంకు అధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. 8 బ్యాంకులతో పాటు ఐఆర్‌పి సంస్థలు ఈ కీలక చర్చల్లో పాల్గొననున్నాయి. మిల్లు ఆధునీకరణ పేరిట ఇండస్ట్రియల్ డెవలఫ్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర ఏడు జాతీయ బ్యాంకుల నుండి గతంలో తీసుకున్న రూ.350 కోట్ల అప్పును ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో 2014 సెప్టెంబర్ 27న యాజమాన్యం షట్‌డౌన్ పేరిట కాగితమిల్లు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పులు భారం వడ్డీతో కలిసి రూ.420 కోట్లకు చేరుకుంది. ఆర్థిక లావాదేవిల్లో చేయూతనందించి మిల్లు పునరుద్ధరణలో భాగంగా ముడిసరుకుకు భారీగా ప్రభుత్వం రాయితీలు కల్పించడానికి అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగానే పది సంవత్సరాల వరకు వంద శాతం రాష్ట్ర పరిధిలో జిఎస్టీ పన్ను మినహాయింపు, వందశాతం స్టాంప్‌డ్యూటీ మినహాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తూ క్యాబినెట్‌లో ఆమోదముద్రవేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిల్లు పెట్టుబడిలో 20 శాతం సబ్సిడీ కింద రూ.50కోట్ల పరిమితి వరకు అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. పేపర్‌మిల్లు ఉత్పత్తికోసం అవసరమైన ముడిసరుకులో భాగంగా ప్రభుత్వం సుబాబ్‌లు, బొగ్గు, విద్యుత్, అటవీ శాఖకు సంబంధించి ఇతర కర్రను లక్షా 50వేల టన్నుల వరకు అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంప్ డ్యూటీలతో పాటు ఇతర పన్నులను కూడా మినహాయించేల చర్యలు తీసుకోనుంది. అదే విధంగా విద్యుత్ బకాయిలను మాఫీ చేయడమే గాక పది సంవత్సరాల వరకు విద్యుత్ సరఫరాలో యూనిట్‌కు రూ.3చొప్పున మూడేళ్ళవరకు బిల్లులు వసూలు చేసేలా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఈనెల 23న జరిగే కీలకమైన సమావేశం అనంతరం జెకె మిల్లు యాజమాన్యం ఎస్‌పిఎం మిల్లును తెర్చేందుకు ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా మూతపడ్డ సిర్పూర్ పేపర్‌మిల్లు సంక్షోభం నుండి బయటపడి పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్మిక వర్గాల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.