బిజినెస్

రొయ్యకూ ‘క్రాప్ హాలిడే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 18: అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు అదరగొడుతున్నా దేశీయ మార్కెట్లో ఆక్వా రైతులకు ఆ ఫలితం లభించడం లేదు. గత కొనే్నళ్లుగా ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ధరల విధానంలో కొనసాగుతున్న ఆటుపోట్ల కారణంగా కిలోకు రూ.100కు పైగానే రొయ్యల రైతులు నష్టపోతున్నారు. ఎక్స్‌పోర్టర్లు, దళారీలు సిండికేటుగా మారడంతో తామంతా కోట్లలో నష్టపోతున్నామని ఆక్వా రైతాంగం ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో రొయ్యల సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించాలని రైతులు యోచిస్తున్నారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన ఆక్వా రైతాంగం సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. ఇక ఆక్వా రాజధానిగా పేరొందిన భీమవరంలో త్వరలో కీలక సమావేశం ఏర్పాటుచేసి, క్రాప్ హాలిడేపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు రైతు నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆక్వా రంగంలో ఈ సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వానికి మరో తలనొప్పిగా పరిణమించే అవకాశముంది. ఏటా దేశం నుంచి రూ.37వేల కో ట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు అవుతుండగా, అందులో రాష్ట్రం వాటా రూ.17వేల కోట్లు. ఇందులో గోదావరి జిల్లాలదే సింహభాగం. అలాంటిది క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఎదురయ్యే పరిణామాలు ఊహించవచ్చు.
ఆక్వా ఉత్పత్తులను ఎక్కువ శాతం అంటే మూడు వం తులు గోదావరి జిల్లాల నుంచి సాగు చేస్తున్న సంగతి తెలిసిందే. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వేలాది కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తోంది. గోదావరి జిల్లా ల్లో చాలామంది వరి రైతులు, రైస్ మిల్లర్లు ఆక్వా ఎక్స్‌పోర్టర్లు, ప్రోసెసర్లుగా మారిపోయారు. అలాగే దళారీలు ఉం డడంతో చెరువు తవ్వి రొయ్య, చేప సాగు చేయాలంటే దళారీకి చెప్పి మరీ వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కారణం ఎక్స్‌పోర్టర్, ప్రాసెసింగ్ ప్లాం ట్‌ల గురించి రైతులకు అవగాహన లేకపోవడమే. అంతర్జాతీయంగా ధరల గురించి ఆక్వా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంలేదు. దీంతో దళారీలే ఆధారమవుతున్నారు. అలాగే వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో రైతులు ప్రాధేయపడి మరీ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో పెట్టుబడులకింద పెట్టిన రైతు అందినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితి నే ఎక్స్‌పో ర్టర్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని ఆక్వా రైతు సంఘ నేతలు పేర్కొంటున్నారు. సిండికేట్‌గా మారిపోతున్న ఎక్స్‌పోర్టర్, దళారీల మధ్య నలిగిపోయి, మార్కె ట్ ధర లభించక నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పట్టుబడులు జరుగుతు న్న నేపధ్యంలో 30 కౌంట్ (కిలోకు 30 రొయ్యలు) రూ.380, 40 కౌంట్ రూ.300, 50 కౌంట్ రూ.260, 60 కౌంట్ రూ.250, 70కౌంట్ రూ.240, 80 కౌంట్ రూ.220, 90 కౌంట్ రూ.210, 100 కౌంట్ రూ.200కి మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మూడు మాసాల క్రితం 30 కౌంట్ రూ.400 నుంచి 440, 40 కౌంట్ రూ. 300 నుంచి 380 ధర పలికింది. 50 కౌంట్ రూ.275 నుంచి 320 పలికింది. ఇక ఇదే సీజన్ 2017లో 30 కౌంట్ రూ.520 నుంచి 530, 40 కౌంట్ రూ.420 నుంచి 430, 50 కౌంట్ రూ.320 నుంచి 330 పలికింది. రొయ్యల చెరువు ఎకరానికి కనీసం నాలుగు టన్నుల దిగుబడి వస్తోంది. అంతర్జాతీయ ధరలకు దేశీయ మార్కెట్‌లోని ఎక్స్‌పోర్టర్లు కొనుగోలు చేసే ధరల్లో చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం నుంచి ఎగుమతి చేస్తున్న 60 శాతం అమెరికా, 15 నుంచి 20శాతం యూరప్, మిగిలిన శాతాన్ని చైనా, వియాత్నాం కు ఎగుమతవుతోంది. ఈ దేశాలు ప్రస్తుతం రొయ్యలను కొనుగోలు చేయడం లేదని కారణంగా చూపుతూ తక్కువ ధరలకు రైతుల నుంచి కొనుగోలు చెయ్యడం పరిపాటిగా జరుగుతోంది. ఆక్వా ఉత్పత్తులను దాచుకోవడానికి కోల్డ్‌స్టోరేజ్‌లు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్స్‌పోర్టర్లు చెప్పే ధరకే విక్రయించుకోవాల్సివస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఆక్వా రైతాంగం పట్టుబడుల్లో బిజీగా ఉన్నారు. పట్టుబడులు పూర్తిచేసుకున్న తర్వాత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు భీమవరం వేదికగా సమావేశాన్ని నిర్వహించుకుని క్రాప్ హాలిడేను ప్రకటించనున్నట్లు తెలిసింది.