బిజినెస్

‘అనంత’కు పారిశ్రామిక సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 21: అనంతపురం జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా మారనుంది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. 2010- 15లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఐఐపిపిలో మార్పులు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ (2015-20)ని తీసుకువచ్చింది. నూతన విధానాల్లో భాగంగా రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఆయా ప్రాంతాల అవసరాన్ని బట్టి ప్రాధాన్యత కలిగిన పరిశ్రమలతోపాటు స్థానిక వనరులు, అవసరాలు, ఎగుమతి, వస్తూత్పత్తి, డిమాండ్‌ను బట్టి పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తోంది. కాగా, అనంతపురం జిల్లాలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పండ్లతోటల పెంపకానికి ప్రాధాన్యతనిస్తోంది. అలాగే ఈ ఏడాది లక్ష ఫారం పాండ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే సుమారు 58 వేల ఫారం పాండ్ల నిర్మాణం పూర్తయింది. అంతేగాకుండా గార్మెంట్స్ పరిశ్రమ జిల్లాలో పెద్దఎత్తున విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలతోపాటు బిసిలకు కూడా ఐడిపి క్రింద పలు రాయితీలు ఇస్తూ ప్రోత్సహించనుంది. అలాగే నియోజకవర్గాల వారీగా వంద ఎకరాల్లో భూ సేకరణ చేసి అందులోఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే రాయదుర్గంలో 55 రకాల పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేశారు. ఇందులో రెండు పరిశ్రమలు ఇప్పటికే ఉత్తత్తి ప్రారంభించగా, మరో రెండు పరిశ్రమలు వస్తూత్పత్తికి సిద్ధమవుతున్నాయి. ఇక హిందూపురం పట్టణ ప్రాంతం, పరిసరాల్లో పలు పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో పండ్ల తోటల పెంపకం, ఫారం పాండ్ల నిర్మాణం, నీటి వనరులను పొదుపుగా వాడుకోవడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నందున వీటికి సంబంధించిన పరిశ్రమలు విరివిగా ఏర్పాటు చేయనున్నారు. పివిసి పైపులు, డ్రిప్ పైపులు, మల్చింగ్ షీట్స్ ఉత్పత్తులతోపాటు ప్లాస్టిక్ సంబంధ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. అలాగే మినరల్ ఇండస్ట్రీస్, పల్వనైజింగ్ యూనిట్లు, స్టీల్ (ఉక్కు సంబంధ) ఫ్యాక్టరీలు కూడా రాబోతున్నాయి. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతోపాటు సమీపంలోని ప్రకాశం జిల్లా నుంచి కూడా పివిసి, డ్రిప్ పైపులు, మల్చింగ్ షీట్స్ కోసం అనంతపురం జిల్లాకే రైతులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు.
ఔత్సాహికులకు రాయితీల వరం
పరిశ్రమల ఏర్పాటు వ్యయంలో గరిష్ఠంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు 75 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం రాయితీ ఇవ్వనుంది. జనరల్ కోటాలో పురుషులకు 20 లక్షల రూపాయలు, మహిళలకు 30 లక్షల రూపాయల వరకు రాయితీలో సీలింగ్ విధించింది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో పురుషులకు 30 శాతం, మహిళలకు 45 శాతం పెట్టుబడి రాయతీ ఐదేళ్ల వ్యవధి వరకు సర్కారు వర్తింపజేసింది. అలాగే పవర్ సబ్సిడీ రూ. 1.50, సేల్స్ టాక్స్ సబ్సిడీ వంద శాతం, ఐదేళ్లలో రీయింబర్స్‌మెంట్ అవకాశాన్నీ కల్పించింది. పావలా వడ్డీ, పెట్టుబడి సబ్సిడి ఐదేళ్లు ఇస్తున్నారు. రెగ్యులర్ రీపేమెంట్ పారిశ్రామికవేత్తలకు 9 శాతం రిటర్న్ చేస్తారు. జనరల్ కోటా వారికి ఇనె్వస్ట్‌మెంట్ సబ్సిడీని పురుషులకు 15 శాతం, మహిళలకు 25 శాతం, పవర్ సబ్సిడీని ఒక శాతం ఇవ్వనున్నారు. సేల్స్ టాక్స్, పావలా వడ్డి (పెట్టుబడిపై) రాయితీలు ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు వర్తించినట్లే వీరికీ వర్తింపజేస్తున్నారు. దీంతో దశాబ్దాలుగా కరవుతో కునారిల్లుతున్న అనంతపురం జిల్లాకు పరిశ్రమలు వరం కానున్నాయి. గ్రానైట్ పరిశ్రమలతో పాటు గార్మెంట్ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పాదరక్షల తయారీ, పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసులు తదితర పరిశ్రమలకు ప్రోత్సాహం అందనుంది.