బిజినెస్

విశాఖ విమానాశ్రయంలో సౌకర్యాల లేమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 25: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో వివిధ వర్గాలకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది. ఇంటర్నేషనల్ కార్గో హ్యాండ్లింగ్, పలు ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో ఇతర విమానాశ్రయాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బంగారం దిగుమతులు, ఔషధ, పండ్లు, పూల ఎగుమతులకు సంబంధించి సౌకర్యాలు లేకపోవడంతో ఇతర విమానాశ్రయాల నుంచి ఈ కార్యకలాపాలను నిర్వహించాల్సి వస్తోంది. ఇది వ్యాపార వర్గాలకు, ప్రయాణికులకు ఆర్థిక భారంగా మారుతోంది. దుబాయ్ తదితర గల్ఫ్ దేశాల నుంచి దాదాపు 1000 కిలోల బంగారం దిగుమతి అవుతుంటుందని అంచనా. విశాఖకు ఆయా దేశాల నుంచి నేరుగా విమాన సౌకర్యం లేకపోవడంతో షంషాబాద్ విమానాశ్రయం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల వ్యాపారులు హైదరాబాద్‌లో దిగుమతి చేసుకుని అక్కడ నుంచి తమ ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి. దిగుమతి సుంకంలో కొంత భాగం రాష్ట్రానికి వాటా ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ కోల్పోతోంది. దుబాయ్ నుంచి నేరుగా విశాఖకు విమాన సర్వీసును నడిపేందుకు ఫ్లై ఎమిరేట్స్, తదితర విమానయాన సంస్థలు ముందుకు వచ్చినా, సీట్ల కోటా కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. వారంలో కొన్ని రోజులైనా విశాఖ నుంచి నేరుగా దుబాయ్‌కు విమాన సర్వీసులు నడపాలన్న అభిప్రాయం ప్రయాణికులు, వ్యాపార వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. బ్యాంకాంక్‌ను సందర్శించేందుకు రాష్ట్రం నుంచి వారానికి దాదాపు 900 మంది వెళ్తుంటారని ట్రావెల్ ఏజంట్ల సమాచారం. వీరంతా కోల్‌కతా వెళ్లి బ్యాంకాక్ వెళ్తుంటారు. అక్కడి నుంచి నేరుగా విమాన సౌకర్యం ఉండటంతో తక్కువ చార్జీతో వెళ్లి వస్తున్నారు. విశాఖ నుంచి నేరుగా అక్కడికి విమాన సౌకర్యం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఫార్మా రంగ ఎగుమతులు, పూలు, పండ్లు ఎగుమతులకు సంబంధించి టెంపరేచర్ కంట్రోల్డ్ స్టోరేజీ సౌకర్యం లేక హైదరాబాద్ నుంచి ఎగుమతి చేస్తున్నారు. దీని వల్ల కూడా రాష్ట్రం కొంత మేర ఆదాయం కోల్పోతూ, ఆయా వర్గాలపై అదనపు భారాన్ని మోపుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విశాఖలో సౌకర్యాల కల్పన, నేరుగా వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపాల్సి ఉంది. భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించే ప్రతిపాదన ఉన్నా, అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మూడు సంవత్సరాలు పడుతుంది. అంతవరకూ రాష్ట్రం ఆదాయం కోల్పోకుండా, ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు కల్పించకుండా ఉండటం కంటే తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని వివిధ సంస్థలు కోరుతున్నాయి. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. ఈ అంశాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రితో, ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా ఇడితో, వివిధ విమానయన సంస్థలు, ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్, ఎపి ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్, టూర్సు అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర చర్చించేందుకు ఈ నెల 26న ఇంటర్నేషనల్ ఎయిల్‌లైన్సు సమ్మిట్‌ను విశాఖలో నిర్వహించనున్నారు. ఒకే వేదికపై కలిసి చర్చించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉండవచ్చని భావిస్తున్నారు.