బిజినెస్

నాలుగో వారమూ లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 18: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో వారం లాభపడ్డాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 78.65 పాయింట్లు పుంజుకొని 37,947.88 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 41.25 పాయింట్లు పెరిగి, సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 11,470.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మధ్యలో ఒకరోజు సెలవు వచ్చిన ఈ వారంలో ప్రపంచ కరెన్సీ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి ప్రతికూల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడినప్పటికీ, చివరికి కీలక సూచీలు పటిష్టమయిన స్థితిలో ముగిశాయి. అమెరికా, టర్కీల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమై, ఫలితంగా టర్కీ కరెన్సీ లీరా సంక్షోభంలోకి కూరుకుపోవడం, దాని ప్రతికూల ప్రభావంతో రూపాయి బలహీనపడి చరిత్రలో మొదటిసారి అమెరికా డాలర్‌తో పోలిస్తే కనిష్ట స్థాయి 70.40కి చేరడం మదుపరులు తమ వద్ద ఉన్న స్టాక్‌లను విక్రయించేలా పురికొల్పింది. దేశ వాణిజ్య లోటు పెరగడంతో పాటు చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం మదుపరుల ఆందోళనలను మరింత పెంచాయి.
ఫైనాన్సియల్, మెటల్, పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే, రూపాయి విలువ పడిపోవడం వల్ల లబ్ధి పొందే రంగాలయిన ఐటీ, టెక్నాలజి, హెల్త్‌కేర్ షేర్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ షేర్లు రాణించడం వల్ల కీలక సూచీలు నష్టాలలోకి కూరుకుపోకుండా నిలదొక్కుకోగలిగాయి.
అయితే, జూలై నెలలో వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం (చిల్లర ద్రవ్యోల్బణం), టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం (టోకు ద్రవ్యోల్బణం) తగ్గడం స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపింది. దీంతో పాటు జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల లాభాలు ప్రోత్సాహకరంగా ఉండటం, ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్‌కు కలిసి వచ్చింది. వీటితో పాటు వాణిజ్య చర్చలు పునరుద్ధరించడానికి అమెరికా, చైనా అంగీకారానికి రావడం కూడా నిరుత్సాహకరంగా ఉన్న మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడింది. బీఎస్‌ఈ సెనె్సక్స్ ఈ వారంలో 37,693.19 పాయింట్ల వద్ద ప్రారంభమయి, గరిష్ఠ స్థాయి 38,022.32, కనిష్ట స్థాయి 37,559.26 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 78.65 పాయింట్ల (0.21 శాతం) ఎగువన 37,947.88 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం మూడు వారాలలో కలిసి 1,372.86 పాయింట్లు (3.76 శాతం) పుంజుకుంది. నిఫ్టీ ఈ వారంలో 11,369.60 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 11,486.45- 11,340.30 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 41.25 పాయింట్ల (0.36 శాతం) ఎగువన 11,470.75 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలు కూడా ఈ వారంలో స్వల్పంగా లాభపడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజి, స్థిరాస్తి, వాహన, కన్స్యూమర్ డ్యూరబుల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు ఈ వారంలో రాణించాయి. చమురు- సహజ వాయువు, పీఎస్‌యూలు, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, ఐపీఓలు, విద్యుత్ రంగాల షేర్లు నష్టపోయాయి.