బిజినెస్

‘ఫెరా’ కేసు విచారణకు రావాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: ఫెరా (విదేశీ మారకద్రవ్య నిబంధనల చట్టం) ఉల్లంఘన కేసులో సమన్లను తప్పించుకుని తిరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను సెప్టెంబర్ 9వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఢిల్లీలోని ఒక కోర్టు శనివారం ఆదేశించింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఇంతకుముందు విజయ్ మాల్యాకు ఇచ్చిన మినహాయింపును చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమిత్ దాస్ రద్దు చేశారు. ఫెరా ఉల్లంఘన వ్యవహారంలో తాము జారీచేసిన సమన్లకు ప్రతిస్పందించకుండా విజయ్ మాల్యా తప్పించుకుని తిరుగుతున్నాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గతంలో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన న్యాయస్థానం 2000 డిసెంబర్‌లో మాల్యాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. 1996-98 మధ్య కాలంలో లండన్‌తో పాటు మరికొన్ని యూరప్ దేశాల్లో జరిగిన ఫార్ములా-1 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ లోగోను ప్రదర్శించిన బ్రిటిష్ సంస్థకు విజయ్ మాల్యా 2 లక్షల డాలర్లు చెల్లించారని ఆరోపణలు రావడంతో ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన విషయం విదితమే. రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) నుంచి అనుమతి పొందకుండా మాల్యా ఈ చెల్లింపులు జరిపి ఫెరా నిబంధనలను ఉల్లంఘించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. విదేశాల్లో కింగ్‌ఫిషర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు లండన్‌కు చెందిన బెనెటన్ ఫార్ములా లిమిటెడ్ సంస్థతో 1995 డిసెంబర్‌లో కుదుర్చుకున్న ఒప్పందం గురించి మాల్యాను ప్రశ్నించేందుకు నాలుగుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన తమ ఎదుట హాజరు కాలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2000 మార్చి 8వ తేదీన ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. ప్రస్తుతం తుది దశకు చేరుకున్న ఈ కేసు విచారణకు విజయ్ మాల్యాను రప్పించేందుకు వీలుగా ఆయనకు నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తమ న్యాయవాది ఎన్‌కె.మట్టా ద్వారా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యా ఈ కేసు విచారణకు హాజరు కావడం ఎంతో అవసరమని, కనుక గతంలో మాల్యాకు ఇచ్చిన మినహాయింపును రద్దుచేసి ఇకమీదట జరిగే ప్రతి విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విన్నవించింది. ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఇటీవల మనీ లాండరింగ్ కేసులో విజయ్ మాల్యాను ‘నేరస్థుడి’గా ప్రకటించి బహిరంగ వారెంట్ జారీ చేసిన విషయాన్ని మట్టా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఫెరా ఉల్లంఘన కేసులో మాల్యాకు 2000 డిసెంబర్‌లో వ్యక్తిగత హాజరు నుంచి ఇచ్చిన మినహాయింపును రద్దు చేయాలని కోరారు. దీంతో మాల్యాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును న్యాయస్థానం రద్దు చేయడంతో పాటు సెప్టెంబర్ 9వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆయనను ఆదేశించింది.