బిజినెస్

నౌకా నిర్మాణ రంగంపై దక్షిణ కొరియా ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నౌకా నిర్మాణ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా సంస్థలు ఆసక్తి కనబరిచాయి. నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో సాంకేతికతను అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దక్షిణ కొరియాలో భారత కాన్సులేట్ జనరల్ నేతృత్వంలో ఆ దేశ పారిశ్రామికవేత్తల బృందం సోమవారం కలిసింది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించింది. ఏపీలో ఆహార, వస్తు తయారీ పరిశ్రమలు, నౌకా నిర్మాణం, పారిశ్రామిక నిర్మాణ రంగంపై ప్రధానంగా కొరియా పారిశ్రామికవేత్తలు దృష్టి పెట్టారు. అంతకుముందు వీరు సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై, పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి తెలుసుకున్నారు. సముద్ర తీరం ఎక్కువగా ఉన్న ఏపీలో నౌకా నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఇద్దరికీ లాభదాయకమన్న అభిప్రాయానికి వచ్చారు. ఇదే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో కొరియా ప్రతినిధులు తెలిపారు. దీంతో పాటు సముద్ర వాణిజ్యంపై కూడా ఆసక్తి ఉందని వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఏపీలో అనేక ఓడరేవులను అభివృద్ధి చేస్తున్న తరుణంలో నౌకా నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అభిలషణీయమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ కేంద్రంగా ఉన్న కొరియాలోని బుసాన్ నగరం నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. సముద్ర రవాణాలో తాము దేశంలో రెండో స్థానంలో ఉన్నామని, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందడం వల్ల తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఏపీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని వివరించారు. ఏపీలో జలమార్గాలను అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ నుంచి మూడు రాష్ట్రాలకు జలమార్గం ద్వారా సరకు రవాణా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నదులు, కాలువలు, సముద్ర తీరం ఉండటంతో నౌకా నిర్మాణానికి, నౌకా వాణిజ్యానికి అనుకూలంగా ఉంటుందన్నారు. కియా మోటార్స్ తరహాలోనే నౌకా నిర్మాణం, సముద్ర ఆధారిత పరిశ్రమల ఏర్పాటులో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి, దక్షిణ కొరియాకు కొన్ని అంశాల్లో సామీప్యత ఉందన్నారు. దక్షిణ కొరియా ప్రజలు సృజనతో క్రియాశీలకంగా ఉంటారని, దాని ప్రేరణతో ఏపీలో బుసాన్ తరహా పారిశ్రామిక నగరాన్ని తీర్చిదిద్దేందుకు నిర్ణయించానన్నారు. కొరియా దేశపు పరిశ్రమలతో అనంతపురం జిల్లా ఆటో హబ్‌గా మారిందని, అదే తరహాలో అమరావతిలో కూడా పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో కొరియన్ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుకు ఒప్పదం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బుసాన్ నుంచి మరిన్ని పరిశ్రమలు ఏపీకి తీసుకువచ్చేందుకు సహకరించాలని కోరారు. ఈ భేటీలో ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో జాస్తి కృష్ణ కిషోర్, మంత్రి అమరనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమైన దక్షిణ కొరియా ప్రతినిధి బృందం