బిజినెస్

‘ఐటీ’కి వౌలిక సదుపాయాల గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 24: విశాఖను ఫిన్‌టెక్ వ్యాలీగా, ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెపుతోంది. ఇందుకోసం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో అన్ని హంగులు ఉన్న విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి తపన పడుతున్నారు. ఇందులో భాగంగా కొద్ది నెలల కిందట బ్లాక్‌చైన్ టెక్నాలజీని రాష్ట్రానికి పరిచయం చేశారు. గత సంవత్సరం ఫిన్‌టెక్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సంవత్సరం వన్ మిలియన్ డాలర్స్ ఫిన్‌టెక్ ఉత్సవాన్ని నిర్వహించి, భారీ ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ఫిన్‌టెక్ నిర్వాహకులు చెపుతున్నారు. ముఖ్యమంత్రి ఆశిస్తున్న విధంగా విరివిగా ఐటీ కంపెనీలు విశాఖకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గడచిన నాలుగేళ్లలో విశాఖ నుంచి ఐటీ ఉత్పత్తుల వృద్ధి సామాన్యంగానే ఉంది. పేరొందిన ఐటీ కంపెనీలు విశాఖకు వచ్చేందుకు ముఖం చాటేస్తున్నాయి. ఎందుకంటే, ఆ కంపెనీలకు కావల్సిన వౌలిక సదుపాయాలు ఇక్కడ అంతగా లేవు. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కోరుకునే సిటీ లైఫ్ విశాఖలో ఇంకా మొదలవలేదు.
ఫిన్‌టెక్ పరిశ్రమలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వన్ మిలియన్ డాలర్ల ఫిన్‌టెక్ ఛాలెంజ్ పేరుతో పలు దేశాల్లో పోటీలను నిర్వహించింది. దీనివలన ప్రపంచ దేశాలు విశాఖవైపు చూసేందుకు చేస్తున్న ప్రయత్నంలో విజయం సాధించామనే చెప్పాలి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఫిన్‌టెక్ ఫెస్టివల్ ద్వారా ఎన్ని కంపెనీలు విశాఖకు, లేదా రాష్ట్రానికి రానున్నాయి? ఇప్పటికే 15 వేల ఉద్యోగాలు వస్తాయని, 500 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని, 70 స్టార్టప్ కంపెనీలు వస్తాయని ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఈ ఉద్యోగాలు రావని, సమీప భవిష్యత్‌లో వస్తాయని ఫిన్‌టెక్ ఉత్సవ నిర్వాహకులు చెప్పారు. అయితే, ఇందుకు తగిన కనీస వసతులు విశాఖలో ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి!
విశాఖలో సుమారు 20 ఏళ్ల కిందట హెచ్‌ఎస్‌బీసీని ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ కంపెనీలు విశాఖకు రాలేదు. 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ కంపెనీలో స్థానికులకు పెద్దగా ఉద్యోగాలు రాలేదు. ఫిన్‌టెక్ కోసం తీసుకున్న భవనం పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. ఫిన్‌టెక్ ఇంకుబేషన్ సెంటర్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. నగర నడిబొడ్డున నిర్మించిన విప్రో, టెక్ మహీంద్రలో అంతంతమాత్రంగానే ఉద్యోగులు పనిచేస్తున్నారు. టెక్‌మహీంద్రలోని కొంత స్థలాన్ని వేరే ఐటీ కంపెనీలకు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఐటీ ప్రగతి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫిన్‌టెక్ పరిశ్రమలు విశాఖలో అడుగుపెట్టాలంటే, ఆ టెక్నాలజీ తెలిసిన ఉద్యోగులు ఉండాలి. విశాఖలో ఇప్పుడున్న ఐటీ కంపెనీల్లో పనిచేయడానికి అవసరమైన శిక్షణ పొందిన ఉద్యోగులు దొరకడం లేదు. ప్రస్తుతం నగరంలో 120 నుంచి 150 ఒకమోస్తరు ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. సుమారు 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ వీరికి సగటును నెలకు 12 నుంచి 15 వేల రూపాయలకు మించిన వేతనాలు లభించడం లేదంటే, విశాఖలో ఐటీ రంగం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిన్‌టెక్ పరిశ్రమల్లో పనిచేయడానికి ఉద్యోగులు వెనువెంటనే దొరికే అవకాశం లేదు. అందువలన విశాఖలో ముందుగా ఫిన్‌టెక్ టెక్నాలజీకి సంబంధించి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలాగే పేరొందిన బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ కంపెనీల బ్యాక్ ఆఫీస్‌లను ఇక్కడ నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఫిన్‌టెక్ స్పెషల్ పాలసీని ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిపై ప్రభుత్వం ముందు దృష్టి సారించాలి.
ఇదిలా ఉండగా, విశాఖలో ఐటీ ఉద్యోగులకు కావల్సిన సిటీ లైఫ్ లేకపోవడం పెద్ద లోపం. చాలా కాలంగా ఐటీ దిగ్గజాలైన ఐబీఎం వంటి కంపెనీలు సిటీ లైఫ్ అంశాన్ని ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక టౌన్‌షిప్ నిర్మించాలన్న డిమాండ్ కూడా ఉంది. ప్రస్తుతం రుషికొండ హిల్-1,2,3ల్లో పనిచేసే ఉద్యోగుల రాకపోకలకు బస్సు సౌకర్యం కల్పించడానికి మూడు, నాలుగు సంవత్సరాల నుంచి ఐటీ పరిశ్రమల యజమానులు ప్రయత్నిస్తుంటే, ఇప్పటికి అంతంతమాత్రంగా రవాణా సౌకర్యాన్ని కల్పించారు. ఇదేకాదు, ఇప్పటికీ ఆ కొండలపై వౌలిక సదుపాయాలు లేవు. ఇక, ఐటీ ఉద్యోగులకు ప్రధానమైనది ఎయిర్ కనెక్టివిటీ. అదే ఇక్కడ లేదు. విశాఖ నుంచి ప్రస్తుతం సింగపూర్, కౌలాలంపూర్, కొలంబోకు మాత్రమే నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. సర్వీసు గిట్టుబాటు కాకపోవడంతో ఈనెల 27 నుంచి కొలంబో విమాన సర్వీసును నిలిపివేస్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసును ప్రోత్సహించేందుకు సదరు విమానయాన సంస్థకు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. దీంతో తక్కువ ధరకే సింగపూర్ సర్వీసు గన్నవరం నుంచి నడుస్తుంది. అటువంటప్పుడు విశాఖ ప్రయాణికులు కూడా గన్నవరం నుంచే సింగపూర్‌కు వెళ్లడానికి సుముఖత చూపుతారు. అదే జరిగితే, విశాఖ నుంచి సింగపూర్ సర్వీసు నిలిచిపోయే ప్రమాదం ఉంది. విశాఖ నుంచి వివిధ దేశాలకు నేరుగా ఎయిర్ కనెక్టివిటీ పెంచకపోతే, ఐటీ హబ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు అంతంతమాత్రంగానే వస్తాయి.

చిత్రం..విశాఖలో జరుగుతున్న ఫిన్‌టెక్ సదస్సులో బుధవారం జరిగిన ప్యానల్ డిస్కషన్