బిజినెస్

భారీగా బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇంధన, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్ రంగాల షేర్లకు గట్టి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా బలపడ్డాయి. ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బాగా పుంజుకోవడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 332 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ వంద పాయింట్లు పెరిగి, కీలకమయిన 10,500 పాయింట్లకు ఎగువన ముగిసింది. అయితే, ఆసియా మార్కెట్లలో ఎక్కువ మట్టుకు మంగళవారం నష్టాలను చవిచూశాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమయిన నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లలో భారీగా అమ్మకాలు చోటు చేసుకోవడం వల్ల దాని ప్రతికూల ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. చైనాతో నెలకొన్న వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికన్ డాలర్ విలువ విపరీతంగా పుంజుకొని 16 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. చైనాపై అమెరికా విధించిన వాణిజ్య ఆంక్షల ఫలితంగా చైనా, ఆసియా ప్రాంతంలో మాంద్యం నెలకొంటుందనే భయాందోళనలు మదుపరులలో నిరాశా నిస్పృహలను నింపాయి. 2011 ఆగస్టు నుంచి ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆసియా నుంచి అత్యధికంగా విదేశీ పెట్టుబడులు తరలిపోయాయి. అయితే, భారత్‌లోకి తాజాగా విదేశీ పెట్టుబడులు తరలిరావడంతో పాటు రూపాయి బలపడటం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం మంగళవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం ఇన్‌ట్రా-డేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 37 పైసలు పుంజుకొని, 72.52 వద్దకు చేరడం స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ప్రపంచ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర 0.98 శాతం తగ్గి, ఒక పీపా 69.43 డాలర్లకు చేరుకోవడంతో భారత్ కరెంటు ఖాతా లోటు (సీఏడీ)కు సంబంధించి నెలకొన్న ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. ‘ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ముడి చమురు ధరలు బాగా తగ్గడం వల్ల ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఒక శాతం లాభపడింది. వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.31 శాతానికి తగ్గడం, దేశ పారిశ్రామికోత్పత్తి నిలకడగా ఉండటం, రూపాయి బలపడటం వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక పీపాకు 70 డాలర్లకన్నా దిగువకు పడిపోవడం వంటివి సమీప భవిష్యత్తులో భారత స్టాక్ మార్కెట్లపై గట్టిగా సానుకూల ప్రభావం చూపిస్తాయి’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. బీఎస్‌ఈ సెనె్సక్స్ మంగళవారం పటిష్టమయిన స్థాయి 34,846.90 పాయింట్ల వద్ద ప్రారంభమయినప్పటికీ, ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల జోరు ప్రభావంతో కొద్ది సేపటికే ప్రతికూల జోన్‌లోకి దిగజారి, 34,672.20 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అయితే, మధ్యాహ్నం తరువాత భారీగా కొనుగోళ్లు జరగడంతో అంతకు ముందు చవిచూసిన నష్టాలను పూడ్చుకోవడంతో పాటు 35,185.17 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు సెనె్సక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 331.50 పాయింట్లు (0.95 శాతం) పుంజుకొని, 35,144.49 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిసి 425 పాయింట్లు కోల్పోయింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 10,451.90- 10,595.75 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 100.30 పాయింట్ల (0.96 శాతం) ఎగువన 10,582.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, సోమవారం నాటి లావాదేవీలలో విదేశీ సంస్థాగత మదుపరులు నికరంగా రూ. 832.15 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపరులు రూ. 1,073.84 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం అత్యధికంగా 2.44 శాతం లాభపడింది. ఎన్‌టీపీసీ 2.36 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థల్లో కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, రిల్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, అదాని పోర్ట్స్, ఎంఅండ్‌ఎం, యెస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, వేదాంత, ఐటీసీ లిమిటెడ్, హెచ్‌యూఎల్, టాటా స్టీల్, టీసీఎస్, మారుతి సుజుకి, ఆసియన్ పెయింట్స్ ఉన్నాయి.