బిజినెస్

కెజి బేసిన్ అభివృద్ధికి ఒఎన్‌జిసి రూ. 33,370 కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి.. కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్‌లోని చమురు, గ్యాస్ బ్లాక్ అభివృద్ధికి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడుతోంది. కెజి-డి5లోని 10 చమురు, గ్యాస్ నిక్షేపాలను ఉత్పత్తిలోకి తెచ్చేందుకు 5,076.37 మిలియన్ డాలర్ల (ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రకారం దాదాపు 33,370 కోట్ల రూపాయలు) పెట్టుబడులను పెట్టాలని ఒఎన్‌జిసి నిర్ణయించుకోగా, ఇందుకు సంస్థ బోర్డు కూడా ఆమోదం తెలిపింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని కెజి-డి6 బ్లాక్‌ను ఆనుకునే కెజి-డి5 బ్లాకుంది. కాగా, ఇక్కడ జూన్ 2019 నాటికి గ్యాస్ ఉత్పత్తి, మార్చి 2020కల్లా చమురు ఉత్పత్తి ఆరంభం కావచ్చని ఒఎన్‌జిసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డికె సరఫ్ సోమవారం ఇక్కడ జరిగిన బోర్డు సమావేశం అనంతరం తెలిపారు. కెజి-డి5 బ్లాక్‌లోని క్లస్టర్-2 గ్రూప్‌నకు సంబంధించినదే ఈ పెట్టుబడుల ప్రణాళిక అన్నారు. సముద్ర గర్భంలో 7,294.6 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉందీ కెజి-డి5 బ్లాక్. ఇందులో ఉత్తర భాగం (ఎన్‌డిఎ) 3,800.6 చదరపు కిలోమీటర్లైతే, దక్షిణ భాగం (ఎస్‌డిఎ) 3,494 చదరపు కిలోమీటర్లు. ఎన్‌డిఎలో 11 చమురు, గ్యాస్ నిక్షేపాలున్నాయి. అయితే ఎస్‌డిఎలో యుడి-1 గ్యాస్ నిక్షేపం మాత్రమే ఉంది. వీటిని మళ్లీ క్లస్టర్-1, క్లస్టర్-2, క్లస్టర్-3గా విభజించగా, తొలి రెండు క్లస్టర్లు ఎన్‌డిఎకు చెందినవైతే, క్లస్టర్-3 ఎస్‌డిఎకు సంబంధించినది. అయితే క్లస్టర్-1 లోని గ్యాస్ నిక్షేపం పొరుగున ఉన్న జి-4 బ్లాక్‌తో కలిసి ఉండగా, దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ఉన్న వివాదం కారణంగా ఉత్పత్తి జరగడం లేదని సరఫ్ తెలిపారు. ఇదిలావుంటే నిజానికి 2014లోనే ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి 2018 నుంచి, చమురు ఉత్పత్తి 2019 నుంచి మొదలవుతుందని ఒఎన్‌జిసి చెప్పింది. అయితే ఉత్పత్తికి కష్టతరమైన ప్రాంతాలకు సంబంధించి అధిక గ్యాస్ ధర ఆమోదంలో ప్రభుత్వ జాప్యం కారణంగా ఏడాది ఆలస్యం అవుతోంది.