బిజినెస్

ద్రవ్య లభ్యతే కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఈ ఏడాది భారీగా నష్టపోయిన రంగాల్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్‌బీఎఫ్) కంపెనీలను ప్రధానంగా ప్రస్తావించాలి. ఒకవైపు బ్యాంకింగ్ రంగం మోసాలు.. పరారీలు.. నిష్క్రమణలతో బ్యాంకింగ్ వ్యవస్థ చావు దెబ్బతింటే, ద్రవ్య లభ్యత సక్రమంగా లేకపోవడం వల్ల ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. బ్యాకింగ్ రంగాన్ని చక్కదిద్దడంతోపాటు ఎన్‌బీఎఫ్ కంపెనీలకు ఊరట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ ఏడాది పలు బ్యాంకుల అత్యున్నత అధికారులు వివిధ కారణాల వల్ల తమతమ ఉద్యోగాల నుంచి వైదొలగడం ఒక రకంగా బ్యాంకింగ్ రంగాన్ని బలంగా దెబ్బతీసింది. ఫలితంగా రుణదాతలకు ఏ విధంగానూ ఉపయోగపడని ఆస్తులు (నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్) పేరుకుపోతుండగా, కోర్టులు, ట్రిబ్యూనల్స్‌లో వ్యాజ్యాలు పెరిగాయి. మరోవైపు ఎన్‌బీఎఫ్ కంపెనీలు ద్రవ్య లభ్యత సక్రమంగా లేకపోవడంతో, స్టాక్ మార్కెట్‌లో దారుణంగా దెబ్బతింటున్నాయి. పేరొందిన కంపెనీలు, సంస్థలు కూడా సరిపడినంత ద్రవ్యం అందుబాటులో లేకపోవడంతో తమతమ లావాదేవీలను సక్రమంగా నిర్వహించుకోలేక పోతున్నాయి. పేరు పొందిన ఎంతో మంది భారీ రుణగ్రస్తుల నుంచి సొమ్మును సకాలంలో రాబట్టడంలో బ్యాంకులు విఫలమయ్యాయి. బోర్డులు తిప్పేసి, బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాలను ఎగ్గొట్టిన పలు కార్పొరేట్ కంపెనీలు పరోక్షంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. కుంభకోణాల కారణంగా నష్టపోయిన బ్యాంకుల్లో ప్రభుత్వ రంగంలోనివే ఎక్కువ. నిజానికి ఏడాది ప్రారంభలోనే, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం బయటపడింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీ భారీ మొత్తాల్లో బ్యాంకులను నిలువునా ముంచేసి, విదేశాలకు ఉడాయించారు. ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) శాఖ నుంచి వందల సంఖ్యలో లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఓయూ)లను తీసుకొని, అవినీతికి పాల్పడ్డారు. వీరు సుమారు 14,000 కోట్ల రూపాయల మేర బ్యాంకులకు ఎగ్గొట్టి, దేశం విడిచి పారిపోయారు. ఈ భారీ షాక్ నుంచి బయటపడేందుకు పీఎన్‌బీ ఇంకా ప్రయత్నిస్తునే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఈ బ్యాంక్ దివాలా పిటిషన్ పెట్టలేదు. లేకపోతే, పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో ఊహించడం కష్టం కాదు. ఈ విషయంలో ఎన్‌బీఎఫ్ కంపెనీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని చెప్పవచ్చు. ఒకటిరెండు సంఘటనలను మినహాయిస్తే, ప్రైవేటు రంగంలోని బ్యాంకులుగానీ, ఆర్థిక సేవలను అందిస్తున్న కంపెనీలు లేదా సంస్థలుగానీ ఈ స్థాయిలో మోసపోలేదు. ద్రవ్య లభ్యత అనుకున్న స్థాయిలో అందితే, ప్రభుత్వ రంగం బ్యాంకుల కంటే ఎన్‌బీఎఫ్ కంపెనీలే మె రుగ్గా పని చేస్తాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తున్నది. నీరవ్ మోదీ కుంభకోణానికి సంబంధించిన వివరాలు పూర్తిగా వెలుగు చూడకముందే, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె అధికార దుర్వినియోగానికి పా ల్పడిందని, పరస్పర ప్రయోజనాలను ఆశించి రుణాలను మంజూరు చేసిందని ఆమెపై అభియోగాలు ఉన్నాయి. ప్రత్యేకించి, తర్వాతి కాలంలో దివాలా తీసిన వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు కోట్లాది రూపాయల రుణాలను అందించి, తద్వారా సొంత ప్రయోజనాలను పొం దారని 56 ఏళ్ల కొచ్చర్‌పై విమర్శలు ఉన్నాయి. 1984లో ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజ్‌మెంట్ విభాగంలో ట్రైనీగా చేరిన కొచ్చర్ తన అసమాన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగింది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగింది. కానీ, క్విడ్ ప్రోకో విమర్శలతో ప్రతిష్ట కోల్పోయింది. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో లబ్ధప్రతిష్ట పొందిన ఐసీఐసీఐలో నే ఇలాంటి పరిస్థితి తలెత్తడం విచిత్రం. కొచ్చర్ కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని, ఆమె కుంభకోణానికి పాల్పడలేదని ప్రపంచానికి తెలియపరచాలన్న ఉద్దేశంతో ఐసీఐసీఐ పాలక మండలి ఆమె సేవలను 2021 మే వరకూ కొనసాగించాలని తీర్మానించింది. కానీ, ఆర్‌బీఐ అందుకు సమ్మతించలేదు. ఫలితంగా ఆమె ఈనెల 31న పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోటీపడుతూ ప్రైవేటు బ్యాంకుల్లోనూ భారీ మోసాలు చోటు చేసుకుంటున్నాయని కొచ్చర్ సంఘటన చెప్పకనే చెప్పింది. కాగా, యస్ బ్యాంక్ సీఈవోగా రాణా కపూర్‌ను కొనసాగేందుకు పాలకమండలి అంగీకరించినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ససేమిరా అన్నది. అతను జనవరి 31వ తేదీన పదవీ విరమణ చేస్తాడు. యస్ బ్యాంక్ చైర్మన్ పదవికి అశోక్ చావ్లా ఇంతకు ముందే రాజీనామా చేశాడు. ఆ బ్యాంక్‌లో నెలకొన్న అవాంఛనీయ ధోరణులకు ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగానికి తగిలిన పెద్ద దెబ్బగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడాన్ని పేర్కోవాలి. వ్యక్తిగత కారణాలతోనే తాను వైదొలగుతున్నట్టు ప్రకటించినప్పటికీ, కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిళ్లే ప్రధాన కారణమన్నది జగమెరిగిన సత్యం. ఈ పరిణామం ఎన్‌బీఎఫ్ కంపెనీలపై ఏ విధంగా ఉంటుందని రాబోయే కాలమే చెప్పాలి. ఆర్‌బీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని, ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదని ఉర్జిత్ వాదిస్తుంటే, కేంద్ర వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉందని పరిశీలకులు సైతం అంటున్నారు. ఉర్జిత్ వైదొలగిన మరుసటి రోజే శక్తికాంత దాస్‌ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత హడావుడిగా మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఎన్‌బీఎఫ్ కంపెనీలను ప్రోత్సహిస్తే, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే సుమారు 24,000 కోట్ల రూపాయలను ఎన్‌బీఎఫ్ కంపెనీలకు కేంద్రం వివిధ రూపాల్లో అందుబాటులోకి తెచ్చింది. వచ్చే ఏడాది మే మాసాంతంలోగా మరో 25,000 కోట్ల రూపాయలను మార్కెట్‌లోకి రానుంది. అదే సమయంలో సెక్యూరిటీల మినిమన్ హోల్డింగ్ కాలాన్ని ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించడం ద్వారా ఆర్‌బీఐ కొన్ని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రయత్నాల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తప్పక ఉంటుందని, త్వరలోనే వృద్ధిరేటు ఆశాజనకంగా మారుతుందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. అది ఎంత వరకూ నెరవేరుతుందో చూడాలి.