రాష్ట్రీయం

తగ్గిన చింతపండు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జనవరి 17: గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా చింతపండు ధరలు గణనీయంగా తగ్గడంతో అనంతపురం జిల్లా హిందూపురంలో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. గత వారంతో పోల్చితే క్వింటాలుకు దాదాపు రూ.10 వేలకు పైగా ధర పడిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల నిరసనకు ట్రేడర్లు మద్దతు పలికారు. దీంతో ఈనామ్‌కు స్వస్తి పలకాలంటూ నినదించారు. దీనికి టీడీపీ నాయకులు వత్తాసు పలకడంతో వ్యవసాయ మార్కెట్‌యార్డులో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం వ్యవసాయ మార్కెట్‌యార్డు ఇటు చింతపండు అటు ఎండుమిర్చి లావాదేవీలకు ఆసియాలోనే పేరుగాంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చింతపండు ఉత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో రైతులు గిట్టుబాటు ధర కోసం ఎంతోఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో గురువారం ఉన్నఫళంగా క్వింటాలుకు రూ.10 వేలు నుంచి రూ.12 వేల వరకు ధర పడిపోవడం రైతులను ఆందోళనకు
గురిచేసింది. ఈనామ్ లావాదేవీల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ రైతులు నిరసనకు దిగారు. చింతకాయలు దులిపేందుకు అయిన ఖర్చులు కూడా గిట్టుబాటు కావని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్‌యార్డులో జరుగుతున్న ఈనామ్ పద్ధతి అస్తవ్యస్తంగా తయారైందంటూ రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీనికి ట్రేడర్లు వత్తాసు పలకడంతో మార్కెట్‌యార్డు బయట ప్రధాన రహదారికి అడ్డంగా ఆయా వర్గాలు ఆందోళనకు దిగాయి. గత వారం పేరెన్నికగన్న చింతపండు కరిపులి రకం క్వింటాలు ధర రూ.25 వేలు నుంచి రూ.27 వేల దాకా పలుకగా గురువారం జరిగిన ఈనామ్ పద్ధతిలో రూ.7 వేల నుంచి రూ.10 వేలకు పడిపోయింది. అదే విధంగా ఫ్లవర్ రకం చింతపండు గత వారం రూ.12 వేల నుంచి రూ.16 వేలు పలకగా ప్రస్తుతం కేవలం రూ.3 వేల నుండి రూ.4 వేలు మాత్రమే రావడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని, అస్తవ్యస్తంగా తయారైన ఈనామ్ పద్ధతిని మార్చాలంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళన సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు ఏ.నాగరాజు తదితరులు మార్కెట్‌కు చేరుకుని చర్చించారు. ఈనామ్ పద్ధతిపై రైతులు, ట్రేడర్లు అభ్యంతరం చెప్పడంతో టీడీపీ నాయకులు వారికి మద్దతుగా నిలిచారు. రైతులకు న్యాయం చేయాల్సిన ఈనామ్ పద్ధతిపై స్పష్టమైన విధివిధానాలు లేకపోవడం, సాంకేతికపరమైన సౌలభ్యం లోపభూయిష్టంగా ఉండటంతో ఇలాంటి గందరగోళ పరిస్థితి నెలకొంటోందని అన్నారు. ఈనామ్ పద్ధతిని మార్చి గతంలో తరహాలో లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని టీడీపీ నాయకులు భరోసా ఇవ్వడంతో రైతులు శాంతించారు.
ఇదిలాఉండగా రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం అమలు పరుస్తున్న ఈనామ్ పద్ధతిని అటు రైతులు ఇటు ట్రేడర్లతో పాటు అధికార పార్టీ నాయకులు వ్యతిరేకించడంతో వ్యవసాయ మార్కెట్‌యార్డు అధికారులు డైలమాలో పడ్డారు. వ్యూహాత్మకంగా ట్రేడర్లు తమ సౌలభ్యం కోసం ఈనామ్ పద్ధతిని వ్యతిరేకిస్తూ రైతుల మద్దతు కూడగట్టడంలో సఫలం కావడం చర్చనీయాంశమవుతోంది.

చిత్రం..హిందూపురం వ్యవసాయ మార్కెట్‌లో ఆందోళనకు దిగిన రైతులు