బిజినెస్

ఎలక్ట్రానిక్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలక్ట్రానిక్ హబ్‌గా మారుతోందని, రూ. 1444 కోట్ల పెట్టుబడితో 7088 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రులు నారా లోకేష్, ఎన్.అమరనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఈఎంసీ 1లో 10 ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల ఏర్పాటుకు మంత్రులు భూమిపూజ చేసి, శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం ఈఎంసీ 1లో రూ. 80 కోట్లతో 700 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ నూతనంగా నిర్మించిన కార్బన్ పరిశ్రమను ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పలు ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు తిరుపతిలో ఏర్పాటవుతున్నాయని, మరో 10 ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల ఏర్పాటుకు భూమిపూజ చేసినట్లు వివరించారు. టాటా గ్రూప్ కంపెనీల్లో ఒకటైన ఓల్టాస్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోతోందని తెలిపారు.
ఏసీలు, ఫ్రిజ్‌లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న ఓల్టాస్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రూ.653 కోట్లు పెట్టుబడి పెట్టనుందని చెప్పారు. ఇందులో సుమారు 1680 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. సీసీ కెమేరాలు, డిజిటల్ వీడియో రికార్డులను, ఎల్‌ఈడీ టీవీల తయారీలో ఉన్న డిక్సన్ సంస్థ రెండో ప్లాంట్‌ను తిరుపతి ఈఎంసీ 2లో ఏర్పాటు చేస్తుందన్నారు. దీని ఏర్పాటుకు రూ. 140 కోట్లు పెట్టుబడి పెట్టి 1131 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందన్నారు. మొబైల్ ఆక్సెసరీస్, పవర్ బ్యాంక్స్, ఛార్జర్స్, ఇయర్‌ఫోన్‌లు తయారుచేసే ఆస్ట్రం కంపెనీ రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు.
సర్వర్‌లు తయారుచేసే ఎక్స్‌ట్రన్ సర్వర్ మ్యానుఫ్యాక్చరీ ప్రైవేటు లిమెటెడ్ రూ. 357 కోట్లు పెట్టుబడి పెట్టి 900 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. సెటప్‌బాక్సులు తయారుచేసే కల్పిన్ ఎలక్ట్రానిక్ రూ. 49కోట్లు పెట్టుబడి పెట్టి 752 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. లీథియం, ఐఎన్ బ్యాటరీ, ప్రింటెడ్ సర్క్యూట్, బోర్డ్స్ తదితర ఉత్పత్తులు తయారుచేసే ఏవస్ట్‌లీథియం బ్యాటరీ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 35కోట్లు పెట్టుబడి పెట్టి 350 మందికి ఉద్యోగాలు ఇవ్వనుందన్నారు. ఏస్పీఎం మిషన్‌లు తయారుచేసే తేజా ఇండస్ట్రీస్ రూ. 7కోట్లు పెట్టుబడి పెట్టి 275 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. అప్లికేషన్ ఫెసిపిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు తయారుచేసే ఆర్‌టీఐటీ సర్వీసెస్ కంపెనీ రూ. 6కోట్లు పెట్టుబడి పెట్టి 100 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఎల్‌ఈడీ లైట్లు తయారుచేసే కామాక్షి సిస్టమ్స్ రూ. 8కోట్లు పెట్టుబడి పెట్టి 150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు.
ఇంకా సోలార్ ఎల్‌ఈడీ లాంథర్ తయారుచేసే ఆర్‌ఆర్‌టీకే రూ. 2.5కోట్లు పెట్టుబడి పెట్టి 50 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా రూ. 1444 కోట్లు పెట్టుబడితో 7,088 మందికి ఉద్యోగాలు రానున్నాయన్నారు. అనంతరం మంత్రి అమరనాథరెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయం సమీపంలో ఈఎంసీ 1, 2లలో కార్బన్‌తో పాటు మరో 10 పరిశ్రమలు రావడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, ఐటీ మంత్రి నారా లోకేష్ పట్టుదలే కారణమన్నారు.
సింగిల్ డెస్క్ కింద 21 రోజుల్లో పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇస్తున్నామన్నారు. సులభతర వాణిజ్యంలో వరుసగా నెంబర్ 1గా రాష్ట్రం నిలిచిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు చిత్తూరు జిల్లా అనుకూలమని, శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతిని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా, పరిశ్రమల హబ్‌గా ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. తిరుపతిలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా భవిష్యత్‌లో లక్ష మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అనంతరం అనంతపురం జిల్లాలో మరో 125 ఎకరాల కార్బన్ హార్మోనీ సిటీ నిర్మాణానికి నారా లోకేష్ సమక్షంలో కార్బన్ చైర్మన్ సుధీర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ ఎంఓయూ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, జడ్పీ చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
చిత్రం.. పది ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు నారా లోకేష్, అమర్‌నాథ్‌రెడ్డి