బిజినెస్

ఎల్‌పీజీ, ఏటీఎఫ్ ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సబ్సిడీ వంట గ్యాస్ (ఎల్‌పీజీ) ధర బుధవారం ఒక్కో సిలిండర్‌పై 28 పైసల చొప్పున పెరిగింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 2014వ సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు దీని ధర ఒక్కో సిలిండర్‌పై రూ. 82కి పైగా పెరిగింది. విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర కూడా 2.5 శాతం పెరిగింది. దీని ధర పెరగడం ఇది వరుసగా మూడో నెల. ప్రపంచ మార్కెట్‌లో ఉన్న అధిక ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్‌లో వీటి ధరలు పెరిగాయని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు జారీ చేసిన ధరల నోటిఫికేషన్ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర కిలో లీటర్‌కు రూ. 1,595.63 చొప్పున పెరిగి, రూ. 65,067.85కి చేరుకుంది. అంటే దీని ధర 2.5 శాతం పెరిగింది. ఏప్రిల్ ఒకటో తేదీ నాటి ధరలతో పోలిస్తే ఏటీఎఫ్ ధర కిలో లీటర్‌కు రూ. 677.1 చొప్పున పెరిగింది. మార్చి ఒకటో తేదీ నాటి ధరలతో పోలిస్తే భారీగా 8.1 శాతం (కిలో లీటర్‌కు రూ. 4,734.15 చొప్పున) పెరిగింది. ఎల్‌పీజీ ధర ఒక్కో సిలిండర్‌పై 28 పైసల చొప్పున పెరిగింది. నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ ధర ఒక్కో సిలిండర్‌పై రూ. ఆరు చొప్పున పెరిగింది. పెరిగిన ధర ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలో గ్రాముల సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 496.14. ఇంతకు ముందు ఈ ధర రూ. 495.86గా ఉండింది. తాజా పెరుగుదలతో కలిసి గత అయిదేళ్లలో సబ్సిడీ ఎల్‌పీజీ ధర ఒక్కో సిలిండర్‌పై రూ. 82 చొప్పున పెరిగింది. అంటే అయిదో వంతు పెరిగింది. 2014వ సంవత్సరం తొలినాళ్లలో సబ్సిడీ ఎల్‌పీజీ ధర ఒక్కో సిలిండర్‌కు రూ. 414గా ఉండింది. అదే సమయంలో నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ ధర 14.2 కిలో గ్రాముల సిలిండర్‌పై రూ. 6చొప్పున పెరిగి, రూ. 712.50కి చేరుకుంది. ఎల్‌పీజీ ధర పెరగడం ఇది వరుసగా మూడోసారి. వినియోగదారులు ఒక సంవత్సర కాలంలో నిర్దిష్ట కోటా 14.2 కిలో గ్రాములు గల 12 సిలిండర్లను తీసుకొని, అంతకన్నా ఎక్కువ సిలిండర్లు కావాలని కోరుకుంటే ఆ అదనపు సిలిండర్లను నాన్ సబ్సిడీ ఎల్‌పీజీగా పేర్కొంటారు. పౌర విమానయాన రంగంలో ఇప్పటికే తీవ్రమయిన పోటీ నెలకొని ఉంది. ఇప్పుడు ఏటీఎఫ్ ధర పెరగడం వల్ల ఆర్థిక సమస్యల్లో కూరుకొని ఉన్న విమానయాన సంస్థలపై మరింత భారం పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సగటు ఇంధన ధరలు, ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్ ఆధారంగా ప్రతి నెల ఒకటో తేదీన ఎల్‌పీజీ, ఏటీఎఫ్ ధరలను సవరిస్తుంటారు.
ఇదిలా ఉండగా, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా విక్రయించే కిరోసిన్ ధర ముంబయిలో లీటర్‌కు రూ. 31.13కి పెరిగింది. ఇంతకు ముందు ఇది రూ. 30.87గా ఉంది. ప్రతి నెల లీటర్‌కు 25 పైసల చొప్పున ధర పెంచాలని 2016లో తీసుకున్న నిర్ణయం ప్రకారం దీని ధర పెరుగుతూ వస్తోంది. ఢిల్లీని కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించారు. అందువల్ల చమురు కంపెనీలు ఢిల్లీలో కిరోసిన్‌ను విక్రయించవు.