బిజినెస్

గోదావరి డ్రెడ్జింగ్‌కు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 22: అఖండ గోదావరి నదిలో డ్రెడ్జింగ్ పనులకు ఎట్టకేలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. దీంతో మరో వారం రోజుల్లో గోదావరి నదిలో డ్రెడ్జింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో వున్న డ్రెడ్జింగ్ ప్రక్రియకు కదలిక రావడంతో నదీ లోతు పెరిగేందుకు మార్గం సుగమం అయింది. దీనితో పాటే కృష్ణా నదిలో కూడా డ్రెడ్జింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ రెండు నదుల డ్రెడ్జింగ్ పనులకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ లభించింది. గోదావరి నదిలో అనాదిగా డ్రెడ్జింగ్ పనులు చేపట్టకపోవడంతో కాటన్ బ్యారేజి వద్ద నదీ గర్భం లోతు బాగా తగ్గిపోవడంతో పాటు ఏకంగా నదీ గమన దిశలే మారిపోయే పరిస్థితి ఎదురవుతోంది. అఖండ గోదావరి నది కుడి, ఎడమ గట్ల వైపు ఆక్రమణలు పెరిగిపోవడం, మట్టి దిబ్బలు పేరుకుపోవడంతో నది ప్రవాహ ఉద్ధృతి పెరిగిపోయి, కొత్త ప్రాంతంలో గండ్లు పడే పరిస్థితి దాపురించింది. ఏళ్ల తరబడి ఇసుక దిబ్బలు, మట్టి దిబ్బలు పెరిగిపోయి నది మధ్యలో ద్వీపాలు తయారై లంకలు విస్తరించాయి. వాస్తవానికి గోదావరి నదిలో నిరంతరం ప్లవింగ్ ప్రక్రియ ద్వారా ఇసుక దిబ్బలను తొలగించాల్సివుంది. నిధుల లేమితో ఈ ప్రక్రియను నిర్వహించడం ఇరిగేషన్ శాఖ ఎప్పుడో మర్చిపోయింది. దీంతో దశాబ్దాలుగా ఇసుక దిబ్బలు పెరిగిపోవడంతో గమన దిశలే మారిపోయే స్థితి దాపురించింది. ఈ క్రమంలో ఎంత వరద వచ్చినా కనీస స్థాయిలో కూడా నీటిమట్టం నిర్వహించలేని స్థితిలో వచ్చిన నీటిని వచ్చినట్టుగానే లక్షల క్యూసెక్కులు సముద్రం పాలుచేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఎప్పటికపుడు ఇసుకను తొలగించి వుంటే నదీ గర్భం లోతు పెరిగి, కాస్త ఎక్కువ పరిమాణంలో నీటిని అడ్డుకుని, రబీ నీటి ఎద్దడి కడగడ్లను అధిగమించే అవకాశంవుండేదని నిపుణులు ఆశించారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గోదావరి నది పుష్కరాలకు ముందు పరిశీలనకు వచ్చినపుడు ఇసుక దిబ్బలను తొలగించాలని, అందుకు అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు అంచనాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో మొత్తానికి గోదావరి నదిలో డ్రెడ్జింగ్ ప్రక్రియ కార్యరూపం దాల్చింది. ఇప్పటికే టెండర్లు పూర్తయినప్పటికీ చాలా కాలంపాటు ఫైనాన్స్ క్లియరెన్స్ లేకపోవడంతో పనులు మొదలుపెట్టలేదు. ఇపుడు జిఒ జారీకావడంతో మొత్తం రూ.16.52 కోట్ల అంచనా వ్యయంతో డ్రెడ్జింగ్ పనులు మొదలు కానున్నాయి. మొదటి దశలో 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. ఓషన్ స్పార్కిల్ లిమిటెడ్ సంస్థ ఈ పనులు చేపడుతోంది.
కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక లభించే అవకాశం
ఇప్పటికే డ్రెడ్జింగ్ మిషనరీని రాజమహేంద్రవరం సమీపంలోని గోగుల్లంక వద్ద సిద్ధంచేశారు. మరో వారం రోజుల్లో పనులు ప్రారంభిచనున్నట్టు గోదావరి బేసిన్ చీఫ్ ఇంజనీర్ హరిబాబు చెప్పారు. మొత్తం దాదాపు కోటి క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక ఈ ప్రక్రియలో లభించనుంది. ఉభయ గోదావరి జిల్లాల గట్ల వైపు మొత్తం ఆరు చోట్ల ఇసుక స్టోరేజి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ ఇసుక విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే క్రమంలో కృష్ణా నదిలో కూడా డ్రెడ్జింగ్ పనులు చేపట్టేందుకు కూడా టెండర్లు పూర్తయి ఏజెన్సీని సిద్ధం చేశారు. త్వరలో అక్కడ కూడా పనులు చేపట్టనున్నట్టు తెలిసింది.