బిజినెస్

పెట్టుబడులకు రెడ్ కార్పెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 19: రాష్ట్రంలో పారిశ్రామిక పురోభివృద్ధికై పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు. బుధవారం సచివాలయం నాలుగోబ్లాక్‌లోని కార్యాలయంలోకి ఆయన ప్రవేశించి, బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు కీలక బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయబోమన్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఐటీ రంగం అత్యంత కీలకమైందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ఇది దోహదపడుతుందన్నారు. ఐటీ పరిశ్రమలతో యువతకు ఉపాధి కల్పన వీలుపడుతుందని చెప్పారు. నిరుద్యోగ యువతను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని ఇందులో భాగంగా ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పెద్దఎత్తున ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి మేకపాటి వెల్లడించారు. పల్లెల ఆర్థిక ప్రగతితోపాటు గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే సదుద్దేశంతో పరిశ్రమలకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు మరిన్ని రాయితీలు వర్తిస్తాయని తద్వారా 75 శాతం మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులకు గురిచేయబోదని స్పష్టం చేశారు. వారికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తుందని ప్రకటించారు.
త్వరలో 100 రోజుల యాక్షన్ ప్లాన్
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వంతో సంప్రతింపులు జరపడం ద్వారా సాధిస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని విలేకర్లడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. గతంలో విశాఖలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సుల ద్వారా ఒప్పందాలు కుదిరిన మాట వాస్తవమేనని అయితే అందుకు తగ్గట్టుగా పెట్టుబడులు ఎందుకు రాలేదనే విషయమై సమీక్ష జరుపుతామన్నారు. పరిశ్రమల పేరుతో గత ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపిందని, ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదన్నారు. వాటిపై ప్రభుత్వం దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రధానంగా 42 పరిశ్రమల స్థాపనలో ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాటి పరిష్కారానికి వంద రోజుల కార్యాచరణ చేపడతామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తీరప్రాంత పరిశ్రమలే కీలకంగా మారాయన్నారు. రాష్ట్రంలో సువిశాలమైన సముద్రతీరం ఏపీకి కలిసొచ్చే అంశంగా చెప్పారు. విశాఖ- చెన్నై, బెంగుళూరు- చెన్నై కారిడార్ల ఏర్పాటుతో పారిశ్రామిక హబ్‌గా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అనంతపురంలో కియా మోటార్స్ ప్రారంభం వల్ల అనేక పరిశ్రమలు తరలి వచ్చే వీలుందన్నారు. తొలుత వేదపండితుల ఆశీర్వచనాలు, మంత్రోచ్ఛారణల నడుమ మంత్రి కార్యాలయ ప్రవేశం చేశారు. మంత్రి మేకపాటిని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యశాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు అభినందించారు.
చిత్రం...బాధ్యతలు స్వీకరిస్తున్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి