బిజినెస్

పోలవరం అంచనా వ్యయం రూ.55,548కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,548 కోట్లకు సవరించేందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అంగీకరించింది. వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభలో పార్టీ పక్షం నాయకుడు విజయసాయి రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా రాతపూర్వంగా ఇచ్చిన జవాబులో ఈ విషయం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో నిర్మాణ పనులు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది జనవరిలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను కేంద్ర జల వనరుల సంఘానికి సమర్పించింది. కేంద్ర జల వనరుల సంఘం సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఆమోదించింది. 2017-18 ధరల ప్రాతిపదికపై సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా నిర్దారించి ఆ మేరకు ఆమోదం తెలిపినట్లు కటారియా వివరించారు. కాంపోనెంట్ ధరల అంచనా కింద విద్యుత్ ఉత్పాదన పనులకు రూ.4,560.91 కోట్లు, నీటిపారుదల-మంచినీటి సరఫరా పనుల కోసం రూ.55,548 కోట్లుగా సవరించిన అంచనా ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విద్యుత్ ఉత్పాదన పనులకు సంబంధించిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. నీటి పారుదల, మంచినీటి సరఫరా పనులకు సంబంధించిన వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. నీటిపారుదల సవరించిన అంచనా వ్యయం ప్రకారం పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ పనులకు రూ.4318.97 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు రూ.4,202.69 కోట్లు, హెడ్ వర్క్స్‌కు రూ.9,734.34 కోట్లు, పవర్ హౌజ్ పనులకు రూ.4.124.64 కోట్లు, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం పనులకు రూ.33,1688.23 కోట్ల అంచనా వ్యయానికి ఆమోద ముద్ర వేసినట్లు కటారియా వివరించారు.
పోలవరం ప్రాజెక్టులోని వివిధ విభాగాల పనుల నిర్వహణ కోసం 2014 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల వనరుల సంఘం ఆమోదం మేరకు కేంద్ర సహాయం కింద రూ.6,764.16 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. తదుపరి నిధుల విడుదల కోసం 2014 మార్చి 31 వరకు చేసిన ఖర్చుకు సంబంధించిన ఆడిట్ నివేదికలు సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటివరకు రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆడిట్ నివేదికలు సమర్పించిన తరువాత మాత్రమే తదుపరి నిధులను విడుదల చేసేందుకు వీలుంటుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ నివేదికలను పంపించకపోతే తదుపరి నిధులను విడుదల చేయటం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులకు జీఎస్టీని వర్తింపజేస్తున్నారని మంత్రి చెప్పారు. పోలవరం పనులకు జీఎస్టీ పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కటారియా తెలిపారు.