బిజినెస్

అత్యాధునిక భద్రతా ఫీచర్లతో సరికొత్త ‘ఈ-పాస్‌పోర్టు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రాధాన్యతా ప్రాతిపదికన జారీచేసే సరికొత్త ‘ఈ-పాస్‌పోర్టు’ల రూపకల్పనకు ప్రతిపాదించామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఆధునిక భద్రతా ప్రయోజనాలతో కూడిన పర్యాటక డాక్యుమెంట్‌ను అందుబాటులోకి తేవాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. త్వరలో దీన్ని అమల్లోకి తేవడం జరుగుతుందని సోమవారం నాడిక్కడ జరిగిన ‘ఏడవ పాస్‌పోర్టు సేవా దివస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టుపై ‘ఇండియా సెక్యూరిటీ ప్రెస్’తో చర్చిస్తున్నామని, ప్రత్యేకించి చిప్‌తో కూడిన ప్రత్యేక తరహా ఈ-పాస్‌పోర్టులను పౌరులకు అందజేయనున్నామని వివరించారు. ప్రభుత్వం గత దఫా పాలన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్‌తో కూడిన పాస్‌పోర్టు బుక్‌లెట్ సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. అలాగే కొత్త పోస్ట్ఫాస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఓపీఎస్‌కే) ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న విధానాన్ని సైతం ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అవసరమైన లాంఛనాలన్నింటినీ కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ, సమాచార మంత్రిత్వ శాఖ సమన్వయంతో పూర్తి చేస్తున్నాయని, ఇప్పటికే ప్రకటించిన చోట్ల పీఓపీఎస్‌కేలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. గత ఐదేళ్లలో పాస్‌పోర్టు విధానంలో ఓ సమగ్ర ఉద్యమానే్న తీసుకువచ్చామన్నారు. మంచి పాలనతోబాటు పారదర్శకత, నిపుణత, సమయపాలన, నమ్మకం, హామీ, బాధ్యతతో కూడిన పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. 2017 నుంచి ఇప్పటి వరకు 412 పీఓపీఎస్‌కేలు ఏర్పాటు చేసినందుకు కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 93 కొత్త పాస్‌పోర్టు కేంద్రాలను సైతం ఏర్పాటు చేయగా అవి ప్రస్తుతం సేవలందిస్తున్నాయన్నారు. పాస్‌పోర్టుకు పోలీస్ వెరిఫికేషన్ సమయం సైతం 2018లో 19 రోజులకు తగ్గిందన్నారు. పనితీరులో జలంధర్ పాస్‌పోర్టు కార్యాలయం ప్రథమ బహుమతిని, కొచ్చిన్, కోయంబత్తూర్ పాస్‌పోర్టు కార్యాలయాలు ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకున్నాయని మంత్రి జైశంకర్ వివరించారు.
చిత్రం...ఢిల్లీలో సోమవారం జరిగిన పాస్‌పోర్ట్ అధికారుల సమావేశానికి హాజరైన సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ అభివాదం