బిజినెస్

త్వరలో ‘జాతీయ ఈ కామర్స్’ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: వాణిజ్య రంగ సమగ్రాభివృద్ధికి అనుగుణంగా సరికొత్త ‘జాతీయ ఈ కామర్స్’ విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే 12 నెలల కాలంలో ఈ విధానం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుని అమల్లోకి రానుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వాటాదారులు, ఈ కామర్స్ కంపెనీల ప్రతినిధులతో రెండో దఫా నిర్వహించిన సమావేశంలో పై విషయం వెల్లడించారు. పారిశ్రామిక వౌలిక సూత్రాలకు అనుగుణంగా ఈ జాతీయ ఈ కామర్స్ విధానాన్ని తీసుకురావడం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన డ్రాఫ్టును గత ఫిబ్రవరిలో ప్రభుత్వం విడుదల చేసిందని, ఇందులో భాగంగా న్యాయ పరమైన, సాంకేతిక పరమైన వౌలిక సూత్రాలను, నిబంధనలను దేశ సరిహద్దుల డేటాకు అనుగుణంగా రూపొందించాల్సి ఉందని తెలిపారు. అలాగే స్థానికంగా సున్నిత మైన వివరాలు సేకరించి, అంతర్జాతీయంగా దాన్ని స్టోర్‌చేసి తద్వారా వాణిజ్యం నిర్వహించే విషయంలో నిబంధనలు ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పలు విదేశీ ఈ కామర్స్ కంపెనీలు డ్రాఫ్ట్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై, ప్రత్యేకించి డేటా నిబంధనలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఈక్రమంలో మంత్రిత్వ శాఖ అంతర్గత కమిటీని డీపీఐఐటీ నేతృత్వంలో ఏర్పాటు చేస్తారని, ఆ కమిటీ ద్వారా వాటాదార్లు తమకు సంబంధించిన ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు), డ్రాఫ్ట్ ఈ కామర్స్ విధానం అంశాలపై ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చని మంత్రి గోయెల్ పేర్కొన్నారు. అలాగే ఈ కామర్స్‌లో ప్రత్యక్ష పెట్టుబడులను వివరించే ప్రెస్‌నోట్ -2లో ప్రభుత్వం ఎలాంటి మార్పూ చేయలేదని, అందులో చూసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని మంత్రి సూచించారు. అంతర్జాతీయంగా ఈకామర్స్, డేటా అంశాలపై అనుసంధానం కావాలని భారత్ భావిస్తోందని, ఐతే ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సాగాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, పేటీఎం, ఈబే, మేక్‌మైట్రిప్, స్విగీ తదితర కంపెనీలకు చెందిన ఉన్నత కార్యనిర్వహణాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రంగాల వారీగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను కంపెనీలు మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రత్యేకించి జీఎస్టీ, డిస్కౌంట్లు గురించి ప్రస్తావించాయి. కాగా దేశంలో ఈ కామర్స్, డిజిటల్ విధానల అభివృద్ధికి సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం ప్రశంసనీయమని ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.