బిజినెస్

రుణాలపై వడ్డీరేట్లు తగ్గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ)కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కనీసం 200 బేసిస్ పాయింట్ల (2 శాతం) మేరైనా వడ్డీరేట్లను తగ్గించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. బుధవారం ఆమె ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ‘దేశంలో ఇంకా పరిశ్రమలకు రుణాలు అందుబాటులో లేవు. అధిక వడ్డీరేట్లతో రుణాలు భారమవుతున్నాయి.
ముఖ్యంగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇలకు ఆర్థిక చేయూత కరువైంది. ఎందరికో ఉపాధిని కల్పిస్తున్న ఈ రంగానికి కావాల్సిన సహకారం అందించాలి.’ అని అన్నారు. అధిక వడ్డీరేట్ల కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బ్యాంకుల వద్దకు వెళ్లడం లేదని చెప్పారు. కాబట్టి 200 బేసిస్ పాయింట్లైనా వడ్డీరేట్లను తగ్గించి రుణాలను అందుబాటులోకి తేవాలని బ్యాంకర్లను కోరారు.
ఇందుకు తాను ఏమాత్రం సంశయించడం లేదని, తన డిమాండ్ ఆమోదయోగ్యమైనదేనని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 6.5 శాతంగానే రెపో రేటును ఆర్‌బిఐ ఉంచుతోంది. ఈ క్రమంలో ఆర్‌బిఐకి కొత్త గవర్నర్ రావడం, ఆయన ఆధ్వర్యంలోనే అక్టోబర్ 4న ద్రవ్యసమీక్ష జరుగుతుండటంతో రెపో రేటును తగ్గించాల్సిన అవసరం ఉందని సీతారామన్ అన్నారు. ఇప్పటికే పారిశ్రామిక సంఘం సిఐఐ కూడా వడ్డీరేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నది తెలిసిందే. కాగా, ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్‌ను వడ్డీరేట్లు తగ్గించడం లేదని, ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ద్రవ్యసమీక్షలు చేస్తూ దేశ వృద్ధిరేటును దెబ్బతీస్తున్నారని విమర్శించినవారిలో సీతారామన్ కూడా ఉన్నది విదితమే. బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యన్ స్వామితోపాటు సీతారామన్ కూడా రాజన్ ద్రవ్యవిధానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే దేశీయ ఎగుమతులపై మాట్లాడుతూ నిలకడగా కోలుకుంటున్నాయని, ఎగుమతుల్లో పతనం ఇక ఆగిపోయినట్లేనని అన్నారు. పొగాకు రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)ను అనుమతించే ప్రసక్తే లేదన్న మంత్రి.. రక్షణ రంగంలో ఎఫ్‌డిఐలు నెమ్మదిగా పుంజుకోగలవన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.