బిజినెస్

వాహన తయారీ పరిశ్రమలన్నింటికీ సమాన జీఎస్‌టీ విధానం ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: వాహన తయారీ పరిశ్రమ మొత్తానికి ఒకే రకమైన పన్ను విధానాన్ని అమలు చేయాలని, ప్రత్యేకించి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ని అందరికీ 18 శాతంగా నిర్థారించాలని ‘జాతీయ వాహన విడిభాగాల తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) బుధవారం నాడిక్కడ ప్రభుత్వాన్ని కోరింది. రెండు రకాల జీఎస్‌టీ విధానంతోబాటు, విద్యుత్ వాహనాల విధానంపై సైతం స్పష్టత లేకపోవడంవల్ల ఈ పరిశ్రమ మనుగడకు, సుమారు 10 లక్షల ఉద్యోగాలకు విఘాతం కలిగే ప్రమాదం నెలకొందని ఆ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. 30 శాతం పరిశ్రమలకు అధిక జీఎస్‌టీ భారం పడటంతోబాటు వాహన విక్రయాలు మందగించాయని దీర్ఘకాలం ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమ ఉనికికే ప్రమాదమని వాపోయింది. కేవలం వాహనాల విడిభాగాల తయారీ విభాగంలోనే దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులున్నారని, గత కొన్ని నెలలుగా వాహన విక్రయాలు మందగించడం ఆందోళన కలిగిస్తోందని ఏసీఏంఏ అధ్యక్షుడు రామ్ వెంకటరమణి ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం 15 నుంచి 20 శాతం వాహన తయారీలు తగ్గడం వల్ల విడిభాగాల తయారీ రంగం సైతం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దాదాపు 10లక్షల మంది ఉద్యోగులు వీధిన పడాల్సి వస్తుందన్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఈ పరిశ్రమలకు సంబంధించిన లే ఆఫ్ ప్రక్రియలు ఇప్పటికే ఆరంభమయ్యాయన్నారు. 70 శాతం విడిభాగాల తయారీ పరిశ్రమలు 18 శాతం జీఎస్‌టీ శ్లాబ్ కింద ఉన్నాయని, మిగిలిన 30 శాతం పరిశ్రమలు 28 శాతం పన్ను చెల్లించాల్సిన అగత్యం నెలకొందన్నారు. ఈ పరిశ్రమలు విడిభాగం పొడవు, ఇంజన్ సైజును అనుసరించి 28 శాతం జీఎస్‌టీతోబాటు అదనంగా 1 నుంచి 15 శాతం వరకు సెస్సును చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బీఎస్-4, 5కు పరివర్తన నిమిత్తం జరిగే పెట్టుబడులకు ఏర్పాటు చేసిన ఉద్గారాలకు సంబంధించిన మార్గదర్శకాలపై, విద్యుత్ వాహనాల తయారీ విధానంపై స్పష్టత లేకపోవడంతో భవిష్యత్తులో పెట్టుబడులు సైతం పెరిగే అవకాశాలు లేవని వెంకట రమణి పేర్కొన్నారు. వాహన తయారీ పరిశ్రమ దుస్థితిపై ప్రభుత్వం వెంటనే కల్పించుకుని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే మొత్తం వాహన తయారీ పరిశ్రమకు ఒకే రకమైన 18 శాతం జీఎస్‌టీ పన్ను విధానాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ వాహనాలకు సంబంధించి స్పష్టమైన, స్థిరమైన విధానాన్ని చేపట్టాలన్నారు. విద్యుత్ వాహనాలు ప్రస్తుతం జరుగుతున్న విడిభాగాల దిగుమతుల బిల్లుల భారాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందని, అలాగే నాశిరకం విడిభాలు పరిశ్రమకు ఇబ్బందికరంగా మారుతాయన్నారు.