బిజినెస్

రాష్ట్రంలో 25 జీసీసీ పెట్రోల్ బంక్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 19: గిరిజన యువత వలసలు తగ్గించడం, ఉన్నచోటే ఉపాధి కల్పించడం, వినియోగదారులకు అందుబాటులో పెట్రోల్‌ను ఉంచడం, తద్వారా సంస్థకు తగినంత ఆదాయాన్ని సమకూర్చడం ప్రధాన లక్ష్యాలుగా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పని చేస్తోంది. పెట్రోల్ బంక్‌ల నిర్వహణ విజయవంతం కావడంతో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బంక్‌ల సంఖ్య 25కు పెంచుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకోసం ఏపీలో పలు జిల్లాల్లో బంక్‌ల నిర్వహణ కోసం తగిన ప్రదేశాలను గుర్తిస్తోంది. ప్రతిచోటా సొంత స్థలాలు ఉండటం, అదీ 20 నుంచి 30 సెంట్ల భూమిలో వీటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నందున వీటిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కేవలం స్థలం చూపి దీనికి రక్షణ గోడను నిర్మించి ఇస్తే చమురు కంపెనీల నుంచి ఎప్పటికపుడు పెట్రోల్, డీజిల్‌ను నిర్వాహకులు కొనుగోలు చేసుకుంటారు. ఈ విధానంతో సంస్థకు ఎటువంటి ఆర్థిక భారం ఉండకపోగా, నిర్వాహకులకు ప్రయోజనకరంగానే ఉంటుంది. చమురు కంపెనీల పెట్రోల్ వ్యాపార లక్ష్యాలు పెరుగుతుండగా, గిరిజన యువతకు ఉన్నచోటనే ఉపాది లభిస్తోంది. మరోపక్క జీసీసీకి అనుకున్న దానికంటే కూడా ఆర్థికంగా
బలోపేతమవుతుంది. పెట్రోల్ బంక్‌లను 13 జిల్లాలకు సంబంధించి తొలుత ముఖ్యమైన మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 16 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటయ్యాయి. ఇందులో ఇటీవల విశాఖ జిల్లా ఆనందపురం మండలం వేములవలస ప్రాంతంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో పెట్రోల్ బంక్‌లో కనీసం ముగ్గురు వంతున రెండు లేక మూడు షిష్ట్‌ల్లో పది మంది వరకు పనిచేస్తున్నారు. ఈ విధంగా 150 మందికి పైగానే నిరుద్యోగ యువతకు వీటిల్లో ఉపాధి లభించింది. తొలి దశలో కనీసం ఎనిమిది వేల నుంచి 15వేల రూపాయల వరకు జీతం పొందగలుగుతున్నారు. సంస్థకు కనీసం రూ.25 లక్షలకు తక్కువ లేకుండా ఆదాయం వస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోనే పదికి పైగా పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. జీ.మాడుగుల, అరకువేలీ, డుంబ్రిగుడ, పెదబయలు, హుకుంపేట, కేడీ పేట, కాకరపాడు, చింతపల్లి, జీకే వీధి, సీలేరు, నర్సీపట్నం ప్రాంతాల్లో బంక్‌లు గత కొంతకాలంగా నడుస్తున్నాయి. విశాఖ నగర శివారు ప్రాంతం ఆనందపురం మండలం వేములవలసలో కొత్తగా బంక్‌లు ఏర్పాటు చేయగా, త్వరలో విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం లంబసింగిలో పెట్రోల్ బంక్ రానుంది. ఇదే తరహాలో విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం, తూర్పు గోదావరి జిల్లాలో రంప చోడవరం, చింతూరు, అడ్డతీగల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కోట రామచంద్రపురంలో ఇటీవల ప్రారంభించింది. ఈ విధంగా నాలుగు జిల్లాల్లో జీసీసీ పెట్రోల్ బంక్‌లు నిర్వహిస్తుండగా, రానున్న రోజుల్లో నాలుగైదు జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా 25 పెట్రోల్ బంక్‌లకు చేరుకోవడం ద్వారా 300నుంచి 400 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.