బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 20: బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల వత్తిడికి గురవడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. అయితే వాహన, ఐటీ స్టాక్స్ లాభాల్లోనే సాగాయి. కాగా వరుసగా మూడు రోజులపాటు లాభాల బాట పట్టిన అనంతరం సూచీలు తాజాగా మళ్లీ నష్టాలను నమోదు చేయడం గమనార్హం. ఆర్థిక మాంద్యాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఏవైనా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతుందన్న అంచనాలతో మదుపర్లు వేచిచూసే వైఖరిని అవలంభించారని విశే్లషకులు భావిస్తున్నారు. ప్రధానంగా యెస్ బ్యాంక్ తీవ్రంగా 7.11 శాతం నష్టాలను సంతరించుకుంది. బహుళ జాతి సంస్ధ ‘సీజీ పవర్స్’లో భాగస్వామ్యం కలిగిన యెస్ బ్యాంకు ఆ సంస్ధ ప్రతికూల పరిణామాల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సీజీ పవర్స్ తీవ్రమైన ఆర్థిక అక్రమాల ఊబిలో కూరుకుపోయింది. ఆ సంస్ధలో యెస్ బ్యాంకుకు 12.79 శాతం వాటాలున్నాయి. ఇలావుండగా మంగళవారం ఉదయం సానుకూలంగా ఆరంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా 292 పాయింట్లు ఎగబాకింది. ఐతే చివరికి వాటాల విక్రయాల వత్తిడితో నష్టాల్లోకి జారుకుంది. 74.48 పాయింట్లు కోల్పోయి 0.20 శాతం నష్టంతో 37,328.01 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 37,511.55 గరిష్టాన్ని, 37,219.90 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 36.90 పాయింట్లు కోల్పోయి 0.33 శాతం నష్టాలతో 11,017 వద్ద స్థిరపడింది. ఈ సూచీ సైతం ఇంట్రాడేలో 11,076,30 గరిష్ట స్ధాయి, 10,985.30 పాయింట్ల కనిష్ట స్ధాయి మధ్య కదలాడింది. గత మూడు రోజులుగా సెనె్సక్స్ 444.33 పాయింట్లు (1.20 శాతం), నిఫ్టీ 128.05 పాయింట్లు (1.17 శాతం) వంతున లాభపడ్డాయి. ఐతే మంగళవారం మళ్లీ సూచీలు నష్టాల్లోకి మళ్లిన క్రమంలో యెస్ బ్యాంకు అత్యధికంగా 7.11 శాతం నష్టపోగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్ 2.43 శాతం నష్టపోయాయి. మరోవైపు మారుతి, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, హెచ్‌యూఎల్, హీరో మోటోకార్ప్, టీసీఎస్, కోటక్ బ్యాంక్ 4.5 శాతం లాభాలను సంతరించుకున్నాయి. ప్రధానంగా ఆర్థిక మాంద్యాన్ని ప్రభుత్వం చక్కదిద్దే వరకు వేచిచూద్దామన్న మదుపర్ల వైఖరితోబాటు, నిరాశాజనక త్రైమాసిక ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని వాణిజ్య వర్గాలు పేర్కొన్నాయి. ఇక రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో లోహ, వౌలిక వస్తువులు, ఇంధనం, స్థిరాస్తి, విద్యుత్, చమురు, సహజ వాయువులు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకెక్స్, టెలికాం సూచీలు 1.71 శాతం నష్టపోయాయి. మరోవైపు ఐటీ, వాహన, టెక్, వినిమయ వస్తువుల సూచీలు లాభాలను నమోదు చేశాయి. ఇక బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.62 శాతం నష్టపోయాయి. కాగా విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) సోమవారం 305.74 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు. ఐటీ షేర్లు చెప్పుకోదగ్గ స్ధాయిలో లాభపడటం ద్వారా మార్కెట్లకు తీవ్ర నష్టాలు తప్పాయి. ఇలావుండగా రుతుపవనాల సానుకూల ప్రభావంతోబాటు, రేట్ల కోతకు సంబంధించిన ఫలాలు లబ్ధిదారులకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడితే మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడుతుందని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
మిశ్రమ ఫలితాల్లో ఆసియా మార్కెట్లు
ఈవారం వెలువడనున్న అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జరోమ్ పావెల్ ప్రకటన కోసం వేచిచూసే వైఖరిని మదుపర్లు అనుసరించడంతో అంతర్జాతీయ మార్కెట్లు మంగళవారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. ఆసియాలో షాంఘై కాంపోజిట్ సూచీ, హ్యాంగ్‌సెంగ్, కోస్పి, నిక్కీ మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. అలాగే ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలను నమోదు చేశాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 25 పైసలు నష్టపోయి ఇంట్రాడేలో రూ. 71.69గా ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.17 శాతం పెరిగి బ్యారెల్ 59.84 డాలర్ల వంతున ట్రేడైంది.