బిజినెస్

విద్యుత్ బిల్లుల షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఆగస్టు 21: ఒకవైపు నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు భగ్గుమంటుంటే మరోవైపు విద్యుత్ ఛార్జీలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యం వల్ల వినియోగదాడికి విద్యుత్ బిల్లులు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కరోజు ఆలస్యంగా బిల్లులు తీస్తే చాలు రీడింగ్‌లతో మారుతున్న స్లాబులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. కేవలం ఒకే ఒక్క యూనిట్ అదనమైనా విద్యుత్ చార్జీల భారం వినియోగదారుడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతినెలా నిర్దిష్టమైన రోజుల్లో తప్పనిసరిగా విద్యుత్ మీటర్ల రీడింగ్ తీయాల్సిన సిబ్బంది ఒకటి రెండ్రోజులు ఆలస్యం చేస్తుండటంతో యూనిట్ల టారిఫ్ మారిపోయి వినియోగదారులపై భారం పడేలా చేస్తోంది. సంవత్సరంలో 31రోజులుండే 7నెలలు, 28 లేదా 29 రోజులుండే ఒక నెల, 30 రోజులుండే 4 నెలలకు చివరి రోజున విద్యుత్ మీటర్ రీడింగ్ తీసుకుని సిబ్బంది బిల్లును వినియోగదారుడికి ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 10వ తేదీనో, లేదా నిర్దిష్టమైన ఏదోఒక రోజునో సిబ్బంది ఇంటికి వచ్చి రీడింగ్ నమోదు చేసి బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇలా కాకుండా ఆలస్యంగా విద్యుత్ మీటర్ల రీడింగ్ తీస్తుండటంతో తప్పుడు బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. విద్యుత్ వినియోగంలో సింహ భాగం గృహావసరాలకే పోతుంది. పలు స్లాబుల ప్రకారం చార్జీలను విద్యుత్ శాఖ వసూలు చేస్తుంటుంది. అయితే ఆగస్టు నెలకు సంబంధించి ఎక్కువ మందికి వచ్చిన విద్యుత్ బిల్లులు పరిశీలిస్తే ఆలస్యంగా రీడింగ్‌లు తీయటం వల్ల అధిక మొత్తానికి బిల్లులు వచ్చాయని చెబుతున్నారు. ప్రస్తుతం 50 యూనిట్ల వరకు 1.45, 51 నుండి 100 యూనిట్ల వరకు 2.60, 101 నుండి 200 యూనిట్లకు 3.60, 201 నుండి 300 యూనిట్లకు 6.90, 300కు పైబడి యూనిట్లు వినియోగించిన వారి నుండి యూనిట్‌కు రూ. 7.75 పైసలను విద్యుత్ శాఖ వసూలు చేస్తోంది. అయితే గృహ వినియోగంలో ఎక్కువ శాతం నాలుగు స్లాబుల్లోనే వినియోగదారులు ఉంటున్నారు. స్లాబ్‌కు మించి ఒక్క యూనిట్ వినియోగించినా రెండో స్లాబ్‌లోకి వెళ్లడంతో బిల్లులు ఎక్కువగా వస్తుంటాయి. నెల మొత్తంలో 50 యూనిట్లు వినియోగిస్తే బిల్లు తీసిన సమయానికి 51 యూనిట్లు వినియోగించి ఉంటే మాత్రం రెండో స్లాబ్‌లోకి వెళ్లడంతో యూనిట్‌కు రూ.1.45 పైసలకు బదులు 2.60 పైసలతో బిల్లు వస్తుంది. రీడింగ్ తీసే సిబ్బంది చేస్తున్న ఆలస్యానికి వినియోగదారుడు చేతిచమురు వదిలించుకోవాల్సి వస్తోంది. మూడు నుండి నాలుగో స్లాబులోకి వెళితే మాత్రం బిల్లు తడిసి మోపెడవుతోంది. ఎవరో చేసిన తప్పుకు వినియోగదారుడు బలి కావాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 12లక్షలకు పైగా ఉన్న విద్యుత్ కనెక్షన్లలో అత్యధికంగా 200 యూనిట్లు లోపు వాడేవారే ఉన్నారు. వంద యూనిట్ల వరకు వినియోగించేవారు 30శాతం ఉండగా, 200 యూనిట్ల వరకు వినియోగించేవారు దాదాపు 60శాతం పైగా ఉన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఉచితంగా 200 యూనిట్ల వరకు వినియోగించుకుంటున్న వీరిపై కూడా ఆలస్యంగా తీస్తున్న బిల్లుల ప్రభావం పడుతోంది. ఒకటి, రెండు రోజులు ఆలస్యం జరిగితే వినియోగించిన మొత్తం యూనిట్లకు బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఇలాంటి పరిస్థితిని వినియోగదారులు చవిచూడాల్సి వచ్చింది. దీనిపై విద్యుత్ శాఖాధికారులు, ప్రభుత్వం దృష్టి సారించాలని, అవసరమైన సిబ్బందిని నియమించి నిర్దేశించిన రోజునే విద్యుత్ రీడింగ్ తీయించాలని వినియోగదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు.