బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌వేస్తూ మదుపరులు అమ్మకాల దిశగా వెళ్ళడంతో నష్టాలు తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 51.56 పాయింట్లు పడిపోయి 26,117.85 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 23.55 పాయింట్లు కోల్పోయి 7,931.35 వద్ద నిలిచింది.
అంచనాలను అందుకోలేకపోయిన దేశీయ ఆటో అమ్మకాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, నవంబర్ నెలకుగాను విడుదలైన ఉత్పాదక పిఎమ్‌ఐ గణాంకాలు 25 నెలల కనిష్టానికి దిగజారడం వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇకపోతే బ్యాంకింగ్, ఐటి, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ రంగాల షేర్ల విలువ 1.03 శాతం నుంచి 0.64 శాతం క్షీణించింది. హెల్త్‌కేర్, ఎఫ్‌ఎమ్‌సిజి, టెలికాం, మెటల్ రంగాల షేర్ల విలువ 0.87 శాతం నుంచి 0.40 శాతం పెరిగాయి.
అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల సూచీలు 0.07 శాతం నుంచి 0.72 శాతం పతనమవగా, హాంకాంగ్, సింగపూర్ దేశాల సూచీలు 0.44 శాతం నుంచి 0.47 శాతం పెరిగాయి. మరోవైపు ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాల సూచీలు 0.01 శాతం నుంచి 0.45 శాతం మేరకు పుంజుకున్నాయి.
తమిళనాడు వర్షాల ప్రభావం
తమిళనాడులో కుండపోతగా కురుస్తున్న వర్షాలు ఆ రాష్ట్రానికి చెందిన సంస్థల షేర్లను ప్రభావితం చేశాయి. టివిఎస్ మోటార్, మద్రాస్ ఫర్టిలైజర్స్, నాట్కో షేర్ల విలువ బుధవారం ట్రేడింగ్‌లో 6.4 శాతం వరకు క్షీణించింది. ఇన్ఫోసిస్ షేర్ల విలువ కూడా పతనమైంది.
ముఖ్యంగా టివిఎస్ మోటార్ షేర్ విలువ బిఎస్‌ఇలో 4.87 శాతం దిగజారింది. వాతావరణం అనుకూలించక టివిఎస్ మోటార్ అమ్మకాలు దాదాపు 15,000 యూనిట్లు పడిపోయినట్లు అంచనా. అలాగే నాట్కో ఫార్మా షేర్ విలువ 1.41 శాతం, ఇన్ఫోసిస్ కార్యాలయాలు వరదల్లో మునిగిపోవడంతో ఆ సంస్థ షేర్ విలువ 1.53 శాతం కోల్పోగా, మద్రాస్ ఫర్టిలైజర్స్ షేర్ విలువ ఏకంగా 6.35 శాతం పతనమైంది.
ఇవేగాక ఇండియా సిమెంట్స్ (2.43 శాతం), చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (0.93 శాతం) షేర్ల విలువలూ దిగజారాయి. వర్షాల కారణంగా అన్ని సంస్థల కార్యాలయాలు మూతపడటం వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తోంది.

జిఎస్‌డిపిలో బిహార్,
ఎకానమీలో మహారాష్ట్ర టాప్

ముంబయి, డిసెంబర్ 2: స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో బిహార్ దూసుకెళ్తోంది. గత ఆర్థిక సంవత్సరం 2014-15లో ఇది 17.06 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఇక 16.87 ట్రిలియన్ రూపాయలతో మహారాష్ట్ర దేశంలోనే ఎకానమీ పరంగా 11.69 శాతంతో అతిపెద్ద రాష్ట్రంగా నిలిచింది. జిఎస్‌డిపిలో బిహార్ తర్వాత మధ్యప్రదేశ్, గోవాలుండగా, తెలంగాణ 5.3 శాతం సాధించింది. ఇదిలావుంటే ఐటి/బిపిఒ/కెపిఒ విభాగంలో ఆశాజనకమైన వృద్ధిరేటుతో సేవల రంగంలో కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్టల్రు ముందున్నాయి. రాష్ట్రాల రుణాల్లో దాదాపు 60 శాతం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడుదేనని బుధవారం విడుదలైన బ్రిక్‌వర్క్ రేటింగ్స్ స్పష్టం చేసింది.

ఖమ్మం జిల్లాలో
ఆయిల్ పామ్ యూనిట్

హైదరాబాద్, డిసెంబర్ 2: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్థసారథి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయిల్ పామ్ యూనిట్ స్థాపనకు అవసరమైన భూసేకరణతోపాటు, దీనివల్ల నిర్వాసితులు అయ్యేవారికి పునరావాసం కల్పించే బాధ్యతను ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్‌కు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. అలాగే ఆయిల్ పామ్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్ అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరించనున్నారని స్పష్టం చేశారు.

విప్రో చేతికి సెల్లెంట్ ఎజి

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: జర్మనీకి చెందిన ఐటి కన్సల్టింగ్ సంస్థ సెల్లెంట్ ఎజిని కొనుగోలు చేస్తున్నట్లు దేశీయ మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ విప్రో బుధవారం తెలిపింది. దాదాపు 518 కోట్ల రూపాయల (73.5 మిలియన్ యూరోలు)కు దీన్ని సొంతం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పూర్తిగా నగదు లావాదేవీల్లో జరుగుతున్న ఈ కొనుగోలు వచ్చే ఏడాది మార్చి నాటికి ముగుస్తుందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు విప్రో స్పష్టం చేసింది.