బిజినెస్

రైల్వే స్టేషన్లలో సినిమా హాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 12: రైలు ప్రయాణికులకు వినోదాన్ని అందించడానికి రైల్వే స్టేషన్లలో సినిమా హాళ్ళు రాబోతున్నాయి. కాలక్షేపంతోపాటు వినోదాన్ని పంచడానికి వీలుగా సరికొత్త తరహాలో దేశవ్యాప్తంగా ఉన్న అనేక ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో మినీ సినిమా హాళ్ళను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ముఖ్యమైన, నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసేందుకు దృష్టి సారిస్తోంది. దేశంలోని 17 రైల్వే జోన్ల నుంచి వివరాలు సేకరించనుంది. సినిమా హాళ్ళ నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలు, అనుకూల పరిస్థితులపై పూర్తిస్థాయిలో నివేదికలను కోరుతోంది. దేశంలో 17 రైల్వే జోన్లు ఉండగా ఇపుడు కొత్తగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటైంది. దీంతో జోన్ల సంఖ్య 18కి చేరాయి. రైళ్లు ఆలస్యంగా నడిచే సమయాల్లో ప్రయాణికులు విసుగు చెందకుండా వినోదం, కాలక్షేపం ఉంటుందనే ఆలోచనతో రైల్వే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు రైల్వేవర్గాలు చెబుతున్నాయి. తొలి దశలో క్యాటగిరీ-1 రైల్వే స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయనుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారంపై మినీ సినిమా హాల్‌ను పీపీపీ పద్ధతిపై ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రయాణికుల పిల్లల కోసం ఫన్ జోన్ ఏర్పాటైంది. దీంతోపాటు రైలు కోసం నిరీక్షించే ప్రయాణికులకు కాస్తంత వినోదాన్ని అందించినట్టు అవుతుందని భావించిన రైల్వే ఇక నుంచి సినిమా చూపించనుంది. దేశంలో 18 రైల్వే జోన్లు, 50కి పైగా డివిజన్లు ఉన్నాయి. వీటిలో ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ పరిధిలో కొత్తగా రాయగడ ఏర్పాటైంది. సంబల్‌పూర్, ఖుర్దా, రాయగడ డివిజన్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌లోకి రావడంతో వీటిల్లో ముఖ్యమైన భువనేశ్వర్, పూరి రైల్వేస్టేషన్లు నిత్యం రద్దీగా ఉంటాయి.
విజయనగరం, శ్రీకాకుళం రైల్వేస్టేషన్లలో ఈమధ్య కాలంలో వసతులు అభివృద్ది చేస్తున్నారు. ఇక దేశంలోనే అతి ముఖ్యమైన విశాఖ రైల్వే స్టేషన్, దక్షిణ మధ్య రైల్వే జోన్ విజయవాడ, సికింద్రాబాద్‌లలో మినీ సినిమా హాళ్ళ ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించాలంటూ రైల్వే నుంచి సంకేతాలు వచ్చినట్టు తెలిసింది. తొలి దశలో ఏపీ, తెలంగాణా, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే స్టేషన్లలో ఒక్కో మినీ సినిమా హాల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే క్యాటగిరీ-2 పరిధిలోకి వచ్చే మరికొన్ని రైల్వే స్టేషన్లలో వీటి ఏర్పాటు కోసం ప్రతిపాదించాలని నిర్ణయించింది. సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులు ఆలస్యమైన రైళ్ళ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్న సందర్భాలు ప్రతిరోజు ఉంటున్నాయి. అదీకాకుండా ఎక్కడో ఒకచోట ట్రాక్ నిర్వహణ పనులు, నాన్-ఇంటర్ లాకింగ్ పనులు, మరమ్మతులు చేపట్టే కార్యక్రమాలతో కొన్ని రైళ్ళు రద్దయ్యే పరిస్థితులుంటున్నాయి. ఇటువంటి సందర్భాల్లో గంటల తరబడి స్టేషన్‌లోనే నిరీక్షించే ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందువల్ల ముందుగానే ఆయా రైళ్ళ ఆలస్య సమయాలను డిస్‌ప్లే, ఎంక్వైరీ, వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నందున ఈ సమయంలో వినోదాన్నిచ్చే సినిమాలను చూపించాలని కొంతకాలంగా రైల్వే ఆలోచన చేస్తోంది.