బిజినెస్

కడప ‘ఉక్కు’కు గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 8: కడప ఉక్కు కర్మాగారానికి నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్ర పెట్రోలియం, గనులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి ప్రదాన్ సమావేశమయ్యారు. వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, ప్రాధాన్యతాంశాలను రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు సమావేశం ముందుంచారు. విభజన చట్టంలోని అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని ఇందుకోసం ప్రపంచంలోని సుప్రసిద్ధ ఉక్కు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ప్లాంట్ నిర్వహణలో స్థిరత్వం సాధించేందుకు నిరంతరాయంగా ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్ సుముఖత వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంతో ఎన్‌ఎండీసీ ఒప్పందం చేసుకుంటుందని వెల్లడించారు. త్వరలోనే దీనిపై ఎంవోయూ కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఉక్కుగనుల శాఖ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం భైరవపాలెంలో ఓఎన్జీసీ లిమిటెడ్ నిర్వహించిన ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ వల్ల 16,554 మత్స్యకార కుటుంబాలకు రూ. 81 కోట్లు చెల్లించాల్సి ఉందని వీటిని వెంటనే మంజూరు చేయాలని అధికారులు కోరారు. ఈ పరిహారం చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ఓఎన్జీసీ అధికారులను ఆదేశించారు. చమురు, గ్యాస్ కంపెనీలు ఏపీలో తమ టర్నోవర్‌కు తగ్గట్టుగా సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేయాల్సి ఉందని దీనిపై స్పందించాలని అధికారులు విన్నవించారు. రాష్ట్రంలో ఆయా కంపెనీల టర్నోవర్ మేరకే సీఎస్‌ఆర్ అందేలా చూస్తామని కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. చమురు, గ్యాస్ వెలికి తీస్తున్న కంపెనీలు చెల్లిస్తున్న రాయల్టీలో రాష్ట్రానికి వాటా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఆఫ్‌షోర్‌లో చమురు, గ్యాస్ వెలికితీత కార్యక్రమాల వల్ల సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కాలుష్య ప్రభావం పడుతోందని, తీర ప్రాంతాల్లో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్ల వల్ల పర్యావరణం దెబ్బతిని సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయని, భారీ వాహనాల రాకపోకలకు రహదార్లు దెబ్బతింటున్నాయని దీనివల్ల స్థానికులు, మత్స్యకారుల జీవనోపాధికి అవరోధాలు ఎదరువుతున్నాయని అధికారులు వివరించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉందని, కాకినాడలో కాంప్లెక్స్ ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి ప్రతిపాదించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు. పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో పెట్రోలియం ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. దేశానికి తూర్పుతీరంలో ఉన్న ఏపీలో పెట్రో రంగంలో పెట్టుబడులకు ప్రపంచ సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పెట్రోలు, సహజ వాయువుడు, ఉక్కు రంగాలకు సంబంధించి దాదాపు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. విశాఖలో విస్తరణ ప్రాజెక్ట్‌లు, కాకినాడలో పెట్రో కాంప్లెక్స్, కడప స్టీల్ ప్లాంట్ రూపంలో భారీగా పెట్టుబడులు రాగలవన్నారు. పరిశ్రమల ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని ప్రశంసించారు. పైపులైన్లు వేయటంలో ఉన్న సమస్యలను పరిష్కరించటంతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించినందుకు ఓఎన్జీసీ, హైచ్‌పీసీఎల్ చైర్మన్లు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో సానుకూల దృక్పథంతో ఉన్నామని, అన్నిరకాల తోడ్పాటు నందిస్తామని ప్రకటించారు. సమావేశంలో కేంద్ర ఉక్కు గనుల శాఖ కార్యదర్శి బినోయ్ రాయ్, పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి అమర్‌నాథ్, ఎన్‌ఎండీసీ సీఎండీ ఎన్ బైజేంద్రకుమార్, గెయిల్ సీఎండీ అశుతోష్ కర్టాణక్, ఓఎన్జీసీ సీఎండీ శశి శంకర్, హెచ్‌పీసీఎల్ సీఎండీ ముఖేష్ కుమార్ సురానా, ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ పి.కె.రథ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సచివాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ప్రభుత్వ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. సచివాలయంలో భేటీ అనంతరం తాడేపల్లిలో సీఎం జగన్ నివాసంలో మధ్యాహ్నం విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రిని సత్కరించారు.

ఏపీ పెట్రో రంగంవైపు ప్రపంచ సంస్థల చూపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఏపీలో పెట్రో రంగంలో ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు సుముఖంగా ఉన్నాయని వచ్చే ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కాకినాడలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు, కడపలో ఉక్కు కర్మాగారానికి కేంద్ర మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఖనిజాల రవాణాకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

పరిశ్రమలకు పూర్తి సహకారం ముఖ్యమంత్రి జగన్
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కేంద్ర పెట్రోలియం, సహజవాయువులు, గనులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా సువిశాలమైన సముద్ర తీరం విస్తరించి ఉందని చమురు, సహజవాయువులు, పెట్రో కెమికల్స్ సంస్థల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని వివరించారు. పరిశ్రమల స్థాపనకు ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన సానుకూలతలు ఉన్నాయని తెలిపారు. సింగిల్ విండో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.