బిజినెస్

వార్షిక లోటు లక్ష్యాలను 4 శాతానికి పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యం కారణంగా పన్నుల రాబడిలో తగ్గుదల చోటుచేసుకున్న క్రమంలో వార్షిక లోటు లక్ష్యాలను సరళతరం చేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బుధవారం నాడిక్కడ సూచించాయి. ప్రత్యేకించి ఈ లోటు లక్ష్యాన్ని 4 శాతానికి పెంచాలని కోరాయి. గడచిన జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్థిక మంత్రి ఆర్థిక లోటు లక్ష్యాన్ని 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించడం జరిగింది. ఈక్రమంలో కార్పొరేట్ పన్నుల్లో కోత విధించడం వల్ల మరో 1.45 లక్షల కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా వార్షిక లోటు లక్ష్యాలను విస్తరించడం వల్ల దేశంలో వినిమయ శక్తి పెరుగుతుందని, తద్వారా ఆర్థిక స్థితి మెరుగవుతుందని బీహార్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలకు సూచించాయి. ప్రస్తుత ఏడాది వివిధ రాష్ట్రాల వాస్తవ వ్యయం తగ్గుతుందని, కారణం దేశ ఆర్థిక మాంద్యమేనని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కాగా ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో రెవిన్యూ వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నందున ఈ ఏడాది బడ్టెట్ లోటును జీడీపీలో 3.6 శాతం నుంచి 3.8 శాతానికి పెంచే అవకాశాలున్నాయని కొంతమంది వాణిజ్య విశే్లషకులు అంచనా వేస్తున్నారు.
గడచిన అక్టోబర్ మాస ముగింపు నాటికి 2019-20 సంవత్సర బడ్జెట్ అంచనాలు 7.2 లక్షల కోట్లలో దేశ ఆర్థిక లోటు 102.4 శాతానికి మించింది. వ్యయానికి, రాబడికి మధ్య తేడా రూ. 7,20,445 కోట్లుగా ఉంది. ఈక్రమంలో ఆర్బీఐ గవర్నర్‌తోబాటు అనేకమంది ఆర్థిక నిపుణులు సైతం దేశం వృద్ధిలోటు, అత్యధిక ద్రవ్యోల్బణ ప్రమాదంలో కూరుకుపోతోందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత నవంబర్‌లో పెరిగిన ఆహార ధరలు రీటెయిల్ ద్రవ్యోల్బణాన్ని మూడేళ్ల గరిష్టం 5.54 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అలాగే పారిశ్రామిక రంగ ప్రగతి కూడా వరుసగా మూడోనెల సైతం 3.8 శాతానికే పరిమితమైంది. కాగా బుధవారం జరిగిన సంప్రదింపుల సమావేశానికి గోవా ముఖ్యమంత్రి, హర్యానా, పాండిచ్చేరి ఉప ముఖ్యమంత్రులు, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, తమిళ్‌నాడు, త్రిపురలతోబాటు మరో 17 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికార ప్రతినిధులు హాజరయ్యారు. ఫెడరల్ విధాన స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని, తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఆకాంక్షించారు.

*చిత్రం...న్యూఢిల్లీలో బుధవారం జరిగిన 38వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ తదితరులు