ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు ఆర్టీసీకి 10 కోట్లు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

151 బస్సులు నిలిపివేత
తిరుపతి, డిసెంబర్ 3: గత 20 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వర్షాల కారణంగా ఆర్టీసీకి రూ.10కోట్లు నష్టాలు వచ్చాయని ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు చెప్పారు. వరదనీటితో తూర్పు మండలాల్లో రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. పలుచోట్ల జలాశయాలు నిండి వస్తున్న నీటితో రోడ్లపైన ఉద్ధృతంగా వరదనీరు ప్రవహిస్తోందన్నారు. దీంతో బస్సులు నడపాలంటేనే డ్రైవర్లు హడలిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయన్నారు. ఈనేపధ్యంలో తూర్పు మండలాల్లో 32 రూట్లలో 151 సర్వీసులను పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. చెన్నయ్, కంచి మార్గాల్లో వెళ్ళే బస్సులను నడపలేని పరిస్థితి ఉందన్నారు. శ్రీకాళహస్తి నుంచి పిచ్చాటూరు, కాళంగి,బొమ్మపల్లిప్రాంతాలకు కూడా బస్సు సర్వీసులు నిలిపివేశామన్నారు. ఈ వర్షాలు నవంబర్ 7న ప్రారంభమయ్యాయని మధ్యలో మూడు రోజులు తెరపిచ్చినా తక్కిన రోజుల్లో బస్సులు నడపలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈకారణంగా రోజుకు రూ.50లక్షలు నష్టం వాటిల్లిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
జనవరిలో భక్తరామదాసు కీర్తనల నృత్యాభిషేకం
భద్రాచలంకు రానున్న
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు ప్రతినిధులు
భద్రాచలం, డిసెంబర్ 3: వచ్చే జనవరి నెల 24వ తేదీన ఖమ్మం జిల్లా భద్రాచలంలో భక్తరామదాసు కీర్తనల నృత్యాభిషేకం జరగనుంది. ఈ మేరకు తెలంగాణ ఉత్తమ ఉపాధ్యాయ సంఘం నేతృత్వంలో జరిగే కార్యక్రమ వివరాల కరపత్రాలను గురువారం భద్రాచలంలో ఆవిష్కరించారు. గతంలో అన్నమాచార్య కీర్తనలకు నృత్యాభిషేకం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కిన సంగతి విదితమే. ఈసారి భక్తరామదాసు కీర్తనలతో భరత, కూచిపూడి, పేరిణి, గిరిజన సంప్రదాయ నృత్యాలతో 555 మంది కళాకారులు రామయ్యకు కళాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రికార్డు చేసేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్సు, సూపర్ కిడ్స్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు జనవరి 24న తొలిసారి భద్రాచలం వస్తున్నారు.
భువనేశ్వరీ పీఠాధిపతి ప్రకాశానంద భారతీస్వామి బ్రహ్మైక్యం
గన్నవరం, డిసెంబర్ 3: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని శ్రీ భువనేశ్వరీ పీఠాధిపతులు శ్రీ ప్రకాశానంద భారతీస్వామి(95) బుధవారం రాత్రి 11.45 గంటలకు బ్రహ్మైక్యం చెందినట్లు భువనేశ్వరీ పీఠ ఉత్తర పీఠాధిపతులు శ్రీ సత్యానంద భారతీస్వామి తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ స్వామీజీ తుదిశ్వాస విడిచారని తెలిపారు. 2006 నుండి కేసరపల్లి శ్రీ భువనేశ్వరీ పీఠాధిపత్యం వహించారు. వీరు పీఠానికి బహుముఖ సేవలు అందించారని, వారు లేనిలోటు తీర్చలేనిదన్నారు. పూర్వాశ్రమంలో వీరు గుంటూరులో తెలుగు పండితులుగా పనిచేసినట్లు ఆయన తెలిపారు. స్వామీజీ అంత్యక్రియలు చిదానందాశ్రమం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 9గంటలకు నిర్వహించనున్నట్లు సత్యానంద భారతీస్వామి తెలిపారు. ప్రకాశానంద భారతీస్వామి నిర్యాణం పట్ల భువనేశ్వరీ పీఠం కార్యదర్శి రాఘవరాయ శర్మ, గన్నవరం బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు విష్ణుమూర్తి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
సముద్రంలో పడవ బోల్తా: ఇద్దరి దుర్మరణం
బాపట్ల, డిసెంబర్ 3: మర పడవ బోల్తా పడి సూర్యలంక వద్ద సముద్రంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. వినోదం కోసం గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక సముద్రానికి వచ్చిన మిత్రబృందానికి అంతులేని విషాదం మిగలగా, రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాకుమాను గ్రామానికి చెందిన రైతు గురజాల లక్ష్మీనారాయణ(40), ఇతని స్నేహితుడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న నల్లమోతు రత్నబాబు (40) మరో ఐదుగురు స్నేహితులు కలసి గురువారం బాపట్ల మండలంలోని సూర్యలంక సముద్ర తీరానికి బయలుదేరారు. పేరలి డ్రెయిన్ సముద్రంలో కలిసే పొగురు వద్ద అలల ఉద్ధృతి అధికంగా ఉండటంతో పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ, రత్నబాబు మృత్యువాత పడగా, మిగిలిన ఐదుగురిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. మర పడవ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బాపట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.