Others

కలెక్షన్లను సమీక్షలు ప్రభావితం చేయగలవా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మంత్రాలకు చింతకాయలు రాల’వన్న నానుడి సర్వవిదితం. అయితే నేడు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు తమ సినిమా ప్రేక్షకాదరణ పొందలేక పోవడానికి కారణం సదరు సినిమా మీదొచ్చిన సమీక్షలేనంటూ, సమీక్షలు రాసున్నవారిపై ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. ఎన్ని వినోద కార్యక్రమాలను శాటిలైట్ ఛానల్స్ ప్రసారం చేస్తున్నప్పటికీ, సినిమా మాత్రం తన ప్రాభవాన్ని కోల్పోలేదు. దీన్నిబట్టి సినిమా అంటే ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అవగతమవుతుంది. గతంలో దినపత్రికలు ఏవీ కూడా సినిమా వార్తలకు అంత ప్రాధాన్యం ఇచ్చేవికావు. అయితే పాఠకులు సినిమా వార్తలను ఇష్టంగా చదువుతుండటంతో నేడు అన్ని దినపత్రికలు రోజూ సినిమాకు ప్రత్యేకంగా పేజీని కేటాయిస్తున్నాయి. కొన్ని దినపత్రికలైతే ప్రతివారం సినిమాల మీద సప్లిమెంటరీలు అందిస్తున్నాయి. దీంతో పలువురు సినిమా సమీక్షలు చేయడం ప్రారంభించారు. ఇంటర్నెట్‌లో నేడు పలు సినిమా వార్తలు అందించే వెబ్‌సైట్లు ఉన్నాయి. గతంలో సినిమా సమీక్షలు సినీ వారపత్రికల్లో మాత్రమే కనిపించేవి. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇంటర్నెట్‌లో సినిమాలపై సమీక్షలు రావడం ఎక్కువైంది.
కొందరు సమీక్షకులు సినిమాలకు రేటింగ్స్ ఇస్తున్నారు. అయితే ఈ సమీక్షలే తమ సినిమా కలెక్షన్లకు గండి కొడుతున్నాయని వాపోయేవారు ఎక్కువయ్యారు. సినిమాలో సత్తాలేకుండా అద్భుతంగా ఉందని సమీక్షలొచ్చినా.. సదరు సినిమాకు కలెక్షన్లురావనే నగ్నసత్యాన్ని వీరు గుర్తించడం లేదు. నేడు సినిమా థియేటర్లకు వస్తున్నవారిలో క్లాస్ కన్నా మాస్ ప్రజలే ఎక్కువ. మాస్ ప్రజల్లో కనీసం ఐదుశాతం కూడా ఈ సినిమా సమీక్షలను చదవరు. వారు సినిమాకు వెళ్ళారంటే, అది కేవలం వౌత్ పబ్లిసిటీ ద్వారానే సాధ్యం. సమీక్షలకన్నా వైవిధ్యమైన పోస్టర్లు, వౌత్ పబ్లిసిటీలే ఏ సినిమా విజయంలోనైనా కీలకపాత్ర వహిస్తాయి. అంతేగాని సమీక్షలు అద్భుతంగా రాయించుకోవడం ద్వారా సినిమా కలెక్షన్లు పెరగవన్నది వాస్తవం.
ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా ఇటీవల బాక్సాఫీసువద్ద చతికిలపడిన పలు పెద్ద సినిమాలకు మంచి సమీక్షలు రావడంతోపాటు రేటింగ్స్ కూడా వచ్చాయి. అయితే కలెక్షన్లు మాత్రం రాలేదు. అనామకంగా విడుదలైన పలు చిన్న సినిమాలు ఘనవిజయం సాధించాయి. ‘సినిమా చూపిస్త మామ..’ వంటి సినిమాలను అయితే సమీక్షకులు ఎవరూ పట్టించుకోలేదు. అయినప్పటికీ సదరు చిత్రం ఘన విజయం సాధించింది.
పెరుగుతున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిలువరించడం ఎవ్వరికీ సాధ్యంకాదు. అదేవిధంగా వెబ్‌సైట్లలో వచ్చే చిత్ర సమీక్షలను నిలువరించడం కూడ కుదరదు. ‘పుర్రెకోబుద్ధి- జిహ్వకో రుచి’ అన్న చందాన ఒకే సినిమాపై సమీక్షలు వివిధరకాలుగా వస్తాయి. అన్ని సమీక్షలు ఒకే విధంగా ఉండటం అనేది జరగదు. ప్రతి సినిమా విడుదలకుముందు విపరీతమైన అంచనాలు, సదరు సినిమాపై ఉండే విధంగా చిత్ర నిర్మాతలు, దర్శకులు, హీరోలు ప్రచారం చేస్తున్నారు. ఎన్నో అంచనాలతో థియేటర్‌లోకి వెళ్ళినవారికి, సినిమాలో సత్తా కనిపించకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సినిమా విడుదలకు ముందు చేస్తున్న అసత్య ప్రచారమే పలు సినిమాల పాలిట పెనుశాపంగా మారుతోంది. అంతే తప్ప సమీక్షలు వలన సినిమా కలెక్షన్లు తగ్గిపోతున్నాయనడం సరికాదు.
గతంలోకన్నా ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఓవర్సీస్ బిజినెస్ (విదేశీ వ్యాపారం) పెరిగింది. అయితే, విదేశాల్లో కలెక్షన్లను ఈ సమీక్షలు కొంతవరకు ప్రభావితం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. విదేశాల్లో ఉన్న తెలుగువారు ఇంటర్నెట్‌లో వచ్చే సమీక్షలను ఫాలో అవుతుంటారు. అందువలన అక్కడ సినిమా కలెక్షన్లు సమీక్షలపై ఆధారపడతాయనడంలో అర్ధం ఉంది. తెలుగునాట సమీక్షలు సినిమా కలెక్షన్లను ప్రభావితం చేస్తాయనడంలో అర్ధం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందాన వినూత్న కథ, పట్టుత్వమైన కథనంతో సినిమాలు నిర్మించకుండా తమ సినిమా పరాజయానికి కారణం సమీక్షలేనంటూ చిత్ర సమీక్షకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో సరుకు లేకుండానే బావుందంటూ చాలా సనిమాలకు సమీక్షలు వచ్చినా, కలెక్షన్లు పెరగకపోవడం గమనార్హం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ -ఇకనైనా సమీక్షల పిచ్చినుంచి బయటకు రావాలి. నిర్మాణం పట్ల శ్రద్ధ పెట్టాలి. మంచి కథ, కథనాలతో కూడిన సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

-పి మస్తాన్‌రావు