సంపాదకీయం

కాంగ్రెస్ ‘పొత్తు’లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వ పరిరక్షణ అనుమానాస్పదంగా మారి వుండడం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శాసన సభలకు జరగనున్న ఎన్నికలకు నేపథ్యం! 2014 నాటి లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారాన్ని మాత్రమేకాక, లోక్‌సభలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయిన కాంగ్రెస్ వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు తోకగానో, ఈకగానో ఏర్పడడానికి సైతం సిద్ధమైపోయింది. గత బీహార్ శాసనసభ ఎన్నికలు ఇందుకు నిదర్శనం! తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి ఎమ్.కరుణానిధి నాయకత్వంలోని డిఎంకెతో మళ్లీ జట్టు కట్టడానికి కాంగ్రెస్ నిర్ణయించుకోవడం మరో ఉదాహరణ! పశ్చిమ బెంగాల్‌లో మాత్రం కాంగ్రెస్‌ను తమ వామ కూటమిలో చేర్చుకోవడానికి సిపిఐఎమ్ వారు తహతహలాడుతుండడం విచిత్రమైన విపరిణామం! 2014నాటి లోక్‌సభ ఎన్నికలకంటె ముందే పశ్చిమ బెంగాల్‌లో బలహీనపడి, అధికార పీఠంపైనుండి పడిపోయిన వామపక్షాలు కాంగ్రెస్ నిచ్చెన ద్వారా మళ్లీ పీఠంపైకి ఎగబ్రాకడానికై కమ్మటి కలలను కంటుండడం ఈ విచిత్ర విపరిణామానికి ప్రాతిపదిక! కాంగ్రెస్ సహకారంతో మాత్రమే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించడం సాధ్యమన్న జ్ఞానోదయం సిపిఐఎమ్ వారికి కలగడం బెంగాల్ రాజకీయాలలో మరో కలకలం...్భరత కమ్యూనిస్ట్ పార్టీనుండి 1960వ దశకంలో చీలిపోయి ప్రత్యేక పార్టీగా అవతరించిన మార్క్సిస్టులు పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ మైత్రిని కాంక్షించడం బహుశా ఇదే మొదటిసారి! 1977 వరకు దేశమంతటా కాంగ్రెస్‌తో జట్టుకట్టిన సిపిఐ సైతం 1977 తరువాత సిపిఐఎమ్ కూటమిలో చేరిపోయింది. మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పుట్టుకొచ్చేవరకు పశ్చిమ బెంగాల్ సిపిఐఎమ్ వారి వామ కూటమికి కాం గ్రెసే ప్రధాన ప్రత్యర్థి! ఆ తరువాత కూడ ఇప్పటివరకు కాం గ్రెస్ వారు, వామ కూటమి వారు పరస్పరం ప్రత్యర్థులే! ఇలా పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ప్రాధాన్యం పెరుగుతుండగా తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ డిఎమ్‌కెను కొన్ని స్థానాల కోసం దేబిరించవలసిన పరిస్థితి ఏర్పడింది! తమిళనాడులో కాంగ్రెస్ 1971 నుండి కూడ ద్రవిడ పార్టీల అండదండలతో మాత్రమే లోక్‌సభా ప్రవేశం చేయగలిగింది. అయితే ఇప్పుడు ఆయిష్టంగానే కాంగ్రెస్ డిఎమ్‌కె తోక పట్టుకుంటోంది! 2జి స్పెక్ట్రమ్‌లో అవినీతిగ్రస్తమైన డిఎమ్‌కెకు దూరంగా ఉండాలన్నది నిజానికి కాంగ్రెస్ ఆశ! అలాగే తమకంటె ఇబ్బడి ముబ్బడిగా అప్రతిష్టపాలైపోయిన కాంగ్రెస్‌తో చేతులు కలపాలన్న ఉత్సాహం డిఎమ్‌కె నాయకులకూ కూడ లేదు! రాష్ట్ర ముఖ్యమంత్రి జె.జయలలిత కాంగ్రెస్‌ను దగ్గరికి చేరనివ్వడం లేదు. భాజపా వారు డిఎమ్‌కె కూటమితో పొత్తుకు ఉత్సాహం చూపడంలేదు! అందువల్ల డిఎమ్‌కె కాంగ్రెస్‌ల మధ్య మైత్రి అనివార్యం అయిపోయింది!
తమిళనాడులో కాంగ్రెస్ ఉనికి దశాబ్దుల తరబడి ద్రవిడ పార్టీల మద్దతుపై ఆధారపడి ఉంది. తమిళనాడులో 1967లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ 1969లో జాతీయస్థాయిలో చీలిపోయింది. దేశమంతటా ఇందిరాగాంధీ నాయకత్వంలోని వర్గం ప్రధానమైన కాంగ్రెస్ కాగా తమిళనాడులో మాత్రం కామ్‌రాజ్ నాడార్ నాయకత్వంలోని వర్గం ప్రధానమైన కాంగ్రెస్‌గా అవతరించడం చరిత్ర! అందువల్ల ఉనికి లేని తమ పార్టీని డిఎమ్‌కె అండదండలతో బతికించుకోవాలన్నది ఇందిరాగాంధీ వ్యూహం! ఫలితంగా 1971 నాటి ఎన్నికలలో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ డిఎమ్‌కెతో పొత్తుపెట్టుకుంది. పది లోక్‌సభ స్థానాలకు మాత్రమే పోటీ చేయగలిగింది! ప్రధాన ప్రత్యర్థి అయిన కామరాజ్ నాడార్ వర్గం కాంగ్రెస్ తమిళనాడులో పరాజయం పాలు కావడం 1971 నాటి మాట! 1977 నాటి లోక్‌సభ ఎన్నికలనాటికి కామరాజ్ వర్గం వారు ఇందిరా కాంగ్రెస్ కలిసిపోవడంతో కాంగ్రెస్ బలపడింది! డిఎమ్‌కె చీలిపోయి, ఎమ్‌జి రామచంద్రన్ నాయకత్వంలో అన్నాడిఎమ్‌కె ఏర్పడడం సమాంతర పరిణామం! అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ ఒకసారి అన్నా డిఎమ్‌కెతోను, మరోసారి డిఎమ్‌కె తోను జట్టుకట్టి ఎన్నికలలో పోటీ చేయడం చరిత్ర! 1989 ఆరంభంలో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది! అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాడిఎంకె అధినేత ఎమ్.జి.రామచంద్రన్ మరణించడంతో ఆ పార్టీలో చీలిక ఏర్పడింది. రెండువర్గాలు విడివిడిగా పోటీ చేసాయి. అందువల్ల ధైర్యం పుంజుకున్న కాంగ్రెస్ కూడ ఒంటరిగా పోటీ చేసింది. ఫలితంగా ఎమ్.కరుణానిధి నాయకత్వంలోని డిఎమ్‌కె అక్కడ విజయం సాధించింది.
కాంగ్రెస్‌కు తన బలమేమిటో అప్పుడే తెలిసివచ్చింది! ఈ బలం కూడ 1970వ దశకంనాటి కామరాజ్ నాడార్ వర్గం బలం. కామరాజ్ నాడార్ అనేక ఏళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తరవాత అఖిల భారతీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ఈ వర్గం 1969లో చీలిపోయి మళ్లీ 1977లో కాంగ్రెస్‌లో కలిసిపోయిది. జికెమూపనార్ ప్రభృతులు కాంగ్రెస్‌లో ఈ కామరాజ్ వారసత్వానికి ప్రతీకలు! మూపనార్ వర్గం వారు కాంగ్రెస్‌నుండి విడిపోవడం మళ్లీ కాంగ్రెస్‌లో కలిసిపోవడం మళ్లీ విడిపోవడం...ఇప్పుడు కొనసాగుతున్న చరిత్ర! 1996నాటి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అన్నాడిఎమ్‌కెతో జట్టుకట్టింది. ఇలా జట్టుకట్టడానికి నిరసనగా జికెమూపనార్ వర్గంవారు కాంగ్రెస్ నుండి చీలిపోయారు. మూపనార్ వర్గంవారు డిఎమ్‌కె కూటమిలో చేరి పోటీ చేసి 1996 నాటి లోక్‌సభ ఎన్నికలలో ఘన విజయం సాధించా రు! కాంగ్రెస్, అన్నాడిఎంకె కూటమి ఘోర పరాజయం పాలైంది. జికెమూపనార్ నాయకత్వంలోని ఈ తమిళ మానిలా కాంగ్రెస్-టిఎమ్‌సి- 2002లో మళ్లీ కాంగ్రెస్‌తో కలిసి పోవడంతో కాంగ్రెస్‌కు మళ్లీ అస్తిత్వం ఏర్పడింది. కానీ జికెమూపనార్ కుమారుడు, మాజీ కేంద్రమంత్రి జికెవాసన్ 2014న నవంబర్‌లో మళ్లీ తమిళనాడులో కాంగ్రెస్‌ను చీల్చాడు. వాసన్ వర్గం తమిళనాడులో కామరాజ్-మూపనార్ వారసత్వానికి ప్రతినిధులు. అందు వాసన్‌వర్గం నిష్క్రమణతో తమిళనాడులో కాంగ్రెస్ చక్రాలు లేని బండిలాగ కూలబడి ఉంది! అందువల్ల ద్రవిడ పార్టీల పొత్తు కాంగ్రెస్ మరింత అనివార్యమైంది. 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేసిన కాంగ్రెస్‌కు లభించిన సీట్లు సున్న. కాంగ్రెస్‌తో పొత్తులేని డిఎమ్‌కెకు సైతం సున్న సీట్లు లభించాయి. అందువల్ల రెండు సున్నలు ఏకమై ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వంలోని అన్నాడిఎమ్‌కెను ఎదిరించాలన్నది వ్యూహం! 2001లో జయలలిత పార్టీ శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధించింది. 2006లో కరుణానిధి నాయత్వంలోని కూటమి గెలిచింది. 2011లో మళ్లీ జయలలిత ఘనవిజయం సాధించింది! ఇలా ఐదేళ్ల కోసారి అధికార పార్టీ పరాజయం పాలవుతుండడంవల్ల డిఎమ్‌కెకు ఆశలు చిగురిస్తున్నాయి! అయితే కాంగ్రెస్ పార్టీవారు డిఎమ్‌కె పంచన చేరుతుండడానికి కారణం అన్నాడిఎమ్‌కె వారు తమ కూటమిలోకి రానివ్వకపోవడమే!
డిఎమ్‌కె కూటమిలో కూడ కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్రాధాన్యం లేదు! డిఎమ్‌కె పార్టీవారు ఎన్ని సీట్లను విదిల్చినప్పటికీ పొత్తును వదల్చుకోలేని దుస్థితి కాంగ్రెస్‌ది. తమిళనాడులో కాంగ్రెస్ పొత్తు కోసం తహతహలాడుతోంది, డిఎమ్‌కె మాత్రం ఇంకా నిర్ణయించలేదట! పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ జట్టుకోసం సిపిఐఎమ్ తపిస్తోంది. కాంగ్రెస్ నిర్ణయించుకోలేదట...ఇదీ అంతరం!