సెంటర్ స్పెషల్

మహావిజేత-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

3
పురుషోత్తమాచార్యుల ఆశ్రమం. సామూహిక ధ్యాన సమయం.
పురుషోత్తమాచార్యుల వారు కళింద మహా మండలానికి పెద్ద దిక్కు. ఆయన కళింద్ర మహా మండలానికి ఎన్నో దశాబ్దాల క్రితం ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన గురువు. ఉత్తర భారతంలో వర్థిల్లుతున్న కురు మహాసామ్రాజ్యంలో వున్నవాడు. అక్కడ ద్రోణాచార్యుల వారి నుండి వేద వేదాంత శాస్త్ర జ్ఞానాన్నీ, వివిధ యుద్ధ విద్యల్నీ పొందినవారు. అందువలన ఆయన అటు జ్ఞాన ప్రబోధానికీ, ఇటు యుద్ధ విద్యా శిక్షణకీ తగిన వారని కుళిందకుడు ఆయన్ని ఇక్కడికి ఆహ్వానించాడు. అందువలన కుంతల రాజ్యాధిపతి అగ్నివర్మకూ ఆయన గురువు గాలవులకూ ఆచార్యుల వారంటే అభిమానం. కుళిందకుడికి గౌరవాస్పదుడు. పూజనీయుడు. ఆ కారణం వలన రాజ్యంలో అందరి గౌరవాన్ని పొందినవాడు. రాచకార్యాల్లో సమయజ్ఞతతో సలహా సంప్రదింపుల్ని అందజేస్తూ ఉంటాడు.
కుళిందకుడి భార్య మేధావినీ దేవి పట్ల పుత్రికా వాత్సల్యం ఉంది పురుషోత్తములకు. మంత్రి చేతనుడు కూడా ఆచార్యుల సూచనలను మన్నిస్తూ రాచ వ్యవహారాలను నిర్వహిస్తూ ఉంటాడు. సేనాని సింగన్న చిన్నతనంలో ఆచార్యులవారి శిష్యుడే.
ఈ ఏర్పాటు అగ్నివర్మకూ ఆమోదయోగ్యమయింది. కుళిందకుడు కుంతల ప్రభువులకు సామంతుడు.
పురుషోత్తముల ఆశ్రమ పాఠశాల కళింద్రకు ఒక అవసరమే కాక, ఒక అలంకారంగా కూడా ప్రవర్థిల్లుతోంది.
కుళిందకుని పుత్రుడు అక్షయుడు. పెంపుడు కూతురు పద్మిని. ఆమె మేధావినీదేవి అక్కగారి పుత్రిక. అక్క ముషికరాజు భార్య. పద్మిని పుట్టిన ఆరు నెలలకే ఆమె తల్లిదండ్రులు శత్రువుల చేతిలో నిహతులైనారు.
ఆ యుద్ధాలు సాగుతుండగానే ఆ పసిబిడ్డను తాను తెప్పించుకున్నది మేధావినీదేవి. ఆనాటి నుంచీ ఆ బిడ్డను అక్షయునితో సమానంగా పెంచింది.
ఊహ తెలియని వయస్సు నుంచీ అక్షయునితో కలిసి పెరగటం వలన పద్మినీ - అక్షయుల వాత్సల్యం, ప్రేమానురాగాలన్నీ సోదరీ సోదర బంధంతో వృద్ధి చెందాయి. ఆటపాటల్లో, విద్యాభ్యసనంలో ఇద్దరూ సమఉజ్జీలుగా రాణిస్తున్నారు.
ఇప్పుడు ఈ ఇద్దరికీ సహచరుడు చంద్రహాసుడు. ముగ్గురూ ఒకరికొకరు ప్రాణసములు! అక్షయుడు చంద్రహాసుణ్ణి ‘అన్నా’ అనే పిలుస్తాడు. పద్మినికి అక్షయుడు అన్న. ఆమె చంద్రహాసుని మాత్రం ‘చంద్రా’ అనే పిలుస్తుంది.
మేధావినీదేవి - కుళిందకులకు కూడా ముగ్గురు అరచేతి నిమ్మపండ్లే. కాకుంటే చంద్రహాసుడు గజనిమ్మపండేమో!
వౌనంగా కూర్చుని ఉన్నాడు అక్షయుడు. మనస్సు ధ్యానం మీదికి పోవడంలేదు.
ఈ చంద్రహాసుడి తీరే వేరుగా ఉంటుంది. భాష కూడా వేరుగా అనిపిస్తుంది. కొత్తకొత్త మాటల్ని ప్రయోగిస్తూ ఉంటాడు. ‘ఎలా తెలుసివన్నీ’ అని తానడిగితే
‘గురువుగారు మాట్లాడేటప్పుడు పట్టేస్తాను’ అని నవ్వేశాడు. మరోసారి ‘చిన్నప్పుడు నాకు మా దాది చాలా విషయాలు చెప్పేది’ అని ఆ ప్రసక్తిని పక్కకి మళ్లించేవాడు.
‘అతని ప్రతి చర్యా ఆసక్తిదాయకమే. అతనికివన్నీ ఈ విధంగా ఎలా చేతనయినై?’ అక్షయుని తలపులీ విధంగా సాగుతుంటే పద్మిని కూడా అక్షయుని మాదిరి చంద్రహాసుని గురించే ఆలోచిస్తున్నది.
ఒకసారి చంద్రహాసుడు ఏదో నీతి కథ చెప్తుంటే ఆ చెప్తున్న తీరు అందరినీ కట్టి పడేసింది. అతనేది చెప్పినా అందరూ వింటారు. అతనికెలా చేతనయిందో ఈ విద్య అనుకుంటూ అతన్ని చూస్తోంది పద్మిని.
‘రేపు రాజప్రాసాదం ముందు ధనుర్విద్యా ప్రదర్శన సమయానికి అందరూ అక్కడికి చేరుకోవాలి. ప్రత్యేకించి విద్యార్థినులు గుర్తుంచుకొని రావాలి’ అంటూ దుర్గి వైపు చూపులు సారించారు. ఆ హెచ్చరికని అర్థం చేసుకున్న దుర్గి ‘చిత్తం’ అన్నట్టుగా తలూపి తలవంచుకున్నది. దుర్గి సింగన్న కూతురు. ఆశ్రమానికి రావటంతో ఈ వేళ ఆలస్యమయింది. అందుకూ గురువుగారి హెచ్చరిక!
‘ఇక మీరు వెళ్లవచ్చు’ అన్నారు గురువుగారు.
అందరూ గురుదేవులకి ప్రణామం చేసి బయలుదేరారు.
ధనుర్విద్యా ప్రదర్శనమంటే అత్యుత్సాహం ఉన్న కొందరు కేరింతలతో ‘ఓహో’ ‘సాహో’ లతో బయటికి పరుగెత్తుకు పోయారు.
4
అదిగో మొక్కుల కొండ! దాని లోతట్టున మారుతీ వ్యాయామశాల! పెద్ద వలయాకారంలో ఉంది. గరిడీశాల కోలాహలంగా ఉంది. ప్రాంగణమంతా భూపాల రాగం ప్రస్తారమవుతోందా అన్నట్టుంది. సాధకుల సంభాషణలతో, గుసగుసలతో సందడి సందడిగా ఉంది. శాలలోని మర్రిచెట్టు గాలి తెరలతో ఆహ్లాదాన్ని పంచుతోంది.
మర్రిచెట్టు కింద పది పదిహేను మంది దాకా యువక వీరులున్నారు. అందరూ పదిహేనేళ్ల నుంచీ పాతికలోపు వయసువారు. కాయకష్టంతో రాటుదేలిన జబ్బలూ - పిక్కలూ, కండలు తిరిగిన శరీరాలతో చూడముచ్చటగా నిగనిగలాడుతున్నారు. తలకి పొత్తుల తువ్వాళ్లు చెక్కుకుని, నడుముకు దట్టీలు బిగించుకుని కూర్చుని ఉన్నారు. వారి ముఖాల మీదకు జారిన చెమట బిందువులు మంచి ముత్యాల్లా మెరుస్తున్నాయి.
గరిడీశాల మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నాడు జెట్టి. జెట్టి పేరు అడివప్ప.
అడివప్ప బాగా వొడ్డూ పొడుగూ వున్న మనిషి. చెయ్యెత్తి నిలిస్తే చెట్టంతవాడు. శిష్యులకైతే గొడుగులాంటి మనిషి. అరవై యేళ్ల వయస్సు - అయినా, నడి వయస్సు వాడిలా కనిపిస్తాడు. కండలు తిరిగిన దేహం, విగ్రహం రాయి రంగు. మెడ మీదుగా జారుముడి వేసి వదిలేసిన నల్లటి పొడుగు జుట్టు. గుబురు మీసాలు. మోకాలి పైకి కట్టిన కావిపంచె. చేతులు లేని అంగీ! నడుముకు చెంగావి చీరెదట్టీ. విశాలమైన ఛాతీ మీద కొట్టొచ్చినట్టు వేళ్లాడుతున్న పులిగోరు పతకం. చేతిలో చిన్న పొన్నుగర్ర. వాత్సల్యంతో కూడిన ఆయన కళ్ల లోలోతుల్లో నిశితమైన పరీక్షా కేంద్రాలున్నట్టు తీక్షణత. నుదుటి కుంకుమబొట్టు పవిత్రతను సూచిస్తోంది.
ఒక పక్కన అయిదారుగురు పొదలిక దండ చేస్తున్నారు. ఒకచోట నలుగురి మధ్య కర్రసాము సాగుతోంది. మరోచోట గడదండ డింకీలు జరుగుతున్నాయి. తూర్పుమొన అంజమెడపట్టు హలహలకంగా, అమిత ఉత్కంఠగా సాగుతోంది. అక్షయుడూ, చంద్రహాసుడూ తలపడుతున్నారు. శిష్యులిద్దరూ ఉద్దండులే. ఇద్దరూ సాహసికులే. ఇరువురూ పట్టులోనూ, పట్టుదలలోనూ ఘటికులే.
ఈ మల్ల బంధ ప్రదర్శనను అడివప్ప నిశితంగా పరికిస్తున్నాడు.
వాత్సల్య దృక్కులతో అభినందనపూర్వకంగా శిష్యుల్ని చూస్తున్నాడు అడివప్ప.
ఎవరూ ఎవరికీ తీసిపోవటం లేదు. ప్రత్యర్థికి ఏ వెసులుబాటునీ చిక్కనీయటం లేదు.
అదాటున చంద్రహాసుని మెడకి కాసె నిల్కడ గళకత్తెర బంధం వేసి, కింది మోకాలిని వంచి, పడవేయబోయాడు అక్షయుడు.
క్షణంలో సగంసేపు అడివప్పతో సహా చూపరులందరికీ దిగ్భ్రమ కలిగింది.
చంద్రహాసుడు కూలి చిత్తయి పోయాడనే అనిపించింది.
అప్రయత్నంగా, ‘అరె... హొరె’ మాటలు చూపరుల పెదవుల మీద నిలిచిపోయాయి.
అడివప్ప అడుగులు చకచకా వారి వైపు కదిలాయి.
తృటిలో పరిస్థితి మారిపోయింది.
చంద్రహాసుడు తనను తాను నిలువరించుకున్నాడు. వొడుపుగా మెడని పక్కకి తిప్పాడు. అక్షయుడి బంధం నుంచీ తల మొత్తాన్ని కిందికి జార్చుకున్నాడు. మెడ విడివడింది. తన కాలుతో అక్షయుడి రెండు కాళ్లకీ బిత్తరి బొంకింపు తగిలించాడు. అక్షయుడు ఉన్నపాటున ఒరిగిపోయాడు. నేలగఱచాడు.
పెళ్లున ఎండ వచ్చినట్లు ఇద్దరూ గలగలా నవ్వుతూ లేచారు. చేతులు కలుపుకున్నారు. అడివప్ప వారిని సమీపించి ‘సాహో’ అన్నాడు.
ఇద్దరూ వంగి గురువుగారికి దణ్ణం పెట్టారు.
‘నా రెట్టింపు ఆయువుతో బతకండిరా పిల్లలూ’ అన్నాడు అడివప్ప. ఒకరి తర్వాత ఒకరిని చేతులతో దగ్గరికి తీసుకున్నాడు. చిరునవ్వుతో మురిపెంగా వారి భుజాల మీద ఆప్యాయంగా నిమిరాడు.
మర్రిచెట్టు కింది పిల్లలు కూడా వారి దగ్గరకు చేరారు.
అక్షయుడు ఏదో చెప్పబోతున్నట్లు గ్రహించాడు అడివప్ప. అతని కళ్లల్లోకి చూస్తూ ‘చెప్పు’ అన్నాడు.
‘అన్న దగ్గరి వొడుపులూ వాటాలూ నాకింకా తెలీటంలేదు. అనే్నమో - చెప్పడు’ కించపడుతూ అన్నాడు.
ఏదో ఆలోచిస్తున్నవాడిలా చంద్రహాసుడి వైపు చూశాడు అడివప్ప. ‘ఏమంటావ్ చంద్రా?’ అన్నాడు.
‘నిజం చెప్పాలంటే నాకంటే అక్షయుడికే ఎక్కువ బంధాలు తెలుసు. నిన్న ఉదయం మీరు లేరు. తనేం చేశాడో తెలుసా?’ అంటూ అక్షయుడి వైపు గోముగా చూశాడు చంద్రహాసుడు. ‘చెప్పు... చెప్పు’ చేతుల్తో ఉడికించాడు అక్షయుడు.
వాళ్లిద్దరూ కలిసి నడుస్తూ వచ్చి పక్కనున్న రాతి దినె్న మీద కూర్చున్నాడు అడివప్ప. శిష్యులంతా చుట్టూ చేరారు.
‘అన్న అబద్ధం చెప్తున్నాడు. నిన్న ఉదయం - చాలాకాలం క్రితం మీరు నేర్పిన ‘సర్వాంకుశ బంధం’ ప్రయోగించాడు నా మీద. నేను గిలగిలలాడేను. ఏం జరుగుతున్నదో తెలియక అరిచి గగ్గోలు పెట్టాను. అప్పుడు వదిలిపెట్టాడు. చప్పట్లతో ఎగతాళి చేస్తూ ఆ బంధం సంగతి చెప్పాడు. నాకసలు ఆ బంధం సంగతే గుర్తులేదు. కావాలంటే వాళ్లనీ అడగండి’ చుట్టూ వున్న వాళ్లను చూపిస్తూ అన్నాడు.
అడివప్ప నవ్వుతూ చంద్రహాసుడి వైపు చూశాడు. చంద్రహాసుడు గంభీరంగా అందరి వైపు చూస్తూ ‘ప్రత్యర్థిని మనం నిలువరించలేక పోతున్నప్పుడు మనకు ఎన్ని విద్యలు తెలుసూ - అని మీనమేషాలు లెక్కించకుండా అతన్ని ఏ విధంగా చిత్తు చేయగలమో ఆ ప్రయోగాన్ని సమయస్ఫూర్తితో ఉపయోగించాలి. విద్యల నైపుణ్యంకన్నా సమయస్ఫూర్తి ముఖ్యం. ప్రత్యర్థి బలహీనతని మన అవకాశంగా మలుచుకో గలగాలి. నేను చేసింది కూడా అదే’ అన్నాడు.
‘అవునవును. నిజమే. మంచి సలహా ఇచ్చావు’ అంటూ అందరూ చప్పట్లు కొట్టారు.
అడివప్ప అక్షయుడిని చూస్తూ కళ్లు చికిలించాడు. ‘వ్యక్తి శౌర్యం, ధైర్యం, చాతుర్యం, సమయస్ఫూర్తీ - అన్నీ ఏకకాలంలో పని చెయ్యాలి. అప్పుడే వీరుడికి జయం’ అన్నాడు. ఆలోచనల్లో పడ్డాడు అక్షయుడు.
‘అవును’ అన్నాడు చంద్రహాసుడు.
చంద్రహాసుని చూస్తూంటే అడివప్ప మనసులో అనేక భావాలు తరగలెత్తాయి.
ఆలోచనలో, మాటతీరులో ఇతర పిల్లల కంటే పూర్తిగా భిన్నమైన సరళి ఇది. బహుశ ‘ఏదో జన్మము లోనిది పాదు’ అనిపిస్తుంది. తన శిష్య బృందంలో ఒక్క చంద్రహాసుడు తక్క మిగిలిన వారంతా గిరిజన సంతానమే. వారి తల్లిదండ్రుల జీవనశైలి, వారు జీవిక కోసం అవలంబించే పద్ధతులూ, సంతానాన్ని పెంచటంలో అనుసరించే రీతీ - ఇవన్నీ ప్రత్యేకంగా ఉంటాయి.
కానీ, చంద్రహాసుడు ఆ కోవకు చెందినవాడు కాదు. ఈ వయసులోనే సభ్యత, సంస్కారం వుట్టిపడుతూ ఎంతో పరిణతి చెందిన వాడిలా వ్యవహరిస్తాడు. మాట ఉచ్ఛారణలోనూ, భావాన్ని తెలియజేయటంలోనూ - ఎంతో ఎదిగినట్లుగా కనిపిస్తాడు. ‘పిట్ట కొంచెం! కూత ఘనం’ అన్నట్లుగా వయసుకు మించి, అందరికన్నా మేటిగా నిలబడటానికే ప్రయత్నిస్తాడు. ఆ విధమైన నేర్పు కూడా. అతని సొత్తే. ‘ఎక్కడో తప్పబుట్టాడు’ అనిపిస్తూంటుంది!
అడివప్ప ఈ ఆలోచనల్లో మునిగి పరిసరాల్ని మరిచిపోయాడు.
నైవేద్యము, హారతీ జరుగుతున్నవని తెలుపుతూ వైష్ణవాలయం గుడిగంటలు మోగాయి.
‘పురుషోత్తమాచార్యుల వారి పూజ అయిపోయిందన్న మాట’ అనుకుని, ముందుకు కదిలాడు అడివప్ప. శిష్యులు అనుసరించారు.
5
రాజప్రాసాదానికి ముందు - విశాలమైన ఆవరణ.
పడమర వైపు ఎతె్తైన వేదిక. అది రాచవారి కొరకు అమర్చిన ప్రత్యేక సౌకర్యం. రాచవారి కోసం ఏర్పరచిన వేదిక మీద మండలేశ్వరుడు కుళిందకుడికీ, రాణీ మేధావినీదేవికీ, పురుషోత్తములకూ, మంత్రి చేతనునికీ, సింగన్నకీ ఆసనాలేర్పాటయినై. ఆచార్యుల వారికీ, అడివప్పకి వేదికకి కిందుగా ఏర్పాట్లు చేశారు.
వేదికకు దిగువగా ఇవాళ విలువిద్యా ప్రదర్శనలో పాల్గొనబోయే అభ్యర్థులు కూర్చుని ఉన్నారు. విలువిద్యలో తమతమ నైపుణ్యాల్ని చూపబోయే అభ్యర్థులలో ఆరుగురు యువతులున్నారు. వారిలో పద్మినీ, దుర్గీ ముఖ్యులు. యువకులు కూడా ఆరుగురే ఉన్నారు. వారిలో చంద్రహాసుడూ, అక్షయుడూ - కూడిన కొమ్మల్లా ప్రముఖంగా కనిపిస్తున్నారు.
తూర్పున ఎత్తుగా అమర్చిన లక్ష్యఫలకాల స్తంభాలు ఉన్నాయి. ఆ వైపు మాత్రం ప్రేక్షకులు లేరు.
ఉత్తర, దక్షిణాలలో ప్రదర్శనను చూడాలనే ఉత్సుకతతో వచ్చిన జనసందోహం.
ప్రాంగణమంతా నిశ్శబ్దం అలముకుంది. రాచవారూ ప్రముఖులు విచ్చేశారు. సావధాన ఘంటానాదం మ్రోగింది.
అందరూ విద్యా ప్రదర్శనకు సిద్ధమైనారు. ముందుగా పురుషోత్తముల వారు ప్రదర్శనకు సంబంధించిన కొన్ని నిబంధనల్ని వివరించారు. ఆ తర్వాత ఆయన ప్రధాన శిష్యుడు అభ్యర్థుల్ని ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తూ ప్రదర్శనను ప్రారంభించారు.
ముందుగా నలుగురు గిరిజన యువకులు తమ బాణ విద్యా నైపుణ్యాన్ని చూపారు. ప్రేక్షకులు తమ హర్షధ్వానాలను తెలుపుతూ వారిని ఉత్సాహపరిచారు. ఆ వెంటనే ముగ్గురు బాలికలు విలువిద్యలో తమకు గల ప్రజ్ఞాపాటవాల్ని ప్రదర్శించారు. వారి లక్ష్య భేదనంలో తరతమ భేదాల్ని ప్రకటించారు గురువుగారు.
అప్పుడు దుర్గి వచ్చింది. తనకు గల మూడు బాణాల అవకాశంలోనూ రెండు బాణాల్ని లక్ష్య కేంద్రంలో నిలిచేటట్టు ప్రయోగించింది. అప్పటివరకూ జరిగిన పోటీలలో ఆమె ఫలితమే ఉత్తమమైనది కావటంతో ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రభువు సింగన్న వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు.
పద్మిని లేచి వచ్చింది. ఏకాగ్రతతో ఒకదాని వెంట ఒకటిగా మూడు బాణాలతోనూ లక్ష్యఛేదనం చేసింది. ‘బాగుంది, బాగుంది. బాగా వేసింది’ అంటూ అందరూ మెచ్చుకున్నారు. కుళిందకుడు భార్య వైపు గర్వంగా చూసి మీసం మీద చేయి వేశాడు. ఆమె కళ్లు మురిపెంగా మెరిసాయి.
ఆ తర్వాత - అక్షయుని వంతు. అతనూ పద్మిని సాధించిన విజయానే్న తన ధాటిలో చూపాడు. జనమంతా ‘ఆహా... ఓహో’ అంటూ ప్రశంసించారు. మిగిలిన వారి ప్రదర్శన కూడా పూర్తయింది.
చివరగా చంద్రహాసుడు వచ్చాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. చేతిలోకి తీసుకున్న మూడు బాణాల్నీ వొకటిగా పొదివి నారిలో వుంచి, ఆలీఢముద్రతో, నిశిత దృష్టితో, లక్ష్యస్పృహతో వాటిని సంధించి వదిలాడు. ఒకేసారి ఆ బాణాలు మూడూ విడివిడిగా లక్ష్య కేంద్రంలో - పరిధిని అతిక్రమించకుండా దిగి నిలబడిపోయాయి.
ప్రేక్షక సమూహాలు ఎగిరెగిరి కేరింతలు కొడుతూ ‘జేజేలు’ పలికారు. వేదిక మీది ప్రముఖులూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. ఆనందంతో అడివప్ప కళ్లు చెమర్చాయి. పురుషోత్తములు లేచి నిలబడ్డారు. ఉద్విగ్నంగా నడుస్తూ చంద్రహాసుని దగ్గరగా వచ్చారు. ‘అద్భుతం’ అని అతని భుజం తట్టారు. వినయంగా శిరస్సు వంచి ప్రణామం చేశాడు చంద్రహాసుడు.
గురువుగారు తిరిగి వెళ్లి తన ఆసనం దగ్గర నిలిచి ధీర గంభీర స్వరంతో చెప్పసాగేరు. ‘్ధనుర్విద్యలో నైపుణ్యానికి సాధనే ముఖ్యం. ఏకాగ్రత, చిత్తశుద్ధీ ఆవశ్యకం. వీటితోపాటు ప్రయోగదక్షతని క్రమశిక్షణతోనూ, అనుదిన సాధనతోనూ సముపార్జించుకోవాలి. ఈ ప్రదర్శనలో హెచ్చుతగ్గుల నిర్ణయాన్ని మేము లెక్కించము. శిష్యులందరూ సమశ్రేణిలో విజృంభించటమే మా ఆకాంక్ష. ఎవరికి వారుగా ఇతోధికంగా తమ కృషిని సాగించండి’ ఆచార్యుల వారు కూర్చున్నారు.
అడివప్ప లేచి ‘తక్కువ కాలంలోనే ఈ విధమైన ప్రావీణ్యతను సంపాదించిన అభ్యర్థులందరికీ నా అభినందనలు. మీరు ఇంకా చాకచక్యంతో, శ్రద్ధతో విద్యల నభ్యసించాలనీ, అభ్యసిస్తారనీ ఆశిస్తున్నాను’ అన్నాడు.
ఆవరణంతా వౌనం పాటించింది.
ఆ తర్వాత మంత్రి చేతనుడు లేచి మాట్లాడసాగేడు. ‘ఆచార్యుల సూచనల్ని పాటించండి. వారి సమక్షంలో సాధన చేయండి. మీ కృషి ఇతోధికంగా మాత్రమే కాదు, కళింద్ర మండలానికి హితోధికంగా కూడా సాగాలని ప్రభువుల ఆకాంక్ష’
కుళిందకుడు మంత్రి వైపు మప్పితంగా చూస్తూ ఒక తల వూపుని పంచాడు.
కార్యక్రమం ముగిసింది.
--
మిగతా వచ్చేవారం

-విహారి 98480 25600