సెంటర్ స్పెషల్

రణక్షేత్రం - 26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ఇప్పుడున్న మానసిక స్థితిలో ఆ పాత జ్ఞాపకాలు తిరగదోడే ఓపిక లేదు. అందుకే సమాధానం చెప్పకుండా నవ్వేశాను. ‘ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుందిలే!...’ అంటూ అక్కడ నుండి నిష్క్రమించాను.
అడ్రస్ కాగితం డ్రైవర్‌కి ఇచ్చాను. దాన్ని ఒకసారి చూసిన అతను కారు ఆ అడ్రస్ వైపు పోనిస్తున్నాడు.
నేను ఫోన్ తీసి జానకి నెంబర్ డయల్ చేశాను.
జానకి ఫోన్ ఎత్తింది. ‘ఏమిటీ సర్‌ప్రైజ్! ఈ రోజు నేను నీకు ఎందుకు గుర్తుకు వచ్చానబ్బా?’ ఎగ్జయిట్ అవుతూ అంది.
ఆమె గొంతులో అదే చిలిపితనం. అదే ఉత్సాహం. ఆమె నాకు చెడు చెయ్యగలదన్న తలపు కూడా నమ్మబుద్ధి కానట్లు ఉంది. ‘బోర్‌గా ఉంది జానకీ! అశోక్ కూడా లేడు. కాసేపు మాట్లాడదామని చేశాను...’
‘నిన్నటి వరకు నాతో మాట్లాడటానికి తీరిక లేకుండా ఉండేదానివి. ఇవాళ బోర్ కొట్టేంత తీరిక ఎలా వచ్చిందో?’
‘ఇప్పుడయినా చెయ్యటానికి బోలెడు పని ఉంది. చేసే ఉత్సాహమే లేదు. ఇంతకీ ఎక్కడ ఉన్నావ్?’
‘ఈ సమయంలో ఇంకెక్కడ ఉంటాను? పడుకుని ఉన్నాను’
‘హాస్టల్లో అప్పుడు మనతో ఉన్న వారు ఎవరయినా ఇంకా ఉన్నారా?’ అడిగాను ఆమె హాస్టల్లోనే ఉందని నేననుకుంటున్నానని తెలియజేస్తూ.
‘ఇన్ని రోజులు హాస్టల్లో ఎవరు ఉంటారు?’ ఎటూ తేల్చకుండా అంది.
‘యాదమ్మ ఏమి చేస్తోంది?’
‘ఏమిటి ఈ రోజు నీకు పాత పరిచయస్తులంతా గుర్తుకు వస్తున్నట్లున్నారే?..’ అంది తప్ప తను అక్కడ ఉండటం లేదని మాత్రం చెప్పలేదు.
ఈలోపు కారు వెళ్లి ఒక పోష్ లొకాలిటీలోని అపార్ట్‌మెంట్ల సముదాయం ముందు ఉన్న పార్కింగ్ ప్లేసులో ఆగింది.
అలాగే పిచ్చాపాటీ మాట్లాడుతూ లిఫ్ట్ ఎక్కి జానకి ఉండే ఫ్లోర్ బటన్ నొక్కాను.
లిఫ్ట్ ఆగగానే ఎదురుగా జానకి ఫ్లాటే కనిపించింది.
ఫ్లాట్ ముందు నిలబడి కాలింగ్ బెల్ మోగించాను.
‘ఎవరో వచ్చినట్లున్నారు..’ అపాలజిటిక్‌గా అంది జానకి ఫోన్‌లో.
‘సరే!... వెళ్లి ఎవరో చూడు. నేను మళ్లీ ఫోన్ చేస్తాను’ అంటూ కాల్ కట్ చేశాను.
వెంటనే తలుపులు తెరచుకున్నాయి.
ఎదురుగా నిలబడి ఉన్న నన్ను చూసి మ్రాన్పడిపోయింది జానకి. కానీ, అది క్షణంసేపే! ‘రా!...రా! ఇలా చెప్పా పెట్టకుండా వచ్చి సర్‌ప్రైజ్ ఇవ్వటం ఏమీ పద్ధతిగా లేదు..’ అంటూ లోపలకు దారి తీసింది.
‘ముందుగా చెప్తే ఏమి చేసేదానివి?’
‘కొండంత దేవుడికి కొండంత పత్రి అక్కర్లేదు అంటారు కదా! కనీసం నాకు చేతనయిన మర్యాదలు చేసేదాన్ని’
‘అది సరే! ఈ ఇల్లు ఎప్పుడు కొన్నావ్? మాట మాత్రమైనా చెప్పలేదు?’
‘ఈ మధ్యే!’ నసుగుతున్నట్లు అంది జానకి.
‘ఇల్లు తీసుకున్న సంగతి నాకు చెప్పాలని అనిపించలేదా?’
‘అవన్నీ తరువాత. ముందు ఏమి తీసుకుంటావో చెప్పు. టీ, కాఫీ...’
‘అవేవీ వద్దు. కొన్ని నిజాలు కావాలి...’
జానకికి నెమ్మదిగా అర్థం అవుతోంది. - నాకు తన మీద అనుమానం వచ్చిందని. ఆ అనుమానం వచ్చిన తరువాత అన్నిటికీ తెగించినట్లు నా ఎదురుగా కూర్చుని, ‘ఏ నిజాలు?’ అని అడిగింది.
‘ఆ రోజు గెస్ట్‌హౌస్ దగ్గర ఏమి జరిగింది జానకీ?’
‘నాకేమి తెలుసు?’
‘ఏమీ తెలియకుండానే నన్ను తీసుకువచ్చావా?’
‘నిన్ను నేను తీసుకురావటమేమిటి?’
‘అపస్మారక స్థితిలో ఉన్న నన్ను తీసుకువచ్చింది నువ్వు కాదా?’
‘ఎవరు చెప్పారు?’
‘ఎవరు చెప్తే ఏమిటి? అవునా కాదా?’ గర్జించినట్లు అడిగాను.
జానకి ఏదో సమాధానం చెప్పబోయింది.
‘నన్ను తెచ్చి ఎవరికి అప్పజెప్పావ్? ఆ నెపం అన్యాయంగా చంద్రం, అభిమన్యు, సంతోష్‌ల మీదకి వచ్చేలా చేశావ్. ఇదంతా ఎవరి కోసం చేశావ్?’ ఆలస్యాన్ని భరించలేనట్లు అడుగుతూనే ఉన్నాను.
ఇంతలో బెడ్‌రూమ్ కిటికీ దగ్గర చిన్న కదలిక కనిపించింది. ఇంట్లో నేను కాక ఎవరో ఉన్నారని తెలిసి నా మాటలు మధ్యలో ఆపాను. ‘ఎవరు?’ అన్నట్లు జానకి వైపు చూశాను.
జానకి సమాధానం చెప్పకుండా తల పక్కకి తిప్పుకుంది.
బెడ్‌రూమ్ లోపల ఉన్న వ్యక్తి కర్టెన్ తొలగించుకుని బయటకు వచ్చాడు.
ఆ రోజు ఆఖరి షాక్ తగిలింది నాకు.
బయటకు వచ్చిన వ్యక్తిని చూసి, ‘మీరా..?’ అంటూ లేచి నిలబడ్డాను.
ఒంటినిండా గాయాలతో కూలబడి కొన ప్రాణంతో సహాయం కోసం ఎదురుచూస్తున్న సైనికుడు ఎదురుగా వస్తుంది శత్రు సైనికుడని తెలిస్తే ఎలా స్పందిస్తాడో అలా అయ్యింది నా పరిస్థితి.
అక్కడ నిలబడి ఉంది అశోక్.
ఏ మాత్రం జంకూ బిడియం లేకుండా వచ్చి నా ఎదురుగా జానకి పక్కన కూర్చున్నాడు.
‘అశోక్! మీరు ఇక్కడా?’ నా నోటి నుండి వస్తున్న మాట వింటే చాలు నేను ఎంత గాయపడ్డానో ఎవరూ చెప్పకుండానే అర్థం అవుతుంది.
‘నేనే వసూ!... ఎందుకు పాపం జానకిని ఇబ్బంది పెడుతున్నావ్? నన్ను అడిగితే అన్ని విషయాలూ చెప్తాను కదా...’ జానకి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు అశోక్.
ఎదురుగా జరుగుతున్న సంఘటనలను నా మనసు ఒప్పుకోలేక పోతోంది. అశోక్, జానకి మధ్య సాన్నిహిత్యం చూస్తుంటే అది ఈనాటిది కాదని అనిపిస్తోంది.
‘అయితే ఇన్నాళ్లూ నేను ఊసించుకుంటున్నట్లు నా మీద అత్యాచారం చేసింది...’
‘నువ్వనుకుంటున్న వాళ్లెవరూ కాదు. నేనే!’ నవ్వుతూ అన్నాడు అశోక్.
నేను నమ్మి నా సర్వస్వం ధారపోసిన అశోక్ ఇంత కర్కోటకుడంటే నమ్మలేక పోతున్నాను.
అదే సమయంలో నా మీద నాకు కోపం పెరిగిపోతోంది - అంత తేలిగ్గా అతను ఆడించినట్లు ఆడినందుకు.
అతన్ని చూస్తుంటేనే కంపరంగా ఉంది. ‘కనీసం ఇప్పటికయినా నిజాన్ని ఒప్పుకున్నందుకు థాంక్స్! అయితే.. ఎందుకు అశోక్? ఎందుకు చేశావిలా?’
‘నీ కోసం వసూ’
‘మరి నువ్వెందుకు ఇంత ద్రోహం చేసావు జానకీ...’
‘అశోక్ కోసం’ కాజువల్‌గా చెప్పింది జానకి.
‘్ఛ!్ఛ!..’ అసహ్యంగా అన్నాను.
పాత విషయాలు మననం చేసుకుంటున్నట్లు ఒక రకమయిన తన్మయత్వంతో చెప్తున్నాడు అశోక్. ‘ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. నా బలహీనత అందమైన అమ్మాయిలు. నచ్చిన అమ్మాయిని పొందకుండా ఉండటమన్నది నేను భరించలేను. మొదటి రోజు నిన్ను మాల్‌లో చూసినపుడే నువు నాకు నచ్చావ్. ఎప్పుడయితే నా బహుమతి తీసుకోవటానికి నిరాకరించావో, నువ్వు డబ్బుకు లొంగే రకానివి కావని తెలిసింది. తీసుకున్న బహుమతిని కూడా వాడకపోవటంతో నువు మొండిదానివని కూడా తెలిసింది...’
నాకు అతని మాటలు వింటుంటే భూమిలో కూరుకు పోతున్నట్లు ఉంది.
‘... ఇంతలో నీకు ఏదో సినిమా ఛాన్సు వచ్చిందన్నారు. అది కనుక కన్ఫర్మ్ అయితే ఇక నువు నాకు దొరకవని అర్థం అయింది. జానకి నాకు నీకంటే ముందు నుండి తెలుసు. ఆమె ద్వారా నీ ట్రయల్ షూట్ సంగతి తెలుసుకున్నాను. నిన్ను కిడ్నాప్ చేసి తీసుకురమ్మని జానకికి కొంతమంది మనుషులను ఇచ్చి పంపాను. అంత అవసరం లేకుండా దొరికావు. జానకి నిన్ను జాగ్రత్తగా నా దగ్గరికి తీసుకువచ్చింది’
నేను అసహాయంగా జానకి వైపు చూశాను. అదేమీ పట్టించుకోనట్లు జానకి తల మరోవైపునకు తిప్పుకుంది.
అశోక్ మాత్రం తను చెప్పదలచుకున్నది కొనసాగిస్తున్నాడు. ‘...ఒక రాత్రిలో నీ మీద మోజు తీరిపోతుందనుకున్నాను. కానీ, అది ఇంకా ఎక్కువయింది. తెలివి వచ్చిన నువ్వు నీ మీద అత్యాచారం చేసింది వేరే ఎవరో అనుకోవటంతో నా పని ఇంకా సులువయింది. నీకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ దగ్గరయ్యాను...’
నాకు అతని మీద కోపం రావటానికి బదులు రోత పుడుతోంది. అతను మాత్రం తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. ‘నీ చేతే పెళ్లి అవసరం లేదనిపించాను. నీ అంతట నువ్వే నాకు చేరువ అయ్యేటట్లు చేసుకున్నాను. ఇక నిన్ను వదిలించుకుందామనుకున్నంతలో రాజకీయంగా నీ అవసరం వచ్చింది. ఇప్పుడు ఆ అవసరం కూడా తీరిపోయింది. సరిగ్గా సమయానికి అన్ని విషయాలూ నువ్వే తెలుసుకున్నావు’
నేను చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాను.
‘అలా అని నీకు అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు. ఆ మాటకి వస్తే నేనిప్పటివరకూ నీలాంటి ఎవరికీ అన్యాయం చెయ్యలేదు...’
‘్థంక్స్ అశోక్!... ఇప్పటికయినా నా కళ్లు తెరిపించినందుకు’ అని లేచి నిలబడ్డాను.
‘ఆవేశంలో నిర్ణయం తీసుకోకు వసుంధరా! నేను మీ చంద్రం బృందంలా బలహీనుడిని కాదు. ఆ అమాయకులను ఏడిపించినట్లు నన్ను ఏమీ చెయ్యలేవు’
చంద్రం బృందం మాట ఎత్తటంతో అతనికి నా వాదన వినిపించటానికి ఆగాను. ‘నేను నీకులా ఎవరికీ అన్యాయం చెయ్యలేదు అశోక్. అభిమన్యు, సంతోష్ దోషులు కాబట్టే శిక్ష అనుభవించారు. చట్టం తన పని తాను చేసుకుపోవటానికి సహకరించటం తప్ప నేను చేసిందేమీ లేదు. చంద్రం విషయంలో నేను చేస్తున్నది తప్పు అని తెలిసిన మరుక్షణం నా తప్పు దిద్దుకున్నాను’
‘అయిందేదో అయిపోయింది. ఇకనైనా పగలు, ప్రతీకారాలు అని ఆలోచించకుండా ప్రశాంతంగా గడుపు...’ సలహా ఇచ్చాడు అశోక్.
‘ఏమీ అయిపోలేదు అశోక్. నా పగ, ప్రతీకారం ఇప్పుడే మొదలయ్యాయి. నీ నీడ నుండి నేను బయటపడటమే కాదు నా నియోజకవర్గ ప్రజలను కూడా కాపాడుకోవాలి. ఇప్పుడే పార్టీ ప్రెసిడెంట్ దగ్గర వెళ్తున్నాను. నా నియోజకవర్గం నుండి నేనే పోటీ చేస్తాను..’ అంటూ బయటకు నడిచాను.
అలర్ట్ అయిన అశోక్ మరో కారులో నన్ను అనుసరించాడు.
దారిలో కూడా ఆలోచిస్తూనే ఉన్నాను.
నా జీవితం ఇక్కడే ఆగిపోదు. కాలంతోపాటు ముందుకు సాగుతూనే ఉంటుంది.
అంతవరకు సరే!

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002