సెంటర్ స్పెషల్

మహావిజేత 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరూ కలిసి చంద్రహాసుని దగ్గరకు వెళ్లారు. అక్షయుడూ అక్కడే వున్నాడు.
పద్మిని చెప్పుకొచ్చింది.
నెల రోజుల క్రితం-
నగరంలోని వాణిజ్య భవన సముదాయాలకి ఎదురుగా ఒక వ్యక్తి తనను అనుమానాస్పదంగా చూస్తున్న సంగతి దుర్గి గమనించింది. తర్వాత మరోసారి ఈమె తన మిత్రురాలి జన్మదిన వేడుకలకి వెళ్లి వస్తున్నప్పుడు మళ్లీ... అదే వ్యక్తి తటస్థపడినాడుట.
నిన్న రాత్రి దుర్గి నారాయణాలయంకి వెళ్లిందట. కూడా ఇద్దరు భటులు ఉన్నారు. వారు ముఖ మంటపంలో నిలబడి ఉంటే, దుర్గి ఆలయ ప్రదక్షిణం మొదలుపెట్టింది. ఒక ప్రదక్షిణం పూర్తి అయింది. భక్తులు పలచగా ఉన్నారు. పొద్దుగుంకి ముహూర్త కాలం దాటింది. గర్భాలయం వెనుక అంతగా వెలుగు లేదు. రెండవ ప్రదక్షిణ సమయంలో గర్భగుడి వెనక్కి చేరేసరికి హఠాత్తుగా వెనుక నుంచీ ఈమె చెయ్యి పట్టుకుని పక్కకి లాగాడొక వ్యక్తి. అతనే ఆ వ్యక్తి! ఆమెనిదివరలో గమనిస్తున్న మనిషే! కుప్పకూలినట్లయింది దుర్గికి. భయంతో ‘రక్షించండీ.. రక్షించండీ..’ అని అరిచిందిట. ఒకరిద్దరు భక్తులూ, భటులూ వచ్చేశారు. ఆ వ్యక్తి వారిని చూసి తత్తరపడుతూ దుర్గిని వదిలి మరోవైపు నుంచీ పారిపోయాడు. పట్టుకుందామని పరిగెత్తినా భటులకు చిక్కలేదతను. దుర్గి మానసికంగా దెబ్బ తిన్నది. భయపడుతోంది.
పద్మిని చెప్పినదంతా విని తేలికగా నవ్వేశాడు అక్షయుడు. ‘చాలా గొప్ప ధైర్యవంతురాలివే. ఒక్క దుర్జనుణ్ణి ఎదుర్కోలేక పోయినావే?’ పరిహాసంగా అన్నాడు.
పద్మిని ముఖం ముడుచుకుంది. దుర్గి తల వంచుకుని కించపడింది.
చంద్రహాసుడు దుర్గి కళ్లల్లోకి చూస్తూ అనునయంగా అన్నాడు. ‘్భయపడకు దుర్గీ. ఆ వ్యక్తి ఎవరు? అని అడిగి ప్రయోజనం లేదు. ఎందుకంటే నీకూ తెలీదు కనుక. ఎలా ఉంటాడో చెప్పు. స్వీయ రక్షణ విధానాలలో, యుద్ధ విద్యలో ఆరితేరిన దానివి. అదాటున జరిగే ఇలాంటి సంభవాల వలన, శరీరమూ మెదడూ చేష్టలు దక్కుతాయి. సహజమే. అందువలననే తక్షణమే మనం స్పందించలేము. అసంకల్పంగా దెబ్బతీస్తాము. కానీ, ఇక్కడ నీకు గ్రహింపునకు వచ్చి అరిచేసరికి అతను పారిపోయాడు. అలా జరగటం వలన - నీవేదో నిస్సహాయురాలివయినట్లు, చేతకానిదానివయినట్లుగానూ భావించకు. నిబ్బరంగా ఆలోచించి వివరాలివ్వు. మేము తగిన చర్య తీసుకుంటాం.’
చంద్రహాసుని మాటలకు ఆలోచనలో పడింది దుర్గి. ముందుగా సంకోచించింది. తండ్రికి తెలియజేయకుండా వీరితో చర్చిస్తూ తప్పు చేస్తున్నానా అనేది ఆమె మనసుకు తట్టిన ఆ సంకోచం. క్షణం తర్వాత - వీరికి చెప్పటమే ఉత్తమం. తండ్రికి తెలిస్తే అధికారికంగా భటుల్ని ఆదేశించి, ఆ వ్యక్తిని పట్టుకుని చిత్రహింస చేస్తారు. నగరమంతా తెలుస్తుంది. నరం లేని నాలుకలు నాలుగు రకాలుగా వాగుతాయి. చంద్రహాసుడు తెలివైనవాడు. ఏ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలిసినవాడు. ముందు చూపూ కలిగినవాడు - అని ఒక నిర్ణయానికి వచ్చింది.
ఆ వ్యక్తి ఆకార వికారాల్ని చెప్పింది. అందరూ ఉత్సుకతతో విన్నారు.
‘ఆ వ్యక్తి చూడటానికి చాలా విలక్షణంగా ఉన్నాడు. మొదటిసారి వాణిజ్య సముదాయం ఎదుట చెట్టు మొదట్లో నిలబడి, పొడవుగా పెరిగిన తన చేతిగోళ్లని కొరుక్కుంటూ ననే్న పరీక్షగా చూస్తూ అతను నా దృష్టిలో పడ్డాడు. వయసు సుమారు నీ వయసే ఉంటుందేమో తెలీడంలేదు. వయసుకు మించిన ఆకారం. పైభాగంకన్నా క్రింది భాగం ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. భుజాల మీదే ఆనించినట్లున్న తల’ అని ఇంతా వర్ణించి చెప్పి, కళ్లు మూసుకుని ముఖాన్ని మోకాళ్ల మీదకి వంచుకుని విచారంగా కూర్చుంది దుర్గి. ఆ భంగిమలోనే గద్గదికంగా ‘ఆ వ్యక్తి మరోసారి నిజంగానే నన్ను కబళిస్తే..?’ అన్నది.
దుర్గి భుజాన్ని స్పర్శిస్తూ ధైర్య పరుస్తూ కూచుంది పద్మిని.
ముగ్గుర్నీ పరీక్షగా చూస్తూ అన్నాడు చంద్రహాసుడు. ‘చూడు దుర్గీ. ఆ వ్యక్తి మొదటిసారి నీకు యాదృచ్ఛికంగా తటస్థపడ్డాడు. నీవు వాణిజ్య భవనంలోకి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు అతని వైపు చూడకుండా ఉంటే ఈ కథ అక్కడ అంతమయ్యేది. నీ ఉత్సుకత కొద్దీ - అతని విలక్షణత వలన తిరిగి వస్తూ చూశావు. ఆ చూపు అతనికి ప్రోత్సాహకమైంది. అందుకనే నీ కోసం తిరుగుతున్నాడన్నమాట. రెండవసారి కనిపించేసరికీ అతనికి ధైర్యం కలిగింది. వన చాపల్యంతో తెలిసో తెలీకో వెకిలిచేష్ట చేశాడ. మూడవసారి కనిపించేసరికి ఇంకా తెగింపు వచ్చింది. నేనేమీ నేరాలెన్నటం లేదు. ఒక స్థితినీ, దాని వెనుక సాగిన గతినీ విశే్లషిస్తున్నాను’
ఎదురుగా వున్న ముగ్గురూ ఒకరి ముఖాలొకరు చూసుకుని, మూగబాసలో ప్రశ్నించుకున్నారు.
‘ఇంతెందుకు, ఆ పనికిరాని పిచ్చివాడెవడో వాడిని పట్టుకుని దేహశుద్ధి చేస్తే సరి దారికి వస్తాడు’ కోపంగా అన్నాడు అక్షయుడు.
వారిద్దరినీ పంపి, అక్షయునివైపు తిరిగి ‘చెప్పు; ఏం చేద్దాం?’ అని అడిగాడు.
‘చెప్పా గదా? భటులకి చెప్పి వాడిని రప్పించి శిక్షిస్తే సరిపోతుంది’
‘అలా చేస్తే - వాడి ప్రవర్తనకు శిక్ష అవుతుందేమోగానీ, వాడి రోగానికి కాదు. పైగా పద్మినీ, దుర్గి భయపడుతున్నట్లు నలుగురికీ తెలిసి అల్లరవుతుంది’
‘అయితే - నీ ఆలోచన ఏమిటి?’ ఉత్సుకతతో అడిగాడు అక్షయుడు.
‘చెప్తాను’ అన్నాడే గానీ చాలాసేపు ఏమీ చెప్పలేదు చంద్రహాసుడు.
ఆ తర్వాత వౌనంగా వెళ్లిపోయాడు. వెళ్తున్న అన్నని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు అక్షయుడు.
నాలుగు రోజులు గడిచాయి.
అక్షయుని తీసుకుని నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చాడు చంద్రహాసుడు. అధికారులు ఆ వ్యక్తిని వీరి ముందు నిలబెట్టారు.
వీరిని చూసి, ఆ వ్యక్తి ఒక వెకిలినవ్వు నవ్వి, ‘ఓహోహో.. మీరా’ అని తల రెండువైపులా తిప్పాడు. భటుల చేతుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
చంద్రహాసుడు రెండడుగులు ముందుకు వేసి ఆ వ్యక్తి ఎదుట చాలా దగ్గరగా నిలబడ్డాడు. తన మెడ చేతిలో వున్న విష్ణుశిలని చేతిలోకి తీసుకుని, భక్తిపూర్వకంగా అరమోడ్పు కన్నుల్తో నుదుటికి స్పర్శించుకున్నాడు.
అడుగు కదల్చి, అతని చూపుల్లో చూపు గుచ్చుతూ క్షణకాలం ఆగాడు.
ఇప్పుడా వ్యక్తి దృష్టి చంద్రహాసుని హారంలోని విష్ణుశిలని తాకింది.
చంద్రహాసుని తేరి చూశాడు.
చంద్రహాసుడూ అతన్ని తీక్షణంగా చూస్తూ, ‘నీకు జ్ఞానం ఉంది కానీ వివేకం లేదు. ఇలా ప్రవర్తిస్తుంటే తిన్నగా బతకవు’ అన్నాడు చాలా కటువుగా.
ఆ వ్యక్తి విచలితుడైనాడు. చంద్రహాసుని కళ్లల్లోకి చూడలేకపోయాడు. తలవంచుకున్నాడు. మరుక్షణం, మొహాన్ని చేతుల్లో దాచుకుంటూ ఏడవసాగాడు. ‘అవును. నేను అవివేకిని. నేను అవివేకిని’ అని మోకాళ్ల మీద కిందకి వంగి, చంద్రహాసుని పాదాలు స్పర్శిస్తూ ‘నన్ను క్షమించండి.. నన్ను క్షమించండి’ అని విలపించాడు.
కొద్దిసేపు అక్కడ వౌనం రాజ్యమేలింది. ఆ తర్వాత, నెమ్మదిగా ఆ సంఘటన నుండీ అందరూ తెప్పరిల్లారు.
కొద్దిసేపటి తర్వాత చంద్రహాసుడు ఆ వ్యక్తిని ఒక్కణ్ణీ పక్కనున్న గదిలోనికి తీసుకువెళ్లాడు. ‘ఆ యువతి అంటే నీకు ప్రేమ కలిగిందా?’ అడిగాడు చంద్రహాసుడు. అతను ‘ప్రేమే కాదు ఆరాధన’ అన్నాడు. సన్నగా నవ్వేడు చంద్రహాసుడు. ‘నీకు ఆరాధన ఉండగానే సరిపోతుందా? ఆ యువతి భావనలూ, వ్యక్తిత్వం, ఆశలూ, ఆశయాలూ, తెలుసుకోనవసరం లేదా?’ అని ప్రశ్నించాడు. అతనేమీ మాట్లాడలేదు.
చంద్రహాసునికి అతని గురించి తాను తెలుసుకున్న విషయాలన్నీ స్ఫురణకొచ్చాయి.
అతని పేరు సుబలుడు. తండ్రి పేరు విమలుడు. వంశపారంపర్యంగా వచ్చిన చర్మశుద్ధి వృత్తిలో వున్నాడు. తండ్రి నుంచీ సంక్రమించిన ఆస్తిపాస్తులేవీ లేవుగానీ, చుట్టుపక్కల గ్రామాల్లో చనిపోయిన పశువుల్ని తెచ్చి, వాటి తోలు తీయటం, ఆ కళేబరాన్ని పాతిపెట్టడం, తీసిన తోలుని వివిధ పరిణామాల్లో శుద్ధి చేయటం. సుబలునికి బాల్యంలో ఈ పని వెగటనిపించేది. తోటి పిల్లలూ, ముఖ్యంగా ఆడపిల్లలే - మరీ ఎగతాళి చేసేవారు. ఆట పట్టించేవారు. కొందరు పెద్దవాళ్లూ ఈసడించుకునేవారు.
సుబలుని తల్లి అతని బాల్యంలోనే మరణించింది. ఆలనా పాలనా చూసేవారు లేక గాలికి పెరిగినట్లుగా పెరిగాడు. దీనికి కారణం అతని తండ్రి ప్రవర్తన. ఎదిగిన కొడుకు ఇంట్లోనే ఉన్నాడనే జ్ఞానం లేకుండా, బయటి స్ర్తిలను తీసుకువచ్చి రతికేళి సాగించేవాడు. వారుండే ఇల్లు చిన్నకొట్టం. అతి సన్నిహితంగా ఆడవారిని అర్ధనగ్నంగానూ, నగ్నంగానూ చూసి - అతనిలో మనోవికారాలు ఎక్కువైనై.
నగరం వచ్చేశాడు. తగిన తిండి లేదు. చేయడానికి పనీ దొరకలేదు. ఆడపిల్లల్ని చూస్తే అవాంఛనీయ చిత్తవృత్తి ప్రకోపించసాగింది. అలాంటి సందర్భమే - దుర్గి సంఘటన.
సామాజికాంశాలు వ్యక్తి చిత్తవృత్తినీ, ప్రవృత్తినీ, ప్రవర్తననీ ఎంత దారుణ స్థితికి దించుతాయో కదా అనిపించింది చంద్రహాసునికి.
అతన్ని అధికారుల పర్యవేక్షణలో ఉంచి వచ్చేశారు చంద్రహాస, అక్షయులు.
వారం తర్వాత - సుబలుని కలుసుకున్నారు.
అతనిలో కనిపించిన మార్పు - వారికి చాలా ఆనందాన్ని కలుగజేసింది. వీరిని చూసిన తర్వాత - అతని ప్రవర్తన -‘తప్పక ఇతను మళ్లీ మామూలు మనిషి అవగలడు’ అని రూఢి చేసింది. అతని మాటల్లోనూ, చేతల్లోనే కాదు- ఆహార్యంలో కూడా ఆ తేడా ప్రత్యేకంగా తెలియవచ్చింది.
మరో నెల రోజులు గడిచాయి. సుబలుని మీద గురి కుదిరింది. అతన్ని ఆ నగరపాలక సంస్థలోనే ఉద్యోగిగా నియమించాడు - అక్షయుడు!

(మిగతా వచ్చే సంచికలో)

-విహారి 98480 25600