సెంటర్ స్పెషల్

మహావిజేత.. 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రహాసుడు లేఖను స్వీకరించి బయలుదేరాడు.
చంద్రహాసుడు - ఆకాశవాయు తత్త్వ సమ్మిళిత స్వభావం కలవాడు. శక్తి సామర్థ్యాలూ, చింతనా, శాంతం వంటి గుణ విశేషాలు - ఆ స్వభావం కలవారి అంతస్సత్యాలు! అవే వారి పురోగమనానికి చోదకశక్తి!
చంద్రహాసుని జననాశ్వం కుంతలపురి వైపు ఉత్సాహంగా పరుగులు తీస్తోంది!
58
ఆశ్వయుజ బహుళ తదియ!
అట్లతదియ! కనె్నల నోము. గౌరీవ్రతం చేస్తారు. ఉదయానే్న పూజ చేసుకుని, ముత్తయిదువలకు ఆరగింపు చేసి, ఉయ్యాలలూగి ఉల్లాసంగా గడుపుతారు. పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం చంద్రుడిని చూసి, తిరిగి పూజ చేసుకుని అట్లు వాయనమిస్తారు. చంపకమాలినీ, విషయా, విరజా అందరూ ఆ పర్వదినం సంబరంలో ఉన్నారు.
అందరూ హాస పరిహాసాలతో, ఆటపాటలతో అలసిపోయి, కనిచీకటి పడుతుండగా తోట నుండీ నగరోన్ముఖులైనారు. అందరికన్నా వెనుకగా వస్తున్నది విషయ.
తామరకొలనుకు ఉత్తరాన ఉన్న ఊడలమర్రి కింద పచ్చికను మేస్తున్న అశ్వం మీదికి ఆమె దృష్టి మరలింది. అక్కడికి నడిచింది.
ఆ పక్కగా ఒక వితర్ది మీద నిద్రలో వున్నాడొక యువకుడు. దగ్గరగా నడిచింది. చూసింది. తేజస్వి! ‘మనోహరుడు’ అనుకున్నది. వెంటనే స్ఫురించింది. ఆనాడు అష్టలో కోట వెనుకనున్న సరస్సు గట్టున చూచిన నాల్గవ ఆశ్విక వీరుడు ఇతడే!
ఆమె చూపు అతని దట్టీ నుండీ పైకి జొనిపి వున్న పత్రిక మీద పడింది. దగ్గరించి, నెమ్మదిగా దాని నందుకున్నది. తీసి చదివింది. గుండె గుభిల్లుమన్నది.
‘ఈతడు చంద్రహాసుడు. మనకహితుడు. నేను లేనని సంకోచించక, మీనమేషాలు లెక్కింపక, వెనువెంటనే వీనికి విషమునిచ్చి వేడ్కజేయుము’
ఇతడే చంద్రహాసుడు! మదునునకు తన తండ్రి రాసిన పత్రికలోని వార్త?
హృదయం వ్యాకులమైంది. ఎంతటి దుస్సాహసం తండ్రిది? ఎంతటి కర్కశ హృదయం? తండ్రి పట్ల అసహ్యం కలిగింది. పైగా, ఇతని రూపగుణ విశేషాలు వినే తాను ఈతనిపై మరులుగొన్నది. ఈతనిపై వలపు కోరికతోనే కదా తాను మధురోహలతో పులకించింది. అదృష్టవశాత్తూ ఇతడు తన కంట పడ్డాడు.
తండ్రికి తగిన గుణపాఠంగా, నా కోరికా తీరే విధంగా చేస్తానని తనకు తానే చెప్పుకుంది. కొనగోట కాటుకరేఖ తీసి, పత్రికలోని ‘మనకహితుడు’ మాటని ‘మనకు హితుడు’ అనీ, ‘విషము నిచ్చి’ మాటని ‘విషయనిచ్చి’ అని మార్చింది. లేఖని చుట్టి ముడివేసి, తిరిగి చంద్రహాసుని దట్టీలో అమర్చింది.
‘స్వార్థం - పరమార్థం - నా చర్యకు ఫలసిద్ధిగా చరిత్రలో నిలిచిపోనీ’ అనుకుంది. లేత నవ్వుతో, సంతృప్తి నిండిన మనసుతో, ఆ స్థలాన్ని వీడి వెళ్లిపోయింది!
59
అశ్వారూఢుడై కుంతలపురిని ప్రవేశించాడు చంద్రహాసుడు.
రక్షక భటుల్ని విచారించి దుష్టబుద్ధి భవనాన్ని చేరాడు.
మదనుడే ఎదురు వచ్చి స్వాగతించి, లోనికి తీసుకువెళ్లాడు. చంద్రహాసుని చూసి ఆశ్చర్యపోయాడు మదనుడు. ‘గతంలో నేను ఇతన్ని గురించి విని, ఊహించుకున్న దానికన్నా ఎంతో సందీప్తంగా ఉన్నాడు. ధీర గంభీరమూర్తి’ అనిపించింది.
పరిచయాలూ, పరామర్శలూ, పానీయసేవనం అయినది. తాను రాజాజ్ఞ ననుసరించి వచ్చినట్లు చెప్పాడు చంద్రహాసుడు. తండ్రి ఇచ్చిన పత్రికని మదనునికి అందజేశాడు.
‘ముందు మహారాజ దర్శనానికి వెళ్దాం రండి’ అని కదిలాడు మదనుడు. పత్రికను పక్కనపెట్టి చంద్రహాసుడు అనుసరించాడు.
వీరు వెళ్లేసరికీ అగ్నివర్మ గాలవులతో చంపకమాలినితో రాచ వ్యవహారాలేవో మాట్లాడుతున్నాడు. వీరిని రమ్మన్నారు.
చంద్రహాసుడు మహారాజాదులకు వినమ్రంగా కైమోడ్పు ఘటించాడు.
మహారాజు ఆసనం మీద సుఖస్థితిలో సర్దుకున్నాడు. నిశితంగా చంద్రహాసుని వైపు చూపు బరపాడు. ‘ఆజానుబాహువు, సర్వలక్షణ లక్షితమైన క్షాత్ర తేజస్వి!’ అనుకున్నాడు.
గాలవులు పీఠంలో ఒకింత ఒరిగి పరికించారు. ‘్భక్తిశ్రద్ధల చిత్తశుద్ధీ, లక్ష్యశుద్ధీ - కలగలసిన ‘చెట్టంత మనిషి!’ అనిపించింది.
చంపకమాలిని ఆపాదమస్తం చూసింది. ‘ఊహల కందనంతటి సముజ్జ్వల కాంతిమూర్తి! శౌర్యాదీధితి వెదజల్లుతున్న ఊర్జస్వి! నా పాలిదైవమా ఇతడు!’ అనిపించింది. అధరంపై చిరునవ్వు విరిసింది.
మహారాజు కూర్చుండమని సైగ చేశారు. కూర్చున్నాడు - చంద్రహాసుడు. మదనుడూ పక్కనున్న పీఠంపై కూర్చున్నాడు.
అదే సమయంలో ప్రసేనుడు రాజసముఖాన్ని వాంఛిస్తున్నట్టు ప్రతీహారి వచ్చి చెప్పాడు. రమ్మన్నాడు అగ్నివర్మ. ఆయనా వచ్చి కూర్చున్నాడు.
చంద్రహాసుని పరిచయమైంది. వెంటనే ప్రసేనుని ముఖం వివర్ణమైంది. స్వేదం కమ్మింది. ‘ఏమి ఈ రాశీభూత విక్రమమూర్తి! అమాత్యుల భయంలో ఎంత ఔచిత్యం వున్నది’ అనిపించింది. చంద్రహాస స్ఫూర్తి అతని మనసుకి భయదమైంది.
‘సమయానికి వచ్చారు సైన్యాధిపతులు’ అని వెంటనే విజయపురి సామ్రాజ్యాధిపతుల మిడిసిపాటు గురించీ, ఎడనెడ జరుగుతున్న, సరిహద్దు అతిక్రమణల గురించీ వివరించారు గాలవులు. ‘కళింద్ర వారి సాహసవీరులు ఈ పరిస్థితుల్లో సర్వసన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అన్నారు చంద్రహాసుని చూస్తూ.
‘చిత్తం. కుంతల మహా సామ్రాజ్య రక్షణా, శ్రేయస్సూ - మా వంటి వారికి ఎప్పుడూ ప్రథమ కర్తవ్యమే’ అన్నాడు చంద్రహాసుడు.
కరదలో, అష్టలో ఘటనల ప్రస్తావన వచ్చింది.
‘చివరికి అంతా సవ్యంగా, ఆహ్లాదకరంగా ముగిసింది కదా!’ అన్నది రాకుమారి. ‘అవును. అదే సంతోషం’ అన్నాడు అగ్నివర్మ.
కొంతసేపు ఇతర సామాజికాంశాల్ని మాట్లాడుకున్నారు.
మదనుడూ, చంద్రహాసుడూ సెలవు తీసుకుని వెళ్లిపోయారు.
60
చంద్రహాసునితో తమ భవనానికి తిరిగి వచ్చాడు మదనుడు. విషయని పిలిచి చంద్రహాసుని పరిచయం చేశాడు. ‘నాన్నగారు పత్రిక పంపారు’ అంటూ పీఠం మీది లేఖని తీసుకుని విప్పి చదివాడు. అతని కళ్లు ఆనందంతో మెరిశాయి.
లేఖని విషయకు అందించాడు. తనకు తెలిసిన లేఖనే మళ్లీ చదువుకుంది. గంభీరంగా వినతాంగి అయింది.
ఆమె చేతి నుండీ లేఖను తీసుకుని చంద్రహాసుని కిచ్చాడు మదనుడు. అతడూ చదివాడు. సంభ్రమాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయి. ‘ఏమిటీ శిలలో సెలయేరు! అమాత్యుల గురించి - తానూ, కళింద్ర పెద్దలూ తలచినది - ఎంత తప్పుగా ఉంది’ ఏమి ఈ అయాచిత మహద్భాగ్యం!’
‘ఈరోజు శుభదినం. మా నాన్నగారి నిండు మనస్సు తేటతెల్లమయింది. ఆయన మనస్సు నవ్యనవనీత సమానం. వాత్సల్యపూరితం, నేనూ, విషయా ఎంతో భాగ్యశీలురం’
‘సరిసరి... నా నెత్తిన పెద్ద బరువే ఇది. వెంటనే కార్యరంగంలోకి దూకాలి’ అని నవ్వుతూ లేచాడు. పురోహితులను రావించాడు. ఆపైని వ్యవహారాలన్నీ వెంటవెంటనే జరిగాయి.
మర్నాడు ఉషఃకాలంలోనే ముహూర్తం.
విషయా, చంద్రహాసులు దంపతులైనారు!
అశరీర ధ్వని ఏదో వెన్నున చరచినట్లుయిందామెకు. తత్తరపడి భర్త కరగ్రహణాన్ని మరింత బిగువు చేసి అతని వైపు చూసింది.
చంద్రహాసుడు తన కంఠహారంలోని విష్ణుశిలపై దృష్టి సారించి మనోధ్యానంలో నిలిచాడు!
61
చంద్రహాసుని ద్వారా మదనునికి లేఖ ఇచ్చి పంపాడే కానీ, దుష్టబుద్ధి మనసు మనసులో లేదు. అతనికి లేఖ ఇచ్చి పంపిన సంగతి - మూడో వ్యక్తికి తెలియదు.
రెండు రోజులు ఎలాగో గడిచాయి.
‘ముఖ్యమైన రాచకార్యం వున్న’దని చెప్పి కళింద్ర నుండీ బయలుదేరి వచ్చేశాడు.
కుంతల చేరి భవనానికి చేరేసరికీ అర్థంకాని పరిస్థితి ఎదురైంది.
భవనమంతా అలంకరింపబడి ఉంది. గృహంలో పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఆందోళనతో లోపలికి వెళ్లాడు. ఎదురుగా ‘సర్వమంగళ మాంగళ్య’గా కుమార్తె - విషయ! పక్కన కొత్త పెండ్లికొడుకు చంద్రహాసుడు!
ఆవేశాన్ని ఆపుకోలేక పోయాడు. మదనుని పిలిచి విషయమడిగాడు. మీ ఆజ్ఞని శిరసావహించానని చెబుతూ వినయంగా లేఖని చూపాడు. లేఖలో మాటల మార్పుని చూసి గుటకపడలేదు దుష్టబుద్ధికి. చంద్రహాసుడు తడిగుడ్డతో గొంతుకోశాడని మూగఘోష పెట్టాడు. అతనిప్పుడు తన అల్లుడు! లౌక్యం, వివేకం, నిగ్రహం నేర్పేయి. బయటపడదల్చుకోలేదు. కపటాన్నీ, కల్మషాన్నీ లోలోపలే దాచుకున్నాడు. క్రోధం పొంగింది. తన వారితో చాలా మామూలుగా ప్రవర్తించాడు.
ఏకాంతంలో వెళ్లి మనసుని మధించుకున్నాడు. రాజ్యకాంక్ష ఉచ్ఛనీచాల్ని మరపింపజేసింది. ‘తన-మన’ విచక్షణని నాశనం చేసింది. ‘అల్లుడైనా సరే! చంద్రహాసుని మననీయరాదు అని నిహతుడు కావలసిందే!’ అని నిర్ణయించుకున్నాడు.
విశ్వాసపాత్రుడైన వార్తాహరునిచే నలుగురు కటికహింస్రకులను రావించాడు.
‘రేపు అసుర సంధ్యాసమయంలో కాళికాలయానికి వొంటిగా వచ్చిన వానిని పట్టి కండతుండాలుగా నఱకండ’ని ఆజ్ఞాపించాడు. పని పూర్తయిన పిదప రాజ్యభాగమే ఇప్పిస్తానని ఆశ చూపించాడు. అప్పటికప్పుడు కొంత ద్రవ్యాన్ని వారి చేతుల్లో పోశాడు.
అలాగేనని సంబరంగా వెళ్లారు వాళ్లు.
62
చంపకమాలిని తన మందిరంలో నిద్రరాక పానుపుపై ఉసురుసురంటోంది - కళ్లు మూసినా, తెరచినా చంద్రహాసుని మూర్తే ఎదుట నిలుస్తోంది. అతడిని చూడకముందు కలిగిన ఊహలు, దర్శించిన తరువాత ప్రతీక్షగా మారాయి. అతని ఆగమనం కొత్త వేదనకి సోపానాల్ని కూరుస్తున్నది. తేజోవంతమైన అతని రూపానికి ప్రణమిల్లుతోంది హృదయం!
హజారంలో రాత్రి - రెండవజాము గంట కొట్టారు!

-విహారి 98480 25600