సెంటర్ స్పెషల్

ధర్మబుద్ధి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పరదేశి మారువేషంలో ధర్మపురి గ్రామంలో సంచరిస్తున్నాడు. తమ దేశంలో లేని వింతలు విశేషాలు గమనిస్తున్నాడు.
అతనిని ఒక పొలం దగ్గర ఒక పెద్ద గుంపు ఆకర్షించింది. ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటే కొంతమంది చోద్యం చూస్తున్నారు. చొరవ తీసుకుని పరదేశి తన గుర్రాన్ని వాళ్ల దగ్గరకు పోనిచ్చాడు.
‘ఏం జరుగుతున్నది ఇక్కడ? ఎందుకు వాదులాడుకుంటున్నారు?’ అంటూ ఆ ఇరువురిని ప్రశ్నించాడు.
‘అయ్యా! తమరు గొప్ప నీతిజ్ఞులు లాగున్నారు. సమస్త న్యాయశాస్త్రాలు చదివినట్లున్నారు. తమరే మాకు న్యాయం చెప్పండి’ అంటూ ఒక తలపాగా ధరించిన వ్యక్తి ముందుకు వచ్చాడు.
వెంటనే ఇంకో తలపాగా ధరించిన వ్యక్తి కూడా చెప్పడం ప్రారంభించాడు.
‘ఆర్యా! నా పేరు సోముడు. ఇతని పేరు శివుడు. ఈ శివుని వద్ద నుండి ఐదు సంవత్సరాల క్రిందట నేను ఈ పొలాన్ని కొనుక్కున్నాను. కానీ ఈ రోజు వ్యవసాయం చేస్తూ ఉంటే పొలంలో నుంచి వైజ్ర వైఢూర్యాలు, బంగారు నగలు కలిగిన రెండు లంకె బిందెలు బయటపడ్డాయి. వెంటనే నేను శివుడ్ని పిలిపించి ఈ లంకె బిందెలు పుచ్చుకోమన్నాను. కాని ఇతగాడు తిరస్కరిస్తున్నాడు’ చెప్పాడు సోముడు.
పరదేశికి శివుడు పిచ్చివాడిలా కనిపించాడు. సోముడు తన తెలివితక్కువతనం కొద్దీ గొప్ప సంపదను ఉచితంగా తీసుకోమంటున్నాడు. అయితే ఇతను బెట్టు చేస్తున్నాడు. వెంటనే కల్పించుకుని అడిగాడు పరదేశి.
‘శివా! సోముడు చెప్పింది నిజమేనా? నీవు అమ్మిన పొలంలో లంకెబిందెలు బయటపడ్డాయిట కదా! అయినా సోముడు వాటిని నీకు ఇద్దామనుకున్నాడు గదా?! తీసుకోవడానికి నీకేం అభ్యంతరం? సిరిరా మోకాలు అడ్డకూడదని తెలియదా!’
‘ఆర్యా! తమరు నన్ను పరీక్షిస్తున్నారు! అన్ని ధర్మశాస్త్రాలు తమరికి తెలుసు. ఆ లంకెబిందెలపైన నాకు ఏమి హక్కు ఉందని తీసుకోవాలి? నేను ఆ పొలాన్ని ఇతనికి ఎప్పుడో అమ్మివేశాను కాబట్టి దానిలో లభించే సంపదతో నాకు సంబంధం లేదు’ శివుడు చెప్పాడు.
‘మళ్లీ అదే మాట మాట్లాడతావు. నువ్వు నాకు అమ్మింది పొలాన్ని మాత్రమే! పొలంలోపలి నిధి నిక్షేపాలను అమ్మలేదు’ సోముడు కోప్పడ్డాడు. ‘దాని లోపలి వస్తువులు నీకే చెందుతాయి’
తిరిగి ఇద్దరూ ఆ సొమ్ము నీదంటే నీదని వాదులాడుకో ప్రారంభించారు. పరదేశికి తల తిరిగిపోయింది. ఇద్దరూ ఒకళ్లని మించి ఒకళ్లు పిచ్చోళ్లలా కనిపించారు. చివరికి ఆ గొడవ ఆ ఊరి న్యాయాధికారి దగ్గరికి చేరింది. ఆయన ఈ విధంగా పరిష్కరించాడు.
‘సోమన్నా! నీకు కొడుకు ఉన్నాడు కదా! శివా నీకు కూతురు ఉంది గదా! అయితే శివుడు తన కూతుర్ని సోముడు కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలి! ఈ లంకెబిందెలు కట్నం కింద శివుడు సోముడుకి చెల్లించాలి’ వాళ్ల తగవు తీరుస్తూ న్యాయాధికారి నిర్ణయించాడు.
ఈ తీర్పుతో ఇరువురు చాలా సంతోషపడ్డారు.
ఇదంతా చూసిన పరదేశికి చాలా సిగ్గు కలిగింది. ధర్మపురి గ్రామ ప్రజల ధార్మికతకు అబ్బురం కలిగింది. పరుల సొమ్మును వారు పాములా భావించి భయపడటం అచ్చెరువు కలిగించింది. వారి ముందు తన నైతిక విలువలు సున్నా అన్న జ్ఞానోదయం అయింది.
ఎందుకంటే ఆ పరదేశి మరెవరో కాదు, మారువేషంలో సంచరించిన ప్రపంచ విజేత అలెగ్జాండర్ ప్రభువు. భారతదేశపు ఔన్నత్యానికి, తాన దోచుకోవడానికి వచ్చినా, తల వంచి నమస్కరించాడు అలెగ్జాండర్ ది గ్రేట్.

-వియోగి