సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు ( కొత్త సీరియల్ ప్రారంభం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

........................
సాహితీ వ్యాసంగంలో నిరంతరం నిమగ్నం అవడం, పాఠకు లను ఆనందింప చేసే రచనలకు ప్రాణం పోయడం అంటే ఎంతో ఇష్టమంటున్న రచయిత గంధం నాగేశ్వరరావు కలం పేరు మంజరి. ఉండేది విద్యలనగరం విజయనగరం. కథ, నవల, వ్యాసరచన ఇలా ఎన్నో ప్రక్రియల్లో తనదైన ముద్రవేసిన మంజరి రచనల్లో ఇప్పటివరకు 18 నవలలు, 100 కథలు, పదుల సంఖ్యలో వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వాటిలో పది కథలు బహుమతులు గెల్చుకున్నాయి. ‘టార్గెట్ నెంబర్ టూ’ అనే నవల కన్నడ మాస పత్రిక ‘ఉత్తాన’లోను, సంస్కృత మాసపత్రిక ‘సంభాషణ సందేశ్’ లోనూ సీరియల్‌గా ప్రచురితమైంది. ఇక అక్షరాంజలి శీర్షికలో కొన్ని పుస్తకాలపై వ్యాసాలు వెలువరించారు.
..........................

అది పెందుర్తి.
విశాఖపట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో చాలాకాలం మేజర్ పంచాయతీగా ఉన్న ప్రాంతమది. ఈ మధ్యనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో కలిసింది. చుట్టూ కొండలతోనూ, పచ్చని చెట్లతో నిండి కాలుష్య రహితంగా ఉంటుంది.

నగరంలోని ఉద్యోగులు, వ్యాపారులు చాలామంది చౌకగా ఇంటి స్థలాలు లభించడంతో అక్కడ ఇళ్లు కట్టుకున్నారు. అయితే కొండలతో నిండి ఎల్లప్పుడూ జనసంచారం లేకుండా ఉండే ఆ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువ. దానికితోడు ఊహించినంత అభివృద్ధి జరగకపోవడంతో అక్కడ నివసించే ధైర్యం లేక ఎక్కువమంది ఇళ్లు అద్దెకిస్తే, కొంతమంది ఖాళీగా వదిలేశారు.
అలా వదిలేసినట్టు ఓ కొండకి దగ్గరలో ఉందా డాబా. దాని చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచాయి. రంగు వెలిసిపోయి, గోడలు పెచ్చులూడిపోయి దెయ్యాల కొంపలా కనిపిస్తోంది. అందులో మానవమాత్రుడెవరూ ఉండే అవకాశం లేదనుకుంటారు చూసిన వాళ్లు. కాని కాంపౌండ్ వాల్‌కి అమర్చిన చిన్న గేటు లోపలి పక్క తప్ప డాబా ప్రధాన ద్వారానికి తాళం కప్ప లేదు.
లోపల ఓ గదిలో కుక్కిమంచం మీద ఒక ప్రాణి కూర్చుని ఉంది. ఆమె దీనస్థితిని సూచిస్తూ తైల సంస్కారం లేని జుట్టు సగం పండిపోయి ఎండుగడ్డిలా కనిపిస్తోంది. పోషణ లేకపోవడంతో కండరాలు కరిగిపోయి పూచికపుల్లల్లా ఉన్నాయి చేతులు.
ఆమెకి కాఫీ తాగాలని ఉంది.
లేచి వంటగదిలోకి వెళ్లాలనుకుంది. కాని శరీరంలో రవ్వంత ఓపిక కూడా లేదు. పాలు లేకపోయినా కాసింత డికాక్షన్ తాగితే కొంచెం ఉత్సాహం వస్తుందని తెలుసు. అందుకే రెండు మూడుసార్లు లేవడానికి ప్రయత్నించినా అవయవాలు సహకరించలేదు. నిన్న ఉదయం కాఫీ డికాక్షన్ తాగి ఓట్స్ చేసుకుంది.
ఈ రోజు మాత్రం అవేమీ చెయ్యలేకపోతోంది.
తను చివరి మజిలీ చేరుకున్నానని ఆమెకి అర్థమైంది. చిన్నగా నవ్వుకుంది తప్ప చింతించలేదు. ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేనప్పుడు బతికున్నా చచ్చినా ఒక్కటే. ఈ మాట ఎన్నిసార్లో అనుకున్నదే అయినా ఈ రోజు కొత్త భావం స్ఫురిస్తోంది. తల్లిదండ్రులు కులదేవత పేరు పెట్టి ప్రేమగా పెంచారు. ప్రేమించిన వాడు అపురూపంగా చూసుకున్నాడు. అన్నీ పోయాయి. ఏదీ శాశ్వతం కాదు.
పోనీ పోనీ.. పోతే పోనీ.. సతుల్, సుతుల్, పతుల్.. ఆమె పెదాలు సన్నగా గొణుగుతున్నాయి.
ఓ అధికారిని తను ముప్పుతిప్పలు పెట్టబోతున్నట్టు ఆమెకి తెలియదు.
* * *
లోపలికి వచ్చిన వ్యక్తితో చెప్పాడు యుగంధర్.
‘కూర్చోండి’
‘నా పేరు వరహాలశెట్టి సార్! కంప్లైంట్ ఇవ్వడానికొచ్చాను’ చెప్పాడు ఏభై ఏళ్ల ఆ వ్యక్తి ఎదురుగా కూర్చుని. మనిషి సున్నిత మనస్కుడని, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునే వాడు కాదని చూడగానే అర్థమవుతోంది. అంతేకాదు, పోలీసుస్టేషన్‌కి మొదటిసారి వచ్చాడని కూడా బాడీలాంగ్వేజ్‌ని బట్టి తెలిసిపోతోంది.
‘చెప్పండి...’ వినడానికి సిద్ధంగా ఉన్నట్టు కాస్త ముందుకు వంగి అన్నాడు పాతికేళ్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్.
‘మా అమ్మాయి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. పరీక్షలు దగ్గర పడ్డాయి. శ్రద్ధగా చదివే మా అమ్మాయి ఈ మధ్య పుస్తకం ముట్టుకోవడం లేదు. సరికదా దిగులుగా ఉంటోంది. నిన్న రాత్రి వాళ్లమ్మ గట్టిగా నిలదీస్తే ఓ కుర్రాడు వెంటపడి వేధిస్తున్నాడని, అసభ్యకరమైన ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నాడని చెప్పి ఏడ్చిందట’
యుగంధర్ ముఖంలోకి చిన్నపాటి కోపం ప్రవేశించింది. రాష్ట్రంలో ఎన్ని సంఘటనలు జరుగుతున్నా యువతకి బుద్ధి రావడం లేదు. ఇలాంటి సున్నితమైన కేసులు పెద్ద సవాలుగా మారాయి పోలీసులకి. ప్రేమించుకున్నామని పెళ్లి చెయ్యమని ఓ జంట స్టేషన్‌కి వస్తుంది. అంతేకాకుండా తమకు రక్షణ కల్పించమంటుంది. దీనికి మీడియా ఇచ్చే ప్రచారం అంతా ఇంతా కాదు.
గట్టిగా మందలిస్తే కుర్రాడు ఏమైనా చేసుకోవచ్చు. అలా అని ఊరుకుంటే అమ్మాయికి ఎదురైన సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి పరిస్థితిలోనే శ్రీలక్ష్మి హత్య క్లాస్‌రూమ్‌లో జరిగింది. నిజానికి ఇలాంటి కేసుల్లో పోలీసుల పాత్ర చాలా చిన్నది. మొత్తం విధులు గాలికొదిలేసి శ్రీలక్ష్మి చుట్టూ కాపలా కాయడం ఎవరికీ సాధ్యంకాదు. ఇవేమీ ఆలోచించకుండా పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నారు.
‘సార్! దీన్ని సీరియస్‌గా తీసుకుని మా అమ్మాయిని రక్షించాలి...’ ప్రాధేయపూర్వకంగా అన్నాడు వరహాలశెట్టి.
ఆలోచనల నుండి బయటపడ్డాడు యుగంధర్.
‘మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఆ కుర్రాడి పేరు, చిరునామా కావాలి. లేదంటే కంప్లైంట్‌కి మీ అమ్మాయి ఫొటో జతపర్చి కాలేజీ వివరాలు రాయండి. మీ సెల్ నెంబర్ అందులో ఉండాలి...’ చెప్పాడు.
‘అమ్మాయి ఫొటో ఎందుకండి?’ సందేహం వ్యక్తం చేశాడతను.
‘అబ్బాయి ఫొటో, చిరునామా మీ దగ్గర ఉండవు కాబట్టి’
మారుమాట్లాడకుండా యుగంధర్‌కి నమస్కారం చేసి రైటర్ రూము వైపు కదిలాడు, కంప్లైంట్ రాసివ్వడానికి.
* * *
పోతిన మల్లయ్యపాలం చివరి స్టాప్‌లో ఆగింది సిటీ బస్సు. కొద్దిమంది ప్రయాణీకులు దిగిపోయి తమ ఇళ్ల వైపు సాగిపోయారు. ఆ స్టాప్‌కి బక్కన్నపాలెం గ్రామం ఓ అర కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఆ గ్రామానికి ఒకే ఒక్క బస్సు తిరుగుతుంది. ఆ బస్సు దొరకని వాళ్లు పోతిన మల్లయ్యపాలెం చివరి స్టాప్‌లో దిగి నడచి వెళతారు.
రాత్రి ఏడు దాటి చీకట్లు మరింతగా ముసురుకోవడం గమనించి గబగబా ఆ దారిలో అడుగులు వెయ్యసాగిందో అమ్మాయి. తన వెనుక కాస్త దూరంలో ఇద్దరు ఆడవాళ్లు రావడం గమనించకుండా అదురుతున్న గుండెల్ని చిక్కబట్టుకుని చురుగ్గా అడుగులు వేస్తోంది.
హఠాత్తుగా చెట్టుచాటు నుంచి బయటకొచ్చాడో యువకుడు. ఆ అమ్మాయి పక్కన నడుస్తూ అడిగేడు.
‘నా మెసేజ్‌కి జవాబివ్వలేదేం?’
ఆ అమ్మాయి సమాధానం ఇవ్వకుండా నడక వేగం పెంచింది.
‘నా వెంట చాలామంది అమ్మాయిలు పడుతున్నారు. కాని నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్టు లేదు’
ఆమె మరింత చురుగ్గా అడుగులు వేస్తూ భయాన్ని దాచుకోవడానికన్నట్టు పుస్తకాల్ని గుండెలకి గట్టిగా అదుముకుంది.
‘ఏమిటి నీ ధీమా? అడుగుతుంటే సమాధానం చెప్పవు?’ విసురుగా అంటూ ఆమెని పట్టుకోవడానికి చెయ్యి సాచేడు.
సరిగ్గా అప్పుడు పడింది మెడ మీద బలమైన దెబ్బ. అతను తేరుకుని ఇద్దరు ఆడవాళ్లు తనని పట్టుకున్నట్టు గుర్తించి అరిచేడు.
‘ఎవరు మీరు?’
‘కంగారుపడకు. తెలుస్తుంది...’ తాపీగా చెప్పి సెల్ బయటకు తీసింది ఒకామె.
తెల్లబోయి నిలబడిన అమ్మాయికి సైగ చేసింది రెండో ఆమె, అక్కడ నించి వెళ్లిపొమ్మని. ఆ అమ్మాయి వెళ్లిన కాసేపటికి పోలీసు జీప్ వచ్చింది.
‘నీ పేరు?’ అడిగేడు యుగంధర్ స్టేషన్‌లో తన ఎదురుగా నిలబడిన యువకుడ్ని.
‘రఘు..’
‘ఏం చేస్తున్నావ్?’
‘ఇంజనీరింగ్ లాస్టియర్’ చెప్పాడు.
‘ఏ కాలేజ్?’
జవాబిచ్చాడు.
‘పోతిన మల్లయ్యపాలెం చివరి బస్టాప్‌కి నువ్వు చదివే కూర్మన్నపాలెంలోని ఇంజనీరింగ్ కాలేజీకి మధ్య నలభై కిలోమీటర్ల దూరం ఉంది. కాలేజీ వదిలాక ఇంత దూరం వచ్చి బైక్ తుప్పల వెనుక దాచి రెండు బీరు బాటిళ్లు తాగి, చీకట్లో ఇంటికి పోతున్న అమ్మాయిని ఎందుకు పట్టుకున్నావ్?’
అంతవరకూ పని చేసిన మీరు మత్తు ఒక్కసారిగా దిగిపోయిందతనికి.
‘మేమిద్దరం ప్రేమించుకున్నామండి. ఆమెని కలవడానికి వచ్చాను’ చెప్పాడు రఘు.
‘మంచిదే.. ఆ అమ్మాయి సెల్ నుంచి వచ్చిన ఒక్క కాల్ కాని, ఎస్సెమ్మెస్ కాని చూపించగలవా?’
అతను తలవంచుకున్నాడు.
‘నీ తండ్రి దగ్గర డబ్బుంది. మూడు నెలలకి ఓ కొత్త బైక్ కొంటావు. కాలేజీలో ఉండే సమయం తక్కువ. స్నేహితులు ఎక్కువ. కష్టపడి చదివి పైకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నీ కష్టం కూడా నీ బాబు పడి డబ్బు సంపాదించాడు. బైకుల్ని మార్చినట్టు అమ్మాయిల్ని మార్చటం నీకు సరదా. నీ మీద చాలాకాలం నుంచి నిఘా పెట్టాం. ఇన్నాళ్లకు దొరికావు..’ యుగంధర్ అన్నాడు.

(మిగతా వచ్చే సంచికలో)

-మంజరి