సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు- 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

14
నాతవలస సెంటర్.
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సొకటి ఆ సెంటర్‌లో ఆగింది. పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఒకతను బస్సు దిగాడు. జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకి రెండువైపులా విస్తరించిన ఊరది. ఆ సెంటర్లో రోడ్డు మీద బడ్డీ కొట్లున్నాయి.
ఆ కానిస్టేబుల్‌కి ఓ ఆటోవాలా నమస్కారం చేశాడు. అతన్ని దగ్గరకి రమ్మని తలూపేడు కానిస్టేబుల్.
‘ఈ మధ్య కనిపించడం లేదేం?’ అడిగేడు.
‘మాల వేసుకున్నాను సార్!’ చెప్పాడు ఆటోవాలా.
‘మందు మానేశావా?’
‘తగ్గించాను సార్!’
రెండు క్షణాలు వౌనంగా ఉండి ఆ తర్వాత ప్రశ్నించేడు కానిస్టేబుల్.
‘ఆరేళ్ల క్రితం ఈ సెంటర్లో బ్రోతల్ హౌస్ ఉండేది కదూ?’
‘ఉండేది సార్!’
‘ఇప్పుడు ఉందా?’
‘లేదండి. నాలుగైదుసార్లు రైడ్ చేసి కేసులు పెట్టేసరికి మూతపడింది. అందులోని ఆడవాళ్లు తలో దిక్కూ పోయేరు’ ఆటోవాలా చెప్పాడు.
‘ఆ బ్రోతల్ హౌస్‌లో ఎంతమంది ఆడవాళ్లు ఉండేవారు?’
సమాధానం చెప్పడానికి సందేహించాడతను.
‘ఇక్కడ దిగిన పాసింజర్లని బ్రోతల్ హౌస్‌కి మీరు తీసుకెళ్లేవారని, అక్కడున్న అమ్మాయిల వివరాలు విటులకు మీరు చెప్పేవారని, అందుకు ప్రతిఫలంగా ఓనర్ ద్వారా కొంత సొమ్ము మీకు ముట్టేదని నాకు తెలుసు...’ అని, జేబులోంచి సిగరెట్ పెట్టె తీసి ఓ సిగరెట్ వెలిగించుకున్నాడు కానిస్టేబుల్.
‘ఆరుగురు అమ్మాయిలు ఉండేవారండి’ గొంతు విప్పాడు ఆటోవాలా.
‘సుకాంతి అనే అమ్మాయి పేరు విన్నావా?’
‘లేదు సార్!’
ఇక్కడ ఈ సంభాషణ జరుగుతుండగానే భీమిలి కానిస్టేబుల్ ఒకతను తగరపువలస చేరుకుని తన బైక్ ఓ పక్క ఆపాడు. ఎప్పుడూ జనంతో బిజీగా ఉంటుందా కూడలి. పరిచయమున్న ఇద్దరు వ్యక్తులు ఆ కానిస్టేబుల్ని విష్ చేశారు. బదులుగా తలూపి బైక్ కవర్ నుంచి సంచి ఒకటి తీసి మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ఓ గంటసేపు మార్కెట్ మొత్తం తిరిగి ఇంటికి అవసరమైన కూరగాయలు కొన్నాడు.
నిజానికి స్టేషన్ ఎస్సై అప్పగించిన ఓ పని మీద వచ్చాడతను. తగరపువలస మార్కెట్‌లో తాజా కూరగాయలు చౌకగా దొరుకుతాయనే ఆలోచనతో ఇంటి నుంచి సంచి తెచ్చాడు. అంతే తప్ప అప్పగించిన పని చెయ్యాలని కాదు. కొనే్నళ్ల క్రితం తగరపువలస ప్రాంతంలో ఒక ఒరిస్సా అమ్మాయి వ్యభిచారం చేసిందా? ఇప్పుడామె ఎక్కడుంది? ఈ ప్రశ్నలకి సమాధానం ఎవరు చెబుతారు? స్టేషన్‌కి వెళ్లి ఏం చెప్పాలో నిర్ణయించుకుని కూరగాయలతో తిరుగు ప్రయాణమయ్యాడు.
దీనికి భిన్నంగా కొత్తవలస పోలీసుస్టేషన్‌లో ఉంది వ్యవహారం. సిబ్బంది విశ్రాంతి తీసుకునే రూములోకి ప్రవేశించి తన బాక్సు దగ్గరకు నడిచాడు కానిస్టేబుల్ ఒకతను. బెల్టు, టోపీ బాక్సులో ఉంచి యూనిఫాం తీసేసి ప్యాంట్, షర్టు వేసుకున్నాడు.
అతను స్టేషన్ బయటకొచ్చి ఊరికి వ్యతిరేక దిశలో బైక్ పోనిచ్చాడు. నాలుగైదు కిలోమీటర్లు వెళ్లాక రోడ్డు పక్క ఒక లారీ ఆగి ఉండటం గమనించి బైక్ దూరంగా ఆపాడు. కొత్తవలస నుంచి విజయనగరం వెళ్లే దారిలో ట్రాఫిక్ అంతగా ఉండదు. పావుగంట తర్వాత చెట్ల మధ్య నుంచి ఒకతను బయటకొచ్చి లారీ ఎక్కాడు. మరుక్షణం ఆ లారీ అక్కడ నుంచి వెళ్లిపోయింది. రెండు నిమిషాలకు ఒకామె వచ్చి చెట్టు కింద నిలబడింది.
కానిస్టేబుల్ బైక్ ఆమె దగ్గర ఆపాడు.
‘ఏటి బాబూ! ఇటొచ్చారు?’ అడిగిందామె, తెచ్చిపెట్టుకున్న నవ్వుతో.
‘నీతో పనొచ్చింది...’ చెప్పాడు కానిస్టేబుల్.
‘నాబోటి దానితో మీకేంటి పని బాబూ?’ ఆమె గొంతులో సందేహం.
‘ఎంతకాలం నుంచి ఈ పని చేస్తున్నావ్?’
విచారంగా నవ్విందామె.
‘నా బతుకు సెడిపోయి శానాకాలమైంది బాబూ! ఇద్దరు పిల్లలు పుట్టాక ఒగ్గేశాడు మొగుడు సచ్చినోడు. మరోడు సేరదీశాడు. కాని ఆడికి నా పిల్లలంటే గిట్టదు. బతకడానికి దారినేక ఈ దారిలో నిలబడి ఒళ్లమ్ముకుంటున్నాను. పిల్లలు బడికిపోయేక వస్తాను. బడి నుంచి వచ్చేటప్పటికి ఇంటికి పోతాను’
‘అలా ఎంతకాలం సాగుద్దీ?’ కానిస్టేబుల్ గొంతులో సానుభూతి.
‘తెల్దు బాబూ! శరీరంలో మెరుపు తగ్గితే మర్సిపోతారు జనాలు. అప్పటికి పిల్లలు పెద్దయితే సాలు. ఆ తర్వాత ఏటయినా పర్లేదు’
తను చెయ్యాల్సిన పని గుర్తొచ్చిందతనికి.
‘కొత్తవలస ఏరియాలో ఒరిస్సా అమ్మాయి ఎవరైనా వ్యభిచారం చేస్తోందా?’
‘లేదు బాబూ!’
‘ఇప్పటి సంగతి కాదు, ఆరేడేళ్ల క్రితం సంగతి’
‘తెల్దు బాబూ!’
‘ఎవర్ని అడిగితే తెలుస్తుంది?’
‘రైల్వేస్టేషన్ కాడ బూవమ్మ టీ కొట్టుంది. అదేమన్నా చెప్పొచ్చు’
కానిస్టేబుల్ అక్కడ నుంచి వెనక్కి బయలుదేరాడు. రైల్వేస్టేషన్ ఎదురుగా చిన్న పాకలో ఉంది బూవమ్మ టీకొట్టు. బూవమ్మకి అరవై దాటి ఉంటుంది వయసు. ఆమెను అడిగాడు కానిస్టేబుల్. తనకి తెలియదని అలాంటి వివరాలు చెప్పగలిగిన మనిషి ఒకతను ఉన్నాడని చెప్పిందామె.
ఆ మనిషి భూపతి!
ఈ సమాచారం మొత్తం యుగంధర్‌కి చేరింది.
* * *
అన్నవరం పోలీసుస్టేషన్ ముందు ఆగింది జీపు.
పొట్ట మీదకొచ్చిన యూనిఫాం షర్టు కిందకి లాగి, గంభీరంగా కనిపించడం కోసం కాస్త నిటారుగా నడుస్తూ స్టేషన్‌లోకి ప్రవేశించాడు. జీపు దిగిన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్. సాధారణంగా పోలీసులతో ముఖ పరిచయం ఉంటుంది తప్ప మంచి సంబంధాలు ఉండవు ఎక్సైజ్ వారికి.
అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని పట్టుకుంటే ఎక్సైజ్ వారికి అప్పగించాలి పోలీసులు. ఆ కేసు ద్వారా వచ్చే లోపాయికారి ఆదాయం వారికే చెందుతుంది. అందుచేత అలాంటి కేసు చిక్కినప్పుడు అక్కడికక్కడే పరిష్కరించి లాభం పొందుతారు పోలీసులు ఇది ఎంత రహస్యంగా జరిగినా బయటకి పొక్కుతుంది. పెద్దదొంగ మీద చిన్న దొంగకి జెలసీ ఉన్నట్టుగా ఉంటుంది రెండు శాఖల మధ్య సంబంధం.
కొన్నికొన్ని సందర్భాల్లో ఒకరి సాయం మరొకరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి పని మీదే వచ్చాడు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్.
‘ఇలా వచ్చారేంటి?’ అడిగాడు ఆ స్టేషన్ ఎస్సై. ఎదురుగా కూర్చున్న ఇన్‌స్పెక్టర్ని.
‘ఈ రోజు రాత్రికి రెయిడ్ ఒకటి ఉంది. మీ ఎస్పీగారితో మా సూపర్నెంట్ మాట్లాడారట. మీ దగ్గరకు వెళ్లమన్నారు’ చెప్పాడతను.
ఉదయం ఆ విషయం డిఎస్పీ తనకి చెప్పినట్టు అప్పుడు గుర్తొచ్చింది ఎస్సైకి. నిజానికి అన్నవరం వంటి పుణ్యక్షేత్రం ఉన్న స్టేషన్‌లో పని చెయ్యడం కత్తిమీద సాము. నిత్యం ఎవరో ఒకరు ప్రముఖుడు వస్తాడు. అతను తిరిగి వెళ్లేవరకూ ఊపిరి సలపదు. ఈ రోజు ఇద్దరు మంత్రులు దైవదర్శనానికి రావడంతో ఆ పనిలో పడి మిగతా విషయాలు మర్చిపోయేడు.
‘దేని మీద రెయిడ్?’ అడిగాడు ఎస్సై.
‘గంజాయి రవాణా అవుతోందని సమాచారం వచ్చింది’
‘వాళ్లతో మీ సంబంధాలు దెబ్బతిన్నాయా?’
కలవరపాటు నేర్పుగా కప్పిపుచ్చుకున్నాడు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్.
‘ఇది రొటీన్ వ్యవహారం కాదు. కొంతమంది స్మగ్లర్లు ఎక్కువ మొత్తంలో గంజాయి ఒరిస్సా నుంచి రప్పిస్తున్నారు. వంద మంది కూలీలతో సరుకు రాత్రికి రాబోతోంది’
ఉలిక్కిపడ్డాడు ఎస్సై.
‘ఎంతమంది సిబ్బంది కావాలి?’ అడిగేడు.
‘వెపన్స్‌తో ఇరవై మంది ఉంటే మంచిది’
‘నేనూ రావాలా?’
ఇన్స్‌పెక్టర్ ఓ క్షణం ఆలోచించాడు. ఆ రెయిడ్‌లో ఫలితం తక్కువ, రిస్క్ ఎక్కువ.
‘మీరు రాకపోతే ఎలా?’ అన్నాడు నవ్వుతూ.
‘రవాణా ఏర్పాట్లు మీరు చెయ్యాలి’ చెప్పాడు ఎస్సై.
తలూపి అన్నాడు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్.
‘రాత్రి ఎనిమిదికి రెడీగా ఉంటే వ్యాన్ వస్తుంది’
‘రెయిడ్ ఎక్కడ?’
‘కోటనందూరు నుంచి లోపలకి వెళ్లాలి’
అంతకు మించి వివరాలు చెప్పడం అతనికి ఇష్టం లేదని అర్థమైంది ఎస్సైకి. అంతేకాదు తెలుసుకోవడం తనకి మంచిది కాదని కూడా తోచింది. ఏ కారణం చేతనైనా రెయిడ్ ఫెయిలైతే అది తన మీదకి నెట్టి చేతులు దులుపుకుంటారు ఎక్సైజ్ వాళ్లు.
‘టార్చిలైట్లు కావాలి’ చెప్పాడు ఎస్సై.
‘తెస్తాం’
అతను వెళ్లిపోయేక రైటర్ని పిలిచి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఎస్సై.
రాత్రి ఎనిమిది గంటలకి అన్నవరం పోలీసుస్టేషన్ నుండి సిబ్బందితో బయలుదేరింది వ్యాన్. దానికి దారి చూపిస్తూ ముందు వెళుతోంది సుమో ఒకటి. అందులో ఎక్సైజ్ ఆఫీసర్లతోపాటు కూర్చున్నాడు ఎస్సై. కోటనందూరుకి ఓ కిలోమీటరు ఇవతల తుప్పల్లో ఆగాయి వాహనాలు. అందరూ దిగేక ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ చెప్పాడు.
‘మా కానిస్టేబుల్ ముందు నడుస్తాడు. చప్పుడు చెయ్యకుండా అతన్ని అనుసరించాలి’
అప్పుడప్పుడూ పెన్ టార్చి వెలిగిస్తూ కాలిబాటలో ముందుకి వెళుతున్నాడు కానిస్టేబుల్. ఒకరి వెనుక ఒకరు పెద్ద కొండచిలువ కదులుతున్నట్టుగా అడుగులు వేస్తున్నారు మిగతా వాళ్లు. ఆ నిశ్శబ్ద నిశీధిలో అడవి ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవమవుతోంది అందరికీ.
కోటనందూరు వెళ్లి అక్కడ నుంచి ఏజెన్సీలోకి ప్రవేశిస్తే ఆ సంగతి స్మగ్లర్లకి క్షణాల్లో చేరిపోతుంది. మరుక్షణం అంతా అదృశ్యమై పోతారు. గంజాయి బదిలీ జరిగే చోటుకి చుట్టూ ఓ కిలోమీటరు దూరంలో కాపలా ఉంటుంది. ఆ కాపలాని తప్పించుకోవడానికే మధ్యలో ఎంటరయ్యారు.
ఓ గంట గడిచేక కొండ దిగేరు. ఒరిస్సా నుంచి తూర్పు గోదావరి లోకి వచ్చే మార్గానికి అడ్డంగా ఓ కొండ, అటు ఏలేశ్వరం మార్గంలో మరో కొండ. ఈ మూడు కొండల నడుమ దట్టమైన అడవి ఉంది. ఈ అడవిలోని జీలుగు చెట్ల దగ్గరికి చేరుతుంది ఒరిస్సా నుంచి వచ్చే గంజాయి. ఏ మాత్రం అలికిడి అయినా కొండ ఎక్కి పారిపోతారు స్మగ్లర్లు. ఒక్కొక్కసారి ఎదురుతిరిగి దాడి చేస్తారు.
జీలుగు చెట్లకి రెండు వందల గజాల ఇవతల ఆగి, కాలిబాటకి పక్కనున్న చెట్ల వెనుక అర్ధచంద్రాకారంలో సర్దుకున్నారు అంతా. చిన్న అలికిడి కూడా ఎటు నుంచీ వినిపించడం లేదు. ఆకాశంలోని చంద్రుని వెలుగు చెట్ల కొమ్మల మధ్య నుంచి గీతల్లా నేల మీద పడుతోంది. ఎవరి ఊపిరి వారికే వినిపించేంత చిక్కటి నిశ్శబ్దం. అది ప్రమాదకరమైన రెయిడ్ అని తెలియడంతో అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి.
సమయం నెమ్మదిగా గడుస్తోంది.
ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఆ అడవిలో చెట్ల వెనుక కూర్చుని నిరీక్షించడం చాలా కష్టమైన పని. కొందరు తమ చేతిలోని రైఫిల్స్ చెట్లకి ఆనించారు. రాత్రి పనె్నండు దాటాక దూరంగా సన్నటి అలికిడి వినిపించింది. అది మాటల శబ్దమని, ఒరిస్సా నుంచి సరకు వస్తోందని అర్థమైంది. ఆ సరకు రిసీవ్ చేసుకోవడానికి స్మగ్లర్లు రావాలి. ఎటు నుంచి వస్తారు? సరుకు తీసుకెళ్లే వాహనాలు ఎక్కడుంచారు? ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ మనసులో కదిలాయి ప్రశ్నలు.
అంతా కూడబలుక్కుని నెమ్మదిగా ముందుకి కదలసాగేరు.
‘అమ్మా...’ అరుస్తూ కాలు మెలిక పడటంతో తూలిపడిపోయాడు కానిస్టేబుల్ ఒకతను.
అటు పక్క ఒక్కసారిగా అలజడి. తుపాకి పేలిక శబ్దం వినిపించింది. స్మగ్లర్లు తమని నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమైంది. ఎస్సై పిస్టల్ బయటకు తీసి కాల్చడం ప్రారంభించాడు. కొద్దిసేపు కాల్పుల శబ్దంతో అడవి దద్దరిల్లింది. పది నిమిషాల తర్వాత హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. ముందుకెళ్లే ధైర్యం లేక చెట్ల వెనుక ఉండిపోయేరు సిబ్బంది.
తెల్లవారి వెలుగు వచ్చేవరకూ అక్కడ నుంచి కదల్లేదు. ఒక డెడ్‌బాడీతో పాటు ఇరవై గంజాయి బస్తాలు ఆ ప్రదేశంలో కనిపించాయి.
ఆ బాడీ గురించి తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు పోలీసులు. అది బలరామ్ సాహు శరీరమని చివరికి స్మగ్లర్ల ద్వారానే తెలిసింది. అంతకు మించి వివరాలు లభ్యం కాకపోవడంతో కేసు మూసేశారు. ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టులో జరిగిన సంఘటన.
ఈ సమాచారం కూడా యుగంధర్‌కి చేరింది.

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994