సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎప్పుడెళ్లింది?’ అసహనంగా అడిగేడు షరీఫ్.
‘తెలియదు... ఉదయం నేను వచ్చేసరికి మేము ఎప్పుడూ ఉంచే పూలకుండీ కింద కీ ఉంది. ఇంతవరకూ చూసి రాకపోవడంతో నీకు ఫోన్ చేశాను’ చెప్పింది రమణిమాల.
అప్పుడు ఉదయం పదకొండు అయింది సమయం.
‘బట్టలేమయినా తీసుకెళ్లిందా?’ అడిగి చుట్టూ చూశాడు.
‘లేదు’
‘సరిగ్గా చూశావా?’
‘నువ్వు రావడానికి ముందే వెదికాను. ఆమె వస్తువులన్నీ ఉన్నాయి. పేస్టు, బ్రష్, టవల్ వంటి వస్తువులు కూడా అలాగే ఉన్నాయి’
అతను అపార్ట్‌మెంట్‌లోని రెండు బెడ్‌రూమ్‌లు తిరిగి చూశాడు. రాత్రి తను తాగొచ్చి చేసిన హడావిడికి ఎటైనా వెళ్లిపోయిందా? ఆ సంగతి తెలిస్తే గంగోత్రి తనని బతకనివ్వడు. షరీఫ్ బుర్రలో ఆలోచనలు కదులుతున్నాయి.
‘రాసమణికి సిటీలో తెలిసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా?’ అడిగేడు.
‘లేరు. అసలు ఒంటరిగా బయటకి వెళ్లడానికి ఇష్టపడదు. నాకు చెప్పకుండా ఏ పనీ చెయ్యదు. అలాంటిది చంటిపిల్లతో ఎక్కడకెళ్లిందో..’ దిగులుగా అంది రమణిమాల.
షరీఫ్ బుర్ర చురుగ్గా పని చేసింది.
‘నిన్న మీరిద్దరూ హాస్పిటల్‌కి వెళ్లారు కదా! డాక్టర్ మందులు రాసి ఉంటాడు. అవి ఉన్నాయా?’
‘లేవు’ డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూసి చెప్పింది.
అంటే రాసమణి కావాలనే అక్కడ నుంచి వెళ్లింది. ఎక్కడికి వెళ్లి ఉంటుంది? ఎంత ఆలోచించినా ఆ ప్రశ్నకి సమాధానం తట్టలేదు. సెల్ తీసి ఓ నెంబర్ డయల్ చేశాడు.
‘చెప్పరా చిన్నోడా..’ అటు నుంచి గంగోత్రి గొంతు వినిపించింది.
‘రాసమణి కనిపించడం లేదు’ చెప్పాడు తడారిన గొంతుతో.
‘కనిపించడం లేదా?’ విస్మయంగా అడిగేడు గంగోత్రి.
‘అవును. రమణిమాల హోటల్ నుంచి ఉదయం అపార్ట్‌మెంట్‌కి వచ్చేసరికే తాళం చెవి పూల కుండీ కింద ఉంచి వెళ్లిందట’
‘ఆమె అలా వెళ్లదు. ఏదో జరిగింది...’ సాలోచనగా అన్నాడు గంగోత్రి.
‘రాత్రి రమణిమాల వెళుతున్నప్పుడు ఉంది. ఉదయం వచ్చేసరికి లేదు. ఆమె వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి. తన కూతురికి డాక్టర్ రాసిన మందులు మాత్రం తీసికెళ్లింది.’
‘సరే.. వెంటనే మనవాళ్లని పంపి వెతికించు. ఆ ప్రాంతంలోని ఆటోస్టాండ్‌లో ఎంక్వయిరీ చెయ్యి. ఆమెకి ఏదైనా అయితే భూపతి మనని ప్రాణాలతో ఉండనివ్వడు. రాసమణి అంటే చాలా అభిమానం అతనికి’
ఉలిక్కిపడ్డాడు షరీఫ్. రాత్రి తన నిర్వాకం గురించి భూపతికి తెలిస్తే ఎంత ప్రమాదమో అర్థమయింది.
‘ఆమెని ఎలాగైనా వెతికి పట్టుకుంటాను’ చెప్పి సెల్ ఆఫ్ చేశాడు. అప్పటికే అతని శరీరం చెమటతో తడిసింది.
‘ఒకవేళ రాసమణి వస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్యి..’ రమణిమాలతో చెప్పి అపార్ట్‌మెంట్ నుండి బయటకొచ్చాడు. రాసమణి సెల్‌కి కాల్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని వినిపించింది. షరీఫ్ స్కూటర్ సమీపించాక ఓ ఆలోచన వచ్చింది. వాచ్‌మేన్ ఉండే గదివైపు నడిచాడు. తీరిగ్గా కూర్చుని చుట్ట కాలుస్తున్న వ్యక్తిని అడిగాడు.
‘రాత్రి పది దాటాక ఫోర్‌నాట్ ఫోర్‌కి ఎవరైనా వచ్చారా?’
‘లేదు బాబూ!’ చెప్పాడతను. నోట్లోని చుట్ట తీసి రెండు వేళ్లతో పట్టుకుని గుప్పిట మూశాడు.
‘ఆ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఒకావిడ చంటిబిడ్డతో బయటకు వెళ్లిందా?’
‘లేదు బాబూ!’
‘రాత్రి ఎన్ని గంటలకి గేటుకి తాళం వేస్తావ్?’
‘గ్రౌండ్ ఫ్లోర్‌లోని డాక్టర్ గారు వచ్చాక పదకొండుకి తాళం వేస్తాను బాబూ! ఆ తర్వాత ఇంకెవరూ కారు మీద రారు. ఒకవేళ సెకండ్ షోకి వెళ్లినా, ఫంక్షన్‌కి వెళ్లినా ఆలస్యంగా వస్తామని ముందే చెబుతారు. నా సెల్ నెంబర్ అందరి దగ్గరా ఉంది’ వివరించేడు.
‘అంటే రాత్రిపూట మేలుకుని ఉండవా?’
‘సెక్రటరీగారు వద్దనేసారు’
షరీఫ్ డొక్కు స్కూటర్ ఆటోస్టాండ్ వైపు కదిలింది.
* * *
కుర్చీలో అశాంతిగా కదిలాడు రాజేష్.
పని మీద దృష్టి నిలుపనివ్వకుండా బుర్రలో గజిబిజిగా సంచరిస్తున్నాయి ఆలోచనలు. ఈత రాని వాడు ఏ సాధనం లేకుండా సముద్రాన్ని దాటి గమ్యం చేరడం ఎలాంటిదో సరిగ్గా అలాంటి సమస్య వచ్చిందతనికి.
ఓ కస్టమర్ ఎదురుగా కూర్చోవడంతో రాజేష్ ఆలోచనలకి ఫుల్‌స్టాప్ పడింది.
‘ఏం కావాలి మీకు?’ అడిగేడు రాజేష్.
‘వారం క్రితం స్టేట్ బ్యాంక్ డి.డి. ఇచ్చాను. ఆ అవౌంట్ నా అకౌంట్‌కి జమ కాలేదు’ చెప్పాడతను.
‘అవౌంట్ ఎంత?’
‘అయిదు లక్షలు’
రాజేష్ నొసలు ముడిపడింది.
అతని పాస్‌బుక్ తీసుకుని అక్కౌంట్ ఓపెన్ చేశాడు. అందులో అయిదు లక్షలు డిపాజిట్ లేదు. అతను ఆరో తేదీన డి.డి. ఇచ్చాడు. అంటే మరునాడు క్లియరెన్స్ అయి వచ్చి ఉంటుంది. ఆ రోజు ఓచర్స్ తెప్పించి చూశాడు. అవౌంట్ అక్కౌంట్‌కి జమ చేసినట్టు సంతకాలు ఉన్నాయి. మరి డబ్బు ఏమయింది?
‘పది నిమిషాలు కూర్చోండి, చెక్ చేస్తాను’ చెప్పాడు కస్టమర్‌తో.
కస్టమర్ల అక్కౌంట్‌లోని సొమ్ము తన ఖాతాకి బదిలీ చేసుకుని దాన్ని దుర్వినియోగం చేసిన బ్యాంక్ మేనేజర్ని ఈ మధ్యనే పట్టుకున్నారు. కాని ఇది అలాంటిది కాదు. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్ తనే చేసినట్టు గుర్తుంది రాజేష్‌కి. ఓచరు మీద అక్కౌంట్ నెంబర్ సరిగ్గానే ఉంది. అప్పటికే ఆలోచనలతో అలసిపోయిన రాజేష్ బుర్ర పని చెయ్యడం మానుకుంది. లేచి టాయిలెట్ వైపు అడుగులు వేశాడు. దోసిలితో చల్లటి నీరు తీసుకుని ముఖం మీద చల్లుకున్నాడు. కాసిన్ని నీళ్లు తాగి ముఖం తుడుచుకుని తిరిగొచ్చి తన సీటులో కూర్చున్నాడు.
ఏడో తేదీ ట్రాన్సాక్షన్ మొత్తం ఓసారి పరిశీలించాడు. అయిదు లక్షలు డిపాజిట్ చేసినట్టు ఉంది. మరింత జాగ్రత్తగా చూశాడు. అక్కౌంట్ నెంబర్‌లోని ఓ అంకె తప్పు కొట్టినట్టు గమనించాడు. అదురుతున్న గుండెతో ఆ అక్కౌంట్ ఓపెన్ చేశాడు. నెలకి ఒకసారి మాత్రమే బ్యాంక్‌కి వచ్చే పెన్షనర్ అక్కౌంట్ అది. డిపాజిట్ అయిన అయిదు లక్షలు అందులో ఉంది. వెంటనే ఓచర్స్ తీసుకుని మేనేజర్ రూములోకి వెళ్లాడు.
‘చిన్న తప్పు జరిగింది సార్!’ అంటూ మొత్తం మేనేజర్‌కి వివరించాడు.
‘మిస్టర్ రాజేష్! ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్?’ అడిగేడు మేనేజర్.
‘నో సార్!’ ఉలికిపాటు కప్పిపుచ్చుకుని చెప్పాడు.
నవ్వుతూ చూసేడు మేనేజర్.
‘నీకు తెలుస్తున్నదో లేదో నాకు తెలియదు. ఈ మధ్య నీలో విపరీతమైన మార్పు కనిపిస్తోంది. రాత్రంతా నిద్ర లేనట్టు ముఖం పీక్కుపోయింది. ఇప్పుడు జరిగిన తప్పు నీ మానసిక స్థితి ఎలా ఉందో పట్టి చూపుతోంది. డిపాజిట్ అయిన సొమ్ము ఆ అకౌంట్ హోల్డర్ డ్రా చేసి ఉంటే చిక్కుల్లో పడేవాళ్లం. అతను పెన్షనర్ కాబట్టి సరిపోయింది. ఆ ట్రాన్సాక్షన్ కాన్సిల్ చేసి అవౌంట్ అతని అక్కౌంట్‌లో జమ చెయ్యి. నువ్వు కొద్దిరోజులు సెలవు తీసుకుని ఎటైనా వెళ్లి రావడం మంచిదని నా సలహా..’ చెప్పాడు.
‘అవసరం లేదు సార్!’ చెప్పాడు. కాని సెలవు తీసుకోవాల్సిన అవసరం వస్తుందని ఆ క్షణంలో అతనికి తెలియదు.
ఆ పని ముగించి కస్టమర్ని పంపించేసరికి పనె్నండు కావస్తోంది. లేచి టాయిలెట్‌లోకి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడం గమనించి సెల్ తీసి అంతకు ముందు ఫీడ్ చేసుకున్న నెంబర్‌కి కాల్ చేశాడు. అవతల గొంతు వినిపించాక చెప్పాడు.
‘నా పేరు రాజేష్ సార్!’
పోలీసు కమీషనర్‌తో సంభాషణ రెండు నిమిషాల్లో ముగిసింది. అతను తిరిగొచ్చి తన సీటులో కూర్చున్నాడు. సాయంకాలం నాలుగు తర్వాత క్రైం బ్రాంచ్‌కి వెళ్లాలని నిర్ణయించుకుని పనిలో మునిగిపోయేడు. ఇప్పుడతని మనసులోని ఆందోళన కొద్దిగా తగ్గింది. లంచ్‌కి వెళ్లబోతుండగా సెల్ మోగడంతో ఆన్సర్ బటన్ నొక్కి,
‘హలో...’ అన్నాడు.
‘మీరు రాజేష్ కదూ?’ అటు నుంచి ఎవరో అడిగారు.
‘అవును. మీరెవరు?’ ప్రశ్నించేడు.
‘నా పేరు యుగంధర్. ప్రస్తుతం క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ని. మీరు మా ఆఫీస్‌కి వస్తానని రెండు గంటల క్రితం చెప్పారు...’
యుగంధర్ పేరు వినగానే ఎన్‌కౌంటర్ గుర్తొచ్చింది రాజేష్‌కి.
‘నేను డ్యూటీలో ఉన్నాను సార్! నా పని అయ్యేసరికి సాయంకాలం నాలుగు దాటుతుంది. అయిదు గంటలకి ఆఫీసుకొచ్చి మిమ్మల్ని కలుస్తాను’ చెప్పాడు.
‘సరే.. మీరొస్తారని ఇంతవరకూ లంచ్‌కి వెళ్లలేదు. సాయంకాలం ఆఫీసులో మీ కోసం చూస్తుంటాను. ఎందుకంటే, మీ ఫోన్‌కాల్ నన్ను క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ని చేసింది’ యుగంధర్ నవ్వు వినిపించింది.
సెల్ ఆఫ్ చేశాడు రాజేష్.
* * *
టేబుల్ మీదున్న కంప్యూటర్ షీట్లు అందుకున్నాడు యుగంధర్. విశాఖపట్నం సిటీ కమీషనరేట్‌తో నమోదయిన నేరస్తుల నుంచి భూపతి పేరుగల వారి వివరాలు అవి. ఆ పేరుగల నేరస్తులు ఇద్దరే ఉన్నారు. ముందుగా వారి ఫొటోలు చూసి దిగువ భాగంలోని వివరాలు చదవసాగేడు.
పేరు: అల్లం భూపతి
వయసు: 29 సం.లు
ఊరు: భీమవరం
వృత్తి: వ్యాపారం
ఫ్యామిలీ: భార్య, ఓ కొడుకు
చిరునామా: ఎండాడ
నేర స్వభావం: హత్య. కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
అల్లం భూపతి భీమవరంలోని పొలాలు అమ్ముకుని అయిదేళ్ల క్రితం విశాఖపట్నం వచ్చాడు. ఎండాడ ప్రాంతంలో ఓ ఇల్లు కొని కాపురం పెట్టాడు. రెండు ట్రాక్టర్లు, ఓ లారీ తీసుకుని బిల్డింగ్ మెటీరియల్ సప్లై చెయ్యడం ప్రారంభించేడు. నాలుగేళ్ల కాలంలో ఆ వ్యాపారంలో నిలదొక్కుకున్నాడు.
ఒకరోజు భూపతి దగ్గర డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి శవం కైలాసగిరి కొండ మీద తుప్పల్లో కనిపించింది. రాయితో తలమీద బలంగా కొట్టడం వల్ల ప్రాణం పోయింది. హత్య సాయంకాలం ఆరు నుంచి ఏడు మధ్య జరిగినట్టు పోస్టుమార్టమ్‌లో తేలింది. నిజానికి ఆ డ్రైవర్ ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి సాయంకాలం ఆరు నుంచి మరునాడు ఉదయం వరకూ ట్రాక్టర్‌తో గ్రావెల్ తోలాలి. ఓనర్ ఇంటి నుంచి సాయంకాలం అయిదుకి ట్రాక్టర్ తీసుకుని బయలుదేరాడు. కైలాసగిరి కొండ కింద హనుమంతువాక హైవేలో రోడ్డుపక్క ట్రాక్టర్ ఉంది. డ్రైవర్ శవం పైన కొండ మీద ఉంది.
ఏ కోణం నుంచి దర్యాప్తు చేసినా హత్యకి కారణం తెలియలేదు. కైలాసగిరి కొండకి నడిచి వెళ్లే వారి కోసం మూడు మార్గాలు ఉంటే వాహనాల మీద వెళ్లే వారికి ఒక్కటే రోడ్డు ఉంది. ఆ దారిలోని టోల్‌గేటు నుంచి ఆ రోజు కొండ మీదకి వెళ్లిన వాహనాల వివరాలు తీసుకున్నాడు దర్యాప్తు అధికారి. వాటిలో భూపతి బైక్ ఉంది.
హత్య జరిగిన రోజు భూపతి బైక్ వెనుక కూర్చుని వెళ్లడం చూసిన వాళ్లున్నారని చెప్పడంతో డ్రైవర్ భార్య నిజం ఒప్పేసుకుంది. చాలాకాలం నుంచి భూపతికి ఆమెతో అక్రమ సంబంధం ఉంది. ఆ రోజు డ్రైవర్ ట్రాక్టర్ని తీసుకెళ్లాక బైక్ మీద అతని భార్యని తీసుకుని కైలాసగిరి బయలుదేరాడు భూపతి. హనుమంతవాక దగ్గర ట్రాక్టర్ ఆపి వైన్‌షాపులోకి దూరిన డ్రైవర్ వాళ్లిద్దర్నీ చూశాడు. వెంటనే అటువైపు ఉన్న మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లాడు. పార్కింగ్ ప్లేస్‌లో బైక్ వదిలి కొండ చివరికి వచ్చిన భూపతి ఓ పొదలోకి నడిచాడు.
అది గమనించిన డ్రైవర్ వాళ్ల వెనుక వెళ్లాడు. అక్కడ జరిగిన ఘర్షణలో డ్రైవర్ని రాయితో కొట్టి హతమార్చాడు భూపతి. డ్రైవర్ భార్య అప్రూవర్‌గా మారడంతో భూపతికి శిక్ష పడింది.
రెండో షీట్ మీదకి దృష్టి సారించేడు యుగంధర్.
పేరు: లింగంపల్లి భూపతి
వయసు: 35 సం.లు
ఊరు: పాయకరావుపేట
వృత్తి: రౌడీయిజం
ఫ్యామిలీ: లేరు
చిరునామా: లక్ష్మీ టాకీస్ సెంటర్
నేర స్వభావం: ఒన్ టౌన్‌లో రౌడీ షీటర్
చిన్న వయసులో పాయకరావుపేట నుంచి విశాఖపట్నం వచ్చాడు లింగంపల్లి భూపతి. ఒన్ టౌన్ ప్రాంతంలో అలగా జనంతో తిరిగి ఇనుపముక్కలు దొంగతనాలు చేసేవాడు. వయసు పెరిగినకొద్దీ రౌడీగా మారాడు. ఓ వ్యభిచార గృహ యజమాని దగ్గర పని చేసేవాడు. ఆ తర్వాత కాలంలో అదే అతని వృత్తి అయింది. చిన్నచిన్న కేసుల్లో జైలుకి వెళ్లొచ్చాడు. చివరగా ఓ వ్యక్తిని గాయపరిచిన కేసులో మూడేళ్లు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు అతని ఆచూకీ లేదు.

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994